Suryaa.co.in

Andhra Pradesh

వాళ్ల ఏడుపు.. ప్రపంచ ఏడుపు కావాలట!

– అవినీతి కేసులో అరెస్టు అయితే.. టీడీపీ చిల్లర వేషాలా..?
– బాబేమన్నా పోరటా యోధుడా..? లేక విప్లవకారుడా..?
– ప్రోటోకాల్‌ ప్రకారం అరెస్ట్‌ చేయలేదన్నదే వారి ఏడుపంతా..!
– రూ.3వేల కోట్లు చూపించి.. రూ. 371 కోట్లు నొక్కేశారు
– విచారణకు రాకుండా కేసులు కప్పేయడమే బాబు నైజం
– హత్యకు కుట్ర చేసి అమలు చేయలేకపోయాం.. అన్నట్టు ఉంది వారి వాదన..!:
– తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఇది
– స్కిల్‌ స్కాంపై చర్చకు టీడీపీ సిద్ధమా..?
– పేరుకు బీజేపీ అయినా..ఆమె టీడీపీ అధ్యక్షురాలే
– వెన్నుపోటు కుట్రదారులంతా, బాబు వెంటే..!
– అమరావతి పేరుతో భారీ స్కాం కు కుట్ర.. జరిగి ఉంటే లక్షల కోట్లు కొట్టేసేవారు
– బాబును కాపాడటం కోసమే పురందేశ్వరి అర్జంటు ఢిల్లీ పర్యటనలు
– మద్యం స్కాం అనేది సాకు మాత్రమే..ఆమె చేసేవన్నీ రాజకీయ ఆరోపణలే.
-: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి 

ప్రోటోకాల్‌ ప్రకారం అరెస్ట్‌ చేయలేదంటారే కానీ, దోచుకోలేదని చెప్పరు:
స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత, న్యాయస్థానంలో సుధీర్ఘ వాదనలు విన్న తర్వాత, స్కాం జరిగిందని, అందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు విశ్వసించడం వల్ల రిమాండ్‌కు పంపారు. ఆ రోజు నుంచీ మొత్తం కోర్టులను వేదికలుగా చేసుకుని ఇప్పుడు సుప్రీం కోర్టుకు మారారు.

చంద్రబాబు న్యాయవాదులు, ఆ పార్టీ నాయకులు ఒక్కటే చెబుతున్నారు- మా బాబును ప్రోటోకాల్‌ ప్రకారం చేయాల్సిన పద్దతిలో అరెస్టు చేయలేదు కాబట్టి- అరెస్టు చెల్లదు అంటున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబును అరెస్ట్‌ చేశారు అంటున్నారు. నేరం జరగలేదు..అని చెప్పడానికి ఆధారాలు చూపలేకపోతున్నారు. మహా అయితే కంప్యూటర్లు, సీమెన్స్‌ బోర్డులు చూపిస్తున్నారు.

స్కిల్ కు సంబంధించి మొత్తం రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పి, అందులో రూ.3వేల కోట్లు సీమెన్స్‌ సంస్థ పెడుతుందని చెప్పారు. మరో రూ.371 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని ఒప్పందం చేసుకోడానికి క్యాబినెట్‌లో నిర్ణయించారు.

క్యాబినెట్‌ నిర్ణయానికి సంబంధం లేకుండా రూ.371 కోట్లు విడుదల చేయడానికి స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పోరేషన్, సీమెన్స్‌ అప్పటి ఎండీ, డిజైన్‌ టెక్‌ వాళ్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. రూ.371 కోట్ల ప్రజాధనం వేరే వారికి అప్పజెప్తున్నప్పుడు వచ్చే వాడు ఏం చేస్తున్నాడో చూడకుండా అగ్రిమెంట్‌ చేసుకోవడం, జీవో విడుదల చేయడం తప్పు.

అసలు ఊరు, పేరు, డేట్‌ ఏమీ లేకుండా రూ.371 కోట్లు విడుదల చేయడానికి చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. అధికారులు అభ్యంతరం చెబుతున్నా నిధులు విడుదల చేయించుకున్నారు. చంద్రబాబుకు అనుకూలమైన బయటి వ్యక్తిని తీసుకొచ్చి ఎండీ, సీఈవోతో పాటు అనేక పదవులు కూడా కట్టబెట్టారు. సరే..ఈ రూ.371 కోట్లతోనైనా ఏదన్నా స్కిల్ నైపుణ్యం అందిస్తే బాగుండేది. అదీ చేయలేదు.

