– గ్రీన్ కో యాజమాన్యం జగన్ కి ఏలెక్కన బంధువులవుతారు..!?
– మెగా పరిశ్రమలకు టెండర్లు ఉండవన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?
– చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
– రాష్ట్రంలో మీడియా టెర్రరిజం హద్దులు మీరుతోంది
– నూటికి 98 శాతం హామీలు నెరవేర్చిన జగన్ ని ఎత్తిపొడుస్తారా?
– మైనస్ మార్కులు వచ్చిన చంద్రబాబు మీకు హీరోనా..?
– దుష్టచతుష్టయంతో జాగ్రత్త అని సీఎంగారంటే.. జబ్బలు చరుచుకుంటారా..!
– 2019-20 లో పీఎంఏవై(గ్రామీణ) ఇళ్ళు అసలు మంజూరే కాలేదు
– పండుగలోపే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
పరిశ్రమలు వస్తే కూడా ఏడుపా.. ?
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు కాక, గత రెండు మూడు రోజుల్లోనే రూ. 24 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చాయి. నిన్నటి క్యాబినెట్‌లో వాటికి ఆమోద ముద్ర కూడా వేశారు. ఒక్కసారిగా పెట్టుబడులు వరదలా రావడాన్ని, ఇటు టీడీపీ, అటు దుష్టచతుష్టయం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ కడుపుమంట, ద్వేషం, అసూయ రెండు రోజులుగా వారి మాటల్లో, రాతల్లో కనిపిస్తూనే ఉంది.
పరిశ్రమలు రావడం లేదని వారే అంటారు… వస్తున్న వాటిని చూసి అవి ఎందుకొచ్చాయనే బాధ వారిలోనే కనిపిస్తుంది. అసలు అవి పరిశ్రమలే కాదు అంటారు… మీ బంధువులవి అంటారు.. పారిశ్రామిక వేత్తలు ఎవరైనా వారు ఏ వర్గం అనేది లేకుండా పారదర్శకంగా, వివక్ష లేకుండా ఒకే పద్దతి ప్రకారం ఇండస్ట్రీయల్ పాలసీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే రివర్స్ పంప్డ్ స్టోరేజీ బేస్డ్ పవర్ ప్రాజెక్టులను పరిశ్రమల కేటగిరీ కింద ప్రకటిస్తూ పాలసీ తీసుకున్నారు. మెగా పరిశ్రమలకు టెండర్లు పిలవడం అనేది ఉండదని ఆరో తరగతి పిల్లాడికైనా తెలుస్తుంది.
రివర్స్ పంప్డ్ స్టోరేజీ బేస్డ్ పవర్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ పెట్టొచ్చో గుర్తించి…ఆ తర్వాత ఓపెన్‌గా ఆయా సంస్థలను ఆహ్వానించారు. అలా వచ్చిన పరిశ్రమలే ఇవి. 24 వేల కోట్లలో.. 8800కోట్లు స్టీల్ ప్లాంట్ పెట్టుబడులను పక్కకి తీస్తే, మిగిలిన పెట్టుబడులన్నీ ఇలానే వచ్చాయి. ఒక సిమెంటు పరిశ్రమ పెడితే సున్నపురాళ్లు అందుబాటులో ఉన్నచోట వస్తాయి. అలానే ఈ ఎనర్జీ ప్లాంట్లు కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉందో గుర్తించి అక్కడే పెడుతున్నారు. ప్రభుత్వాలు వ్యాపారం నుంచి వీలైనంత దూరం జరగాలని 90వ దశకం నుంచి తీరు మార్చుకున్నాయి. పెట్టుబడిదారుడి వెంటపడి వారికి ఇన్సెంటివ్స్ ఇచ్చి మరీ తీసుకొచ్చే రోజులు ముప్పై ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. దాంట్లో భాగంగా ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీ వంటి బోర్డులు ఏర్పడ్డాయి. పెద్ద ప్రాజెక్టులు, 2 వేల మందికంటే ఎక్కువ ఉపాధి వచ్చే ప్రాజెక్టులను వాటికిందకు తీసుకువచ్చినట్లున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలోనూ అదే చేశారు. మా ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా పద్దతి ప్రకారం క్యాబినెట్ అప్రూవల్ చేసి అనుమతి ఇస్తే విషం కక్కుతున్నారు. అంతా బంధువులకు దోచిపెడుతున్నట్లు రాసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కి అదానీ…గ్రీన్ కో వాళ్లు బంధువులే అన్నట్లుగా రాతలు రాస్తున్నారు. అరబిందో వాళ్లు, షిరిడీ సాయి వాళ్లూ బంధువులే అన్నట్లుంది వీరి వ్యవహారం. ముందే సన్నిహితులు అంటూ ముద్ర వేసేసి మేం ముందే చెప్పాం కదా అంటూ దిగజారి ప్రచారం చేసే స్థితికి వీళ్ళు వెళ్లిపోయారు.
