Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే

-మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తెస్తాననడం హాస్యాస్పదం
-అనుమానాస్పద స్థితిలో సాక్షి మృతి
-హవ్వ… సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

మూడు రాజధానుల బిల్లును తిరిగి తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం ముమ్మాటికి కోర్టు దిక్కరనే అవుతుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు, బాధ్యతారహితంగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు.

సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్ లో ఉండగానే, మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని సజ్జల పేర్కొనడం కోర్టు ధిక్కరనే అవుతుందని వెల్లడించారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని చెప్పి మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
బాబాయిని చంపింది ఎవరు?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరన్నా ప్రశ్న కు సమాధానం అందరికీ తెలుసునని, అయినా ఎవరూ బహిరంగంగా చెప్పలేరని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను రాష్ట్రం నుంచి హైదరాబాదుకు బదిలీ చేస్తూ, సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. 15 పేజీల తీర్పు పూర్తి పాఠాన్ని తాను చదివానని ఆయన వివరించారు.

వైయస్ వివేకా హత్య కేసు విచారణ ను ఆంధ్ర ప్రదేశ్ నుంచి హైదరాబాదుకు బదిలీ చేయగా ఆంగ్ల దిన పత్రికల నుంచి మొదలుకొని అన్నీ తెలుగు దినపత్రికలు ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ గా వేశాయని పేర్కొన్నారు. కానీ సాక్షి దినపత్రిక మాత్రం నామమాత్రంగా వార్తను కవర్ చేసి చేతులు దులుపు కుందని విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ వార్తకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా, ఈ వార్తకు ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు టిడిపి ప్రభుత్వ హయాంలో సిట్ ను ఏర్పాటు చేసి, ముగ్గురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. సిట్ సమర్థవంతంగానే పనిచేస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమకు నమ్మకం లేదని సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతూ ప్రతిపక్ష నేత హోదా లో జగన్ మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదం, తల్లి, చెల్లి సహకారం… వైఎస్ ఫ్యామిలీ సమిష్టిగా రోడ్ ఎక్కడంతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి… టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి , నూతన సిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సిట్ కు నేతృత్వం వహించిన అభిషేక్ మహంతి అనే నిజాయితీ కలిగిన అధికారి, కేసు దర్యాప్తును వేగవంతం చేశారన్నారు. దీనితో సిట్ అధికారిని మార్చడం జరిగిందని తెలిపారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో వరుస కు సోదరుడైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి తగిన సహకారం లభించకపోవడంతో, వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీత , సిబిఐ విచారణను కోరుతూ హైకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించిందన్నారు. సిబిఐ అధికారిగా దీపక్ గౌర్ కాసింత మందకోడిగా విచారణ జరిపినప్పటికీ, ఎప్పుడైతే రామ్ సింగ్ బాధ్యతలను స్వీకరించారో, విచారణ వేగం పుంజుకుందని తెలిపారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో ఒకరైన కటిక రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య గావించబడ్డాడని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి దేహం పై గాయాలు ఉన్నాయని, ఆయన పోస్టుమార్టం నివేదికను డాక్టర్ సునీత బయట పెట్టారని గుర్తు చేశారు. తొలు త ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, ఆ తరువాత అనుమానస్పద మృతిగా మార్చారన్నారు. అయినా ఇప్పటికీ శ్రీనివాస్ రెడ్డి హత్య కేసును ఒక కొలిక్కి తీసుకు రాలేదని విమర్శించారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి కి సన్నితుడైన గంగాధర్ రెడ్డి తొలుత సిబిఐ అధికారులకు వాంగ్మూలం ఇస్తానని చెప్పి, ఆ తరువాత సిబిఐ అధికారి రామ్ సింగ్ తనను ప్రలోభ పెడుతున్నారని ఎదురు తిరిగారన్నారు. అదే గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఎలుక కొరికి మరణించినట్లు పేర్కొనడం జరిగిందన్నారు. ఎలుక కొరికి మరణించిన దాఖలాలు ఇప్పటివరకు లేవని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురైనప్పుడు అక్కడే విధులను నిర్వహిస్తున్న పోలీసు అధికారి శంకరయ్యను టిడిపి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలను చేరిపినట్లు, శరీరం పై ఉన్న గాట్లు కనిపించకుండా ఉండేందుకు కుట్లను వేసినట్లుగా గుర్తించినట్లుగా సుప్రీంకోర్టు తీర్పు పాఠం లో పేర్కొనడం జరిగిందన్నారు. శంకరయ్య కూడా తొలు త వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధపడి, ఆ తర్వాత ఎదురు తిరగడం జరిగిందన్నారు. వెనువెంటనే శంకరయ్య పై ఉన్న సస్పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడమే కాకుండా, ఆయనకు డిఎస్పీగా పదోన్నతి కల్పించిందన్నారు. స్థానిక ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అనుచరుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి సిబిఐ అధికారి రాంసింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం చకాచకా జరిగిపోయాయన్నారు.