విడుదల చేసిన ఈ రూ.371 కోట్లు ఎక్కడికి పోయింది..? సీమెన్స్‌కు వెళ్లలేదు. డిజైన్‌ టెక్‌కు వెళ్లి..అక్కడి నుంచి రూ.241 కోట్లు షెల్‌ కంపెనీలకు వెళ్లింది. అలా రూ.241 కోట్లు బయటకు వెళ్లిందని 2017లోనే జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ వారు సమాచారం అందించారు. 2018లో సీమెన్స్‌ కంపెనీ కూడా ఇంటర్నల్‌ ఎంక్వైరీ చేసి మాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పింది.

రూ.3వేల కోట్లు చూపించి.. రూ. 371 కోట్లు నొక్కేశారు:
ఏ స్టెప్‌లోనూ చంద్రబాబు నాకు తెలియదు అనడానికి, కుట్ర పూరితంగా పథకం ప్రకారం జరగలేదనడానికి అవకాశమే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ నేరుగా రూ.371 కోట్లు డబ్బు జేబులో వేసుకోడానికి వీళ్లేదు కాబట్టి ఈ పద్ధతిలో దోచేశాడు. రూ. 3వేల కోట్ల పెద్ద ఎమౌంట్‌ చూపించి రూ.371 కోట్లను నొక్కేశారు.

దీనికి ఆధారాలున్నాయన్న తర్వాతనే చంద్రబాబు అరెస్ట్‌ చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో కేసును రహస్యంగా విచారణ చేయించి ఆధారాలను మాయం చేశారు.ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021లో కేసు కట్టి సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్‌ చేసింది.

ఈ దశలో అన్నీ వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తున్నప్పుడు ఇంత పెద్ద నేరం కాబట్టి అరెస్ట్‌ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావించింది. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టారు.. కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపింది.

విచారణకు రాకుండా కేసులు కప్పేయడమే బాబు నైజం:
చంద్రబాబు అండ్ కో.. మాట్లాడాల్సింది జరిగిన అవినీతిపైనైతే..ఈ నెలరోజులూ క్వాష్‌ మీదనే మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకు తెలిసిన ఏకైన విద్య, ఏ కేసూ విచారణకు రాకముందే, దానిని కప్పేయడం. అంటే సమాధి చేయడం.

ఇప్పటికి పది మంది వరకూ చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులపై కేసులు వేశారు. అన్నింటిలో ఏదో ఒక టెక్నికల్‌ రీజన్‌ చూపించి ముందే కొట్టేయించుకోవడం ఆయనకు అలవాటు. మొన్నటికి మొన్న ఐటీ నోటీసుల్లోనూ ఇలానే వాదించాడు. ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లోంజీ వారి నుంచి చంద్రబాబుకు రూ.120 కోట్లు ముడుపులు అందాయని ఐటీ నోటీసులు ఇచ్చింది.

టిడ్కో హౌసింగ్‌ కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఈ ముడుపులు అందాయని తేలితే – అది తన ఐటీ రీజనల్‌ పరిధిలోకి రాదని వాదించాడు. దాంతో ఇన్‌కం ట్యాక్స్‌ వాళ్లకు మండి ఆధారాలతో సహా ఆయన చరిత్ర మొత్తం బయట పెట్టారు. ఇన్‌కం ట్యాక్స్‌ వాళ్లు నోటీసిస్తే వారికే పరిధి గురించి పాఠాలు చెప్తాడు.

వ్యవస్థలను మేనేజ్‌ చేయగల సత్తా గతంలో ఆయనకు బాగా ఉండేది కాబట్టి అన్నీ మేనేజ్‌ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని కేసుల్లానే దీన్ని కూడా చాపకిందకు నెట్టేద్దామనుకుంటే కుదరడం లేదు. దీనితో పాటు ఫైబర్‌ నెట్, టిడ్కో హౌసింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు ఉన్నాయి.