పరిశ్రమలు రాకూడదు…వస్తే తరిమేయాలి అన్నదే వీళ్ల కోరిక:
జగన్మోహన్ రెడ్డి పాలనలో పరిశ్రమలు అసలు రాకూడదు..వస్తే వాటిని తరిమేయాలి అన్నట్లు దుష్టచతుష్టయం కోరుకుంటోంది. లేదా దాంట్లో భయంకరమైన అవినీతి జరిగిందని చూపించాలనే లక్ష్యంగా చేసుకుని రాతలు రాస్తూ అడ్డంగా వారే బుక్కవుతున్నారు. వాళ్లు రాసే రాతలకే క్రెడిబిలిటీ లేదంటే వాటిని ఆధారం చేసుకుని టీడీపీ వారు మాట్లాడుతున్నారు. గ్రీన్ కో కంపెనీకి చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారు. ఆ రోజు ఒక పద్దతి లేకుండా అనుమతులు ఇస్తే జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని సరిచేశారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. గార్మెంట్స్ వంటి కంపెనీల్లో వచ్చే ఉద్యోగాలపై కూడా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ గ్రీన్‌కో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. చంద్రబాబు హయాంలో ఎకరానికి రూ. 2.5 లక్షల రాయల్టీ ఫిక్స్ చేస్తే, దాన్ని సరిచేసి ఎకరం 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది జగన్ గారి ప్రభుత్వం. గ్రీన్ ఎనర్జీ సెస్ పెట్టి మొదటి 25 ఏళ్లలో మెగావాట్‌కు ఏటా లక్ష రూపాయలు, తర్వాత 25 ఏళ్లకి ఏటా 2లక్షల రూపాయలు వసూలు చేసేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు, ప్రభుత్వానికి సంబధించిన ఏ భూములైనా సరే ఏటా 31 వేల రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల రైతులకు, ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. ఈ ఆలోచన నాడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు…?. ప్రభుత్వానికి ఆదాయం, రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు…ఆ రోజు చేయకుండా ఈ రోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. అసలు గ్రీన్ ఎనర్జీపై పాలసీనే చేయలేదు..అలాంటి పాలసీలు ఉంటే చంద్రబాబు దోపిడీకి అడ్డుగా ఉంటాయని అందుకే చేయలేదు.
జగన్మోహన్‌రెడ్డి మాత్రం రాష్ట్రం బాగుపడాలి..రైతులు బాగుపడాలి…రాష్ట్రానికి ఆదాయంతో పాటు పారదర్శకత ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కూడా తప్పుపడుతున్నారంటే ఎంత బరితెగించారో అర్దం అవుతుంది. ఇదే సిమెంట్ ప్లాంట్ విషయానికి వస్తే టెండర్ పిలవమని అంటారా..?. పంప్డ్ స్టోరేజీ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి, పెండింగ్ అప్లికేషన్ ఒక్కటీ లేదు..ఒక్క అప్లికేషన్ కూడా రిజెక్ట్ కాలేదు. ఇంకా అవకాశాలున్నాయి…చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణలు కలిసి రావచ్చు… లేదా విడివిడిగా రావచ్చు. ఖచ్చితంగా వారికి కూడా కేటాయిస్తాం. పీక్ అవర్స్ లో ఒరిజనల్ రేటుకు, మార్కెట్ రేటుకు ఉన్నతేడాను బిజినెస్ అవకాశం కింద మార్చుకున్నారు కాబట్టే ఇది ఈ రివర్స్ పంప్డ్ ఎనర్జీ ఒక పరిశ్రమగా మారింది. దీంతో పారిశ్రామిక వేత్తలు దీనిపై దృష్టి సారించారు. మరో వైపు ఈ రకమైన విద్యుత్ వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి దీన్ని ఎంచుకుంటున్నారు. జెన్‌కో ఇప్పటికే అప్పర్ సీలేరు ప్రాంతాల్లో ఇలాంటి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. దానికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉంటాయి. మీరున్నప్పుడు సోలార్ ప్రాజెక్టులన్నీ ఎందుకు జెన్‌కో కింద చేయలేదు..? కేంద్ర సంస్థలకు ఎందుకివ్వలేదో అన్నదానికి కూడా మేము సమాధానం చెప్పాం. కేంద్రానికి సంబంధించిన ఎన్టీపీసీకి కూడా ఇస్తున్నాం. ఇవే కాదు చంద్రబాబు బృందం రామోజీ, రాధాకృష్ణలు కూడా ఈ సెక్టార్‌లోకి రావచ్చు..వేల కోట్లు సంపాదించారు కాబట్టి, ఇంకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు వచ్చినా మేం కేటాయిస్తాం.