ఈ కేసుల్లో ఎవరైతే ముడుపులు తీసుకుని చంద్రబాబుకు అందజేశారని ఇన్‌కం ట్యాక్స్‌ బయటపెట్టిందో ఆ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేశ్‌లకు డబ్బు ఎలా ఇచ్చారు అనేది కూడా బయటకు వచ్చింది. గత నెల సీఐడీ వీళ్లపై దృష్టి పెట్టడంతో శ్రీనివాస్‌ పెండ్యాల, మనోజ్‌వాసుదేవ్ పార్ధసానిలు రాత్రికి రాత్రి విదేశాలకు జంప్‌ అయ్యారు.

చంద్రబాబు తనకు ఉప్పందగానే సాక్షులను రాత్రికి రాత్రే దేశాలు కూడా దాటించగలడని తేలడంతో బయటుంటే మొత్తం తారుమారు చేస్తాడని సీఐడీ అరెస్టు చేసినట్లుంది.

మొత్తం కేసుల్లో పాత్రదారి, సూత్రదారి, లబ్ధిదారు చంద్రబాబే. కుట్ర జరగటం నుంచి దాన్ని ముందుకు నడిపించడం వరకూ పక్కా ఆధారాలతో దొరికిపోయాడు. దానిలో కీలకమైన ఈ స్కిల్‌ కేసులో లేని సొమ్ము రూ.3వేల కోట్లు చూపించి.. రూ.371 కోట్లు కొట్టేశాడు.

నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఇది:
నేరం గురించి, దోచుకున్న దాని గురించి మాట్లాడకుండా 17ఏ అంటూ వాదిస్తూ ఉన్నారు. ఇలానే ఉంటే ఎవరు తప్పు చేసినా దీన్ని చూపించి తప్పించుకునే అవకాశాలున్నాయి.ఇతను, గతంలో ముఖ్యమంత్రి…మళ్లీ కావాలని ఆరాటపడుతున్నాడు..ఒక పార్టీని నడుపుతున్నాడు.

2 ఎకరాల నుంచి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లకు ఎదిగాడని తెలిసినా.. ఈ కేసుల్లో ఎలా దోచుకున్నాడో కళ్ళకు కట్టినట్లైయింది.ఈ కేసుల్లో అడ్డంగా దొరికాడు..తన సంతకాలున్నాయి..డైరెక్షన్‌ ఉంది..ఇది చాలదన్నట్లు ఎవరితోనో అక్రమాలు చేయిస్తున్న గంటా సుబ్బారావును తెచ్చి తన చంకలోనే పెట్టుకున్నాడు. బహిరంగంగా, బరితెగించి రూ.371 కోట్లు బయటకు పంపి, దానిలో రూ.241 కోట్లు తనే తీసుకున్నాడు.

ప్రజా కోర్టులో తన నిర్ధోషిత్వం ఇదీ.. అని చంద్రబాబు నిరూపించుకోవాల్సిన సమయం ఇది. టీడీపీ వారు అతితెలివితో మాట్లాడుతూ… స్కాం జరిగి ఉండొచ్చు..కానీ చంద్రబాబుకు ఏం సంబంధం, ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు.. క్యాబినెట్‌ అప్రూవ్‌ చేస్తే బాబుకు ఏం సంబంధం అంటున్నారు. దీనిపై తీర్పు ఇవ్వాల్సిన ప్రజలున్నారు..త్వరలో వారి వద్దకు వెళ్లబోతున్నాం.

దమ్ముంటే..సత్తా ఉంటే ఆయన కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ మేం నేరం చేయలేదు అని నిరూపించుకోవాలి. లేకపోతే, ప్రజల ముందు నైతిక బాధ్యత వహించి జరిగిన తప్పును ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి ఉంటేనే ప్రజల ముందుకు వెళ్లే అర్హత వస్తుంది. నేరం జరిగింది మీ హాయంలోనే..అలా తెలిసినప్పుడైనా విచారణ వేసి ఉంటే మీ నిజాయితీ నిలబడేది.

ఆనాడు వోక్స్‌ వాగన్‌ కేసు వస్తే.. రాజశేఖరెడ్డి గారు సీబీఐకి ఇచ్చారు. కానీ చంద్రబాబు స్కాం గురించి జీఎస్టీ చెప్పినా పట్టించుకోలేదు.. పైగా, స్కాంను కప్పెట్టేందుకు ఫైళ్లు మాయం చేశాడు. ఆ షాడో ఫైల్‌ ఉందని తెలిస్తే దాన్ని కూడా మాయం చేసి ఉండేవాడు.

దీని నుంచి తప్పించుకోలేమని తెలుసు కాబట్టే..ఇది ఎప్పటికైనా దొరక్క తప్పదని తెలుసు కాబట్టే విచారణకు రాకుండానే కేసు కొట్టేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ తర్వాత, బయటకు వస్తే 73 ఏళ్ల నన్ను జైళ్లో వేశారని ప్రజల వద్ద దొంగ ఏడుపులు ఏడిచి సానుభూతి కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అంతగా నిలబడని క్వాష్‌ మీదనే వాదిస్తున్నారు.ప్రజలు మాత్రం నిలదీస్తున్నది..గ్రహించింది చంద్రబాబు నిలువు దోపిడీ చేశాడని, అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నాడని గమనించారు. వీళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, జాకీలు పెట్టి లేపినా టీడీపీ వాళ్లు కూడా మొహం చాటేస్తున్నారు. అసలైన కొడుకు వెళ్లి ఢిల్లీలో దాక్కున్నాడు. ఇక్కడా ఎవరూ పట్టించుకోవడం లేదు. నువ్వు దోషివి అనేది ప్రజలందరూ నిర్ధారణకు వచ్చారు.

హత్యకు కుట్ర చేసి అమలు చేయలేకపోయాం అన్నట్టు..!:
నిన్న మొన్నటి వరకూ మమ్మల్నేం పీకుతారు… అంటూ మాట్లాడిన లోకేశ్‌, చంద్రబాబును అరెస్ట్‌ చేయగానే ఢిల్లీలో దాక్కున్నాడు. నెలన్నర తర్వాత నిన్న వచ్చి నాకేం తెలియదు..ఇన్నర్‌ రింగ్‌ రోడ్డే లేని దాంట్లో కుట్ర ఏముంటుంది అంటున్నాడు. ఏ ఆదాయం లేకుండా హెరిటేజ్‌ కోసం ఇక్కడే ఎందుకు భూములు కొన్నారు..?

లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో ఉన్నాక, వారికోసం అలైన్‌ మెంట్‌ పక్కకు జరపలేదా?. రాని ప్రాజెక్టులో లాభం ఏముంటుంది అంటున్నారు..కట్టి ఉంటే కాంట్రాక్టుల్లో కూడా మింగేసి ఉండేవారు కాదా.. వీరి వాదన ఎలా ఉందంటే.. హత్యకు కుట్రకు చేసి..హత్య చేయలేదు.. అమలు చేయలేకపోయాం అంటే ఊరుకుంటారా? అమరావతి అంతా కుట్రనే..అది జరిగి ఉంటే లక్షల కోట్లు కొట్టేసి ఉండేవారు. కాకుండానే రైతులను, జనాన్ని, కంపెనీలను, ప్రభుత్వాలను మోసం చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు.

నిజంగా అది జరిగి ఉంటే సింగపూర్‌ బినామి కంపెనీలకు ఇచ్చిన 4వేల ఎకరాలు, హెరిటేజ్‌ ఇతర భూములన్నీ కలిపి అలానే ఉంచుకుంటే ఆయన మనవడు పెద్దయ్యే సరికి ఈ స్కాం మరో లక్షకోట్లుకు చేరుతుంది.పైసాకు కక్కుర్తి పడ్డాడు…వందల కోట్లకూ కక్కుర్తి పడ్డాడు..నన్నెవరు ప్రశ్నిస్తారులే… అనే అహంకారం పెరిగి, బరితెగించి చంద్రబాబు ఈ స్కాములు చేశాడు.

పేరుకు బీజేపీ అయినా..ఆమె టీడీపీ అధ్యక్షురాలే:
బాబు వదిన పురంధేశ్వరి.. పేరుకు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలుగానే వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది.ఢిల్లీకి వెళ్లి అర్జంటుగా ఆయన్ను విడుదల చేయించాలనే ప్రయత్నంలో ఆమె ఉన్నట్లున్నారు. కుటుంబ పరంగా ఆమె చేయడంలో తప్పు లేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఆమె చంద్రబాబు కోసం పనిచేశారు. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు కోసం అవసరమైతే తమ తండ్రిని ఏదైనా చేయడానికి కూడా వెనకాడలేదు.