1780 కోట్లు తెల్లవారకముందే ఇస్తే.. పచ్చమీడియాకు కనిపించదు:
వాస్తవాలను వదిలేసి ప్రజలను పక్కదోవపట్టించే దుష్టచతుష్టయం ప్రయత్నాలు చూస్తే రాక్షసత్వంగా అనిపిస్తోంది. ఆదాయం లేదంటారు..వారు రాసే రాతల్లో అంకెలు కూడా తప్పుగా రాస్తారు. ప్రపంచమంతా పింఛన్ల గురించి మాట్లాడుతుంటే దాన్ని మాత్రం ఎక్కడో చీమ తలకాయంతగా అచ్చేస్తారు. పైన తాటికాయంత అక్షరాలతో మాత్రం ఈ అబద్దాలను వండివారుస్తారు.
దఫదఫాలుగా పింఛన్ రూ.3 వేల వరకూ పెంచుకుంటూ పోతాం అంటూ జగన్మోహన్‌రెడ్డి ఆనాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేబినెట్ లో పింఛన్ ను రూ.2750కి పెంచితూ నిర్ణయం తీసుకుంటే, దాని గురించి మాత్రం రాయరు. 62 లక్షల మందికి పైగా అవ్వాతాతలకు దాదాపు రూ.1780 కోట్లు ఒకటో తేదీనే వాలంటీర్ల ద్వారా గుడ్‌మార్నింగ్ చెప్పి వారి చేతుల్లో పెడుతున్నారు. చంద్రబాబు బతుక్కి రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చాడు. జగన్ ఎన్నికల్లో హామీ ఇవ్వగానే రెండు నెలల ముందు కొంత పెంచాడు. రానున్న రోజుల్లో పింఛన్ ను మూడు వేలు చేస్తాం.
ఇది మీడియా టెర్రరిజం కాదా..?
కొత్తగా వస్తున్న ఈ పరిశ్రమల వల్ల ఆదాయమే లేదని ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఈ పెట్టుబడుల వల్లరూ.8 వేల కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయంతో పాటు 58 వేల మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ఇది కాకుండా వారు పెట్టే సోలార్ పవర్ 7 వేల మెగావాట్లకు అప్రూవల్ ఉంది. దాని వల్ల రూ.3600 కోట్లు అదనపు ఆదాయం, 7 వేల మందికి ఉపాధి కూడా రాబోతుంది. పంటల సాగుకు అనువుగా లేని ప్రాంతంలో రైతులకు ఇలాంటి ప్రాజెక్టులు పెట్టడం వల్ల రైతుకు కూడా లాభం ఉంటుంది..మరో వైపు పర్యావరణానికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇన్ని రకాల లాభాలు ఉంటే దుష్పచారం కరెక్టేనా..? ఇది మీడియా టెర్రరిజం కాదా..? ఇంతకంటే దారుణం ఏముండదు.
గ్రీన్ కో యాజమాన్యం జగన్ కి ఏ లెక్కన బంధువులవుతారు..!?
నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు..చంద్రబాబు నీ హయాంలో ఎందుకు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదు..?. ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే పొగరుబోతు మాటలు మాట్లాడతారా..? ఒక ఇండస్ట్రీ వస్తుంటే ఎగతాళిగా మాట్లాడటం వీళ్లకే చెల్లింది. ఇదంతా చూస్తుంటే అర్జంటుగా రాష్ట్రం ఏదో ఒకటి అయిపోవాలి… జగన్మోహన్‌రెడ్డి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాకూడదని వాళ్ల కోరికలా ఉంది. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతింటే…అప్పులు పుట్టకూడదని రాతలు రాస్తారు..ఇదంతా ఎందుకంటే.. అర్జంటుగా జగన్మోహన్‌రెడ్డిని దింపి.. చంద్రబాబును ఆ సీట్లో కూర్చోబెట్టాలన్న తపన మాత్రమే. అప్పుడు వీళ్లకి అంతా ప్రశాంతంగా ఉంటుంది.