అప్పుడూ ఇప్పుడూ ఆ వెన్నుపోటు కుట్రదారులంతా, బాబు వెంట ఉండటం చంద్రబాబు అదృష్టం. అవసరమైతే భవిష్యత్తులో మీకు సహకరిస్తారని కూడా బీజేపీకి చెప్తున్నట్లున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ ఎలా ఉండేది..ఇప్పుడెలా ఉందో పురంధేశ్వరి కూడా తెలుసు.

ఆనాడు చంద్రబాబు ఇచ్చిన లైసెన్సులు, బ్రాండ్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది అంటే దాని అర్ధం ఏంటో ఆమె గమనించాలి. మేం కొత్త బ్రాండ్లు ఇవ్వలేదు..కొత్త లైసెన్సులూ ఇవ్వలేదు. ఆమె ఒక సారి వెనక్కి తిరిగి చూస్తే … చంద్రబాబు హయాంలో ప్రైవేటు సిండికేట్‌ ఎలా ఉండేది తెలుస్తుంది. మద్యంపై ఎవరు ఆరోపణలు చేసినా, అవి రాజకీయ ఆరోపణలే అవుతాయి.

ఈమె ఇంత హడావుడిగా ఢిల్లీ వెళ్లడం వెనుక చంద్రబాబు అరెస్టు విషయం తప్ప వేరేది కనిపించడం లేదు. పైకి మాత్రం మద్యంపై ఫిర్యాదు అంటూ చెప్పుకొస్తున్నారు. మా ప్రభుత్వ మద్యం పాలసీ అంతా పారదర్శకంగా ఉంది..రాష్ట్ర ఖజానాకు ఆదాయం నేరుగా వస్తోంది. దాంట్లో ఆరోపణలు చేస్తున్నారంటే రాజకీయం కాక ఏముంంది..?

స్కిల్‌ స్కాంపై చర్చకు సిద్ధమా..? :
స్కిల్‌ స్కాంకు సంబంధించినంత వరకూ వారు ఆథరైజ్డ్‌ వ్యక్తులు ముందుకు వస్తే జర్నలిస్టుల సమక్షంలో చర్చకు మేం సిద్ధం. స్కాం విషయంలో వాస్తవాలు బయటకు రావాలి కదా..?

క్యాబినేట్‌ నిర్ణయాన్ని పూర్తిగా డీవియేట్‌ అయితే తప్పు కాదా?. పోలవరం నిధులైతే.. తన హయాంలో అడ్వాన్సులు కూడా క్యాబినెట్‌లో అప్రూవ్‌ చేయించుకున్నాడు.

అడ్వాన్సులు రికవరీ చేయాల్సిన అవసరం ఇప్పట్లో లేదని కూడా క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నాడు. ఇలా చిన్న చిన్న వాటిని కూడా క్యాబినెట్‌లో పెట్టిన చంద్రబాబు స్కిల్‌ స్కాం విషయంలో మాత్రం అలా కాందంటే ఎలా?.

ప్రపంచంలోనే ఇలాంటి దోపిడీ ఇక్కడ ఒక్కచోటే జరిగి ఉంటుందేమో..? గాలిలో మేడ ఉందని.. డబ్బు దోచేయడం ప్రపంచంలోనే అరుదైన విషయం కావచ్చు. భ్రమల్లో పెట్టి డబ్బులు కొట్టేసే వాడే ధర్మకర్త అయితే అది ఎంత ఘోరమో ఆలోచించాలి.నిన్ను నమ్మి ప్రజలు ధర్మకర్తగా పెడితే నువ్వే దొంగతనం ప్లాన్‌ చేసి నిలువు దోపిడీ చేశావు.

బాబుకు అంత సీన్ లేదు:
చంద్రబాబుపై కక్షసాధించాల్సినంత సీన్‌ అసలు అతనికి ఉందా..? . 2019లో మాకు థంపింగ్‌ మెజార్టీతో వచ్చిన తర్వాత వెంటనే లోపలేస్తే అది కక్షసాధింపు అవుతుంది.. లేదంటే తమిళనాడులో జయలలిత అధికారంలోకి రాగానే కరుణానిధిని జైళ్లో వేసినట్లు చేస్తే అది కక్షసాధింపు అంటారు. ఇక్కడ ఏదీ లేకుండా కక్షసాధింపు అంటే ఎలా..? ఇంకా సీఎం గారు చాలా లిబరల్‌గా ఉన్నారు. ఆధారాలుంటే దాని ప్రకారం వెళ్లండి..తొందరపడొద్దు అని చెప్పారు.

73 ఏళ్ల వ్యక్తిని ఎన్నికలకు అర్నెల్ల ముందు అరెస్ట్‌చేస్తే మాకేం వస్తుంది..? ఆయన బయటుండి నాలుగు ఊళ్లు తిరిగితే మాకే మేలు జరిగుతుంది కానీ…
ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే నిస్సహాయ స్థితిలో తిట్లు, బూతులు తప్ప ఏమీ రావడం లేదు. ఆయనే నాలుగు రోజులు తిరిగితే పలుచన అయ్యేవాడు. వదిలితే రోడ్లపై తిరుగుతూ ఉండేవాడు. ఆయన తిరిగితే మాకు వచ్చే నష్టం కంటే లాభమే ఎక్కువ. అందుకే జగన్‌ ఆయన జైళ్లో ఉన్నా…బయట ఉన్నా ఒకటే కదా అన్నారు. అయినా లోకేశ్‌ కుర్రాడు కదా..తిరగొచ్చుగా…ఢిల్లీలో కూర్చోకపోతే..?

బాబేమన్నా పోరటా యోధుడా..?:
జైల్లో తొలుత దోమలన్నారు.. ఆ తర్వాత అక్కడున్నా జనం గురించే ఆలోచిస్తున్నాడు అన్నారు. మళ్లీ నిన్న డీహైడ్రేషన్‌ అంటున్నారు..వార్ధక్యంలో ఇదేమి అన్యాయం అంటారు. మరో వైపు ఫుల్‌ జోష్‌లో మరింత ఫోకస్‌గా ఆలోచిస్తున్నారు అంటారు. వారి మాటలు జోకుల స్థాయిని కూడా దాటిపోయాయి.

ఒకటి మాత్రం నిజం.. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేకపోతున్నానని మాత్రం బాబు బాధపడుతూ ఉండొచ్చు. జిమ్మిక్కులు, చిల్లర ఎత్తులు, ప్లేట్లు కొట్టడాలు..ఆయనేమన్నా విప్లవకారుడా..? పోరాట యోధుడా?

-జాతీయ స్థాయిలో రెండు రోజులు కొంతమంది స్టేట్‌మెంట్లు ఇచ్చారు…ఆ తర్వాత ఏమైంది ఆ సంఘీభావం..? రాష్ట్రానికి సంబంధించిన అవినీతి వ్యవహారంలో అరెస్ట్‌ అయితే… అడ్డంగా అవినీతి కేసులో దొరికిపోతే ఎవరు మద్దతు ఇవ్వరు.

వాళ్ల ఏడుపు..ప్రపంచ ఏడుపు కావాలట:
వాళ్ల ఏడుపు..ప్రపంచ ఏడుపు కావాలన్నది వారి కోరిక. అలా కాదు… అలా ఉండదు అనే స్పృహ కూడా వారికి లేకపోవడం వారి దౌర్భాగ్యం. బాబు కోసం జైల్లో ఒక బ్యారెక్‌నే కాళీ చేయించారట. ఆయనకోసం 10 మంది డాక్టర్ల టీం ఉందట.జైల్లో బాబు కోసం రాష్ట్రం ఇప్పటికే ఎక్కువ ఖర్చు పెడుతోంది. పెద్దాయన కాబట్టి బాగానే చూసుకుంటున్నారు.

ఇంతకంటే బెటర్‌ గా ఎక్కడైనా ఉంటుంది అనైతే నేను అనుకోను. తీహార్‌ లాంటి చోటైతే ఏమీ ఉండకపోవచ్చు. మనకు మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మాకు సానుకూల ఓటింగ్‌ ఉంది. అయినా చేసింది చెప్పి పాజిటివ్‌ ఓటింగ్‌ కోసం మేం ప్రజల వద్దకు వెళ్తున్నాం.

సత్తా ఉంటే సంక్షేమంపై మీరు మాట్లాడి ప్రజల్లోకి వెళ్లాలి. చంద్రబాబు తన వ్యక్తిగత సమస్యను తాను డీల్‌ చేసుకోవాలి. ఇన్నేళ్లు పరిపాలన చేసి, ప్రజలకు ఏ మేలు చేయకపోవడం లోనే వారి దివాళాకోరుతనం కనిపిస్తోంది.

LEAVE A RESPONSE