ఆ రోజు గ్రీన్ కో వచ్చినప్పుడు ఈ రాతలన్నీ రాయలేదు. అప్పుడు అదో ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఇప్పుడు మాత్రం గ్రీన్‌కోకు దోచిపెడుతున్నట్లు రాతలు రాస్తున్నారు. అసలు గ్రీన్‌కో యాజమాన్యం జగన్ గారికి ఎలా బంధువయ్యాడో మాకర్ధం కావడం లేదు. ఆర్ధికంగా, సాంకేతికంగా అన్ని విధాల మంచి కంపెనీలను ఎంపిక చేశాం. కేంద్ర సంస్థల నుంచి వారు గుర్తింపును కూడా పొందారు. కావాలంటే, ఆ పరిశ్రమల శక్తిసామర్థ్యాలు ఏమిటనేది మీరైనా చెక్ చేసుకోవచ్చు. మీ హయాంలో మాదిరిగా, నరసరావుపేట, చిలకలూరిపేట వాళ్లకు సూట్లు తొడిగి వెయ్యి, రెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని ప్రచారం చేసుకున్న తరహా పరిశ్రమలు ఇవి కావు. జగన్మోహన్ రెడ్డి గారికి మీలాంటి బుద్దులు లేవు..అలా ఉంటే రైతులకు ఎలా మేలు చేయాలి…ఆయా సంస్థల నుంచి రాష్ట్రానికి ఏం రాబట్టాలనే ఆలోచనలు చేయరు.
మైనస్ మార్కులు వచ్చిన బాబు మీకు హీరోనా..?:
నిన్నటి క్యాబినెట్‌లో మంచి చర్చ జరిగి, కీలకమైన నిర్ణయాలు జరిగాయి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మంత్రులకు ఒక దిశానిర్దేశం చేస్తూ..” అవతల శక్తులు మామూలుగా లేవు.. మన అంతుచూడాలనో, ప్రజల్ని పక్కదారి పట్టించాలనో అభూత కల్పనలతో వాళ్లు సమన్వయంలో నలుగురూ కూడబలుక్కుని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. మీరంతా జాగ్రత్తగా ఉండండి..” అని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ చెప్పారు.
“పారదర్శకంగా ఉండండి…మారీచులు వాళ్లు ..” అని సీఎం చెప్తే దాన్ని కూడా తిరగేసి రాతలు రాశారు. అవినీతికి దూరంగా ఉండండి అని సిఎం చేప్తే.. ఇకపై అవినీతికి దూరంగా ఉండండి అని చెప్పినట్లుగా రాతలు రాస్తున్నారు. అంటే ఇప్పటి వరకూ అవినీతికి పాల్పడ్డట్లు అర్ధం వచ్చేలా వార్తలు రాస్తున్నారు. తప్పుడు ప్రచారంలో ఎల్లో మీడియాకు చెందిన- ఒక్కో చానల్ వాళ్లు ఒక్కో విధంగా క్రెడిట్ల కోసం పోటీ బడ్డారు. మమ్మల్ని చూసి జాగ్రత్తగా ఉండమని సిఎం చెప్పాడు అంటూ ఎవరికి వారు పోటీ పడ్డారు…ఎవరికి వారు జబ్బలు చరుచుకున్నారు…అసలు ఇదేమైనా ఒక బాధ్యతాయుతమైన మీడియానేనా..? మేం ఏం చేసినా జనం నమ్ముతారు అని అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నారు.
అసలు జగన్మోహన్‌రెడ్డి తప్పు చేయడానికి ఎక్కడ అవకాశం ఇచ్చారు…?
మీలా జన్మభూమి కమిటీలు పెట్టి దోపిడీకి దారులు తెరవలేదు. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తోంది. రూపాయిలో 80పైసలు మీ హయాంలో పక్కదోవ పట్టింది. లక్ష మందిలో ఒక వంద మందికి అర్హత లేక ఏదన్నా రాకపోతే వారినే లక్షమంది అన్నట్లుగా ఇప్పుడు చూపిస్తున్నారు. 99 శాతం చేశాం.. అని మేం చేప్తే ఆ ఒక్క శాతం చేయలేదు కదా అని ఎత్తిచూపిస్తున్నారు. వందకు మైనస్ మార్కులు వచ్చినోడు ఆ మీడియాకు హీరో…వందకు వంద మార్కుల దిశగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం రాయరు. అభూత కల్పనలను పదే పదే రాయడం నిత్యం వీళ్లపనిలా మారింది.
2019-20 లో ఆ ఇళ్ళు అసలు మంజూరే కాలేదు
మీడియా ప్రశ్నలకు- సమాధానాలు ఇస్తూ..పీఎంఎవై గ్రామీణ ఇళ్ళ పథకం కింద 2016-17, 2017- 18లో 1.23 లక్షల ఇళ్లను ఇస్తే.. 68,912 ఇళ్లను మొదలుపెట్టి 46,719 ఇళ్లను పూర్తి చేశారు. 2019- 20, 2020-21 సంవత్సరాలకు మనకు ఈ స్కీం కింద ఇళ్లు మంజూరు కాలేదు. వాళ్లు చెప్తున్న 5 ఇళ్లు కూడా టీడీపీ హయాంలో మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేసినవే. వారు రాసింది తప్పు. మేం ఈ స్కీం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత- 2021- 22 ఏడాదిలో 1.79 లక్షల ఇళ్లు ఈ స్కీం కింద మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు విశాఖలో దీన్ని లాంచ్ చేశారు. వీటిలో కేవలం 7 నెలల కాలంలోనే 67 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాం, అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 2024 మార్చిలోపు అన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం.
టిడ్కో ఇళ్లు ఎలా మొదలయ్యాయో అందరికీ తెలుసు. మౌలిక వసతుల డబ్బు దాంట్లో లెక్కకు వేసుకోలేదు. కేవలం ఎక్కడ కమిషన్ వస్తుందో అక్కడ మాత్రమే టీడీపీ హయాంలో పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిలా రివర్స్ టెండరింగ్‌కి వెళ్లలేదు. కట్టేవాటిని వాళ్లు సగంలో వదిలేశారు. జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాల పూర్తి చేసి లబ్ధిదారునిపై బరువు తగ్గించి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రూపాయికే 300చదరపు అడుగుల టిడ్కో ఇంటిని లబ్ధిదారునికి ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లను ఎంచుకున్న వాళ్లు కూడా భారం వదిలించుకుని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇళ్లవైపు వచ్చారు.
జీతాలకు సంబంధించినంత వరకూ.. మేము అధికారంలోకి వచ్చేసరికి జీతాలు, పింఛన్ల చెల్లింపుల ఖర్చు 5వేల కోట్లుంటే ఇప్పుడు అది 7 వేల కోట్లకు పైగా పెరిగింది. ఏదైనా మేం చెల్లించాల్సిందే. అప్పట్లో రెగ్యులర్ ఉద్యోగికి ఒక టైం ఉండేది…మిగిలిన టెంపరరీ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అలాంటిది మేం దాన్ని స్టీమ్ లైన్ చేశాం. ఈ నెల మాత్రమే కొంత ఆలస్యం అయ్యింది. ఆ విషయం ఉద్యోగులకు కూడా చెప్పాం. వాళ్లు కూడా అర్ధం చేసుకున్నారు. తెలంగాణాలో రకరకాలుగా చేస్తున్నారు..ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా జీతాల వ్యవహారం నడుస్తోంది. మన రాష్ట్రంలో జరిగే దాన్ని మాత్రం వీళ్లంతా భూతద్ధంలో చూపిస్తున్నారు. ఏది ఏమైనా పనిచేశారు కాబట్టి ఉద్యోగులు మొదటి వారంలో జీతాలు రావాలనుకోవడంలో తప్పులేదు. అలా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. కోవిడ్ వంటి కష్టాలు వచ్చినా, ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగకూడదనే ముఖ్యమంత్రి ఆకాంక్ష.
పండుగలోపే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతుంది..:
ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. మొన్నీ మధ్య కూడా చర్చించాం. పండుగలోపు కాకపోతే వాళ్లు ఆందోళన అంటున్నారు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులే. ఇది ఇంట్లో పంచాయతీలాంటిదే. వాళ్లు, ప్రభుత్వం కలిసి పనిచేసే వారే కాబట్టి చర్చలు జరుపుతాం. పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. పోలవరం విషయంలో నిన్న మా ఎంపీలు పార్లమెంటులో కూడా మాట్లాడారు. ఆర్ అండ్ ఆర్ సహా కేంద్రం భరించాల్సిందే. పనుల విషయంలో జరుగుతున్న ఆలస్యం పాపం మాత్రం చంద్రబాబుదే. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ దెబ్బతినడం వంటి సమస్యలు వల్ల ఆలస్యం అవుతోంది. ఆయన ఉన్నప్పుడు గేటుకు ఒక రేకు పెట్టి ఏదో చేసినట్లు చూపించుకున్నాడు. స్పిల్ వే పూర్తి చేసి, నీటిని డైవర్ట్ చేసి కిందికి వదలడం మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే, జగన్మోహన్ రెడ్డి చేశారు.