అలాగే సిబిఐ అధికారి వాహన డ్రైవర్ ను సైతం కొంతమంది వ్యక్తులు బెదిరించడం జరిగిందని తెలిపారు. రాజధాని కేసులో రెండవ జడ్జి వ్యాఖ్యలను తాటికాయంత అక్షరాలతో రాసిన సాక్షి దినపత్రిక, ఈ కేసు బదిలీపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి మాత్రం అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదన్నారు . వైయస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి, వాచ్మెన్ రంగయ్యలకు సెక్యూరిటీ కల్పించామనితెలియజేయడం జరిగిందన్నారు. ఈ సంఘటనలన్నీ పరిశీలించిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తొలుత ఢిల్లీకి మార్చాలని భావించినప్పటికీ, ఎక్కువమంది సాక్షులను విచారించడానికి తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాదుకు మారుస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

ఈ కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులను హైదరాబాదుకు మారుస్తారా?, లేదా?? అన్నదానిపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్పష్టత లేదని తెలిపారు. సిబిఐ విచారణ ప్రారంభమైతే కడప నుంచి హైదరాబాదుకు రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారవచ్చునని ఆయన అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో జైలులోనే మొద్దు శీను, ఓం ప్రకాష్ వంటి ఖైదీల హత్యకు గురైన సంఘటనను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావిస్తూ… శివశంకర్ రెడ్డి కి ప్రాణహాని తలపెట్టే అవకాశాలు లేకపోలేదని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన సాక్షులకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న ను తమ పార్టీ సభ్యులే హత్య చేశారని సిబిఐ భావిస్తుందని తెలిపారు. గతంలో సాక్షి దినపత్రికలో నారా సుర చరిత్ర అని ప్రత్యేక కథనాలను వండి వార్చి హత్య కేసు అభియోగాలను ఇతరుల పైకి నెట్టాలని ప్రయత్నించారన్నారు. కానీ సిబిఐ విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు.

ఒక వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండడం సర్వసాధారణం అని, కానీ ముఖ్యమంత్రికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండడం ఏమిటో తనకు అర్థం కాలేదని రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించడం అంటే… ముఖ్యమంత్రిని శాసించే అధికారులను కట్టబెట్టినట్టు భావించాలా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం అసంబద్ధమైన నియామకమని ఆయన మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తనను తానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భావించే వారిని గుర్తు చేశారు.

ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లను తీసుకువచ్చే ప్రయత్నం
ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించి, వాలంటీర్లను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. గురువుల మీద గౌరవంతో గురుతరమైన విద్యాబోధన బాధ్యత ను అప్పగిస్తామని అభ్యుదయ భావాలను రాష్ట్ర ప్రభుత్వం వల్ల వేస్తున్నప్పటికీ, ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలనుకోవడం వెనుక వేరే కారణం ఉందన్నారు. ఉపాధ్యాయులను రాచిరంపాన పెట్టిన ఈ ప్రభుత్వానికి వారు వ్యతిరేకంగా పనిచేస్తారన్న భయాందోళనలు ప్రభుత్వ పెద్దలలో ఉన్నాయన్నారు.

అయితే ఎన్నికల కమిషన్ కు కొన్ని హక్కులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అడిగే హక్కు కమీషన్ కు ఉందని అన్నారు. ఎన్నికల విధులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇవ్వను అంటే కుదరదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టగానే, ఆమోదించేందుకు గవర్నర్ సిద్ధంగా ఉన్నప్పటికీ…దానికి చట్టం కూడా అంగీకరించదని పేర్కొన్నారు. బాత్రూమ్ ల ముందు, మద్యం దుకాణాల ముందు మాస్టర్లను నిలబెట్టి విధులను నిర్వహింప చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… ప్రజాస్వామ్యానికి వెన్నుముక అయినా ఎన్నికల ప్రక్రియలో మాత్రం పాల్గొనవద్దని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

గ్రామ వాలంటీర్ల ద్వారా ఇతర పార్టీలకు ఓట్లు వేసే ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందినకార్యకర్తలు, సానుభూతిపరులు ఎవరు కూడా వాలంటీర్లను తమ దగ్గరకు రానివ్వ వద్దంటూ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా గ్రామ వాలంటీర్లకు ఐడి కార్డును ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.. ఐడి కార్డు పై గ్రామ వాలంటీర్ ఫోటో కంటే తండ్రి కొడుకుల ఫోటోలే పెద్దగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంటే, తండ్రీ కొడుకుల ఫోటోను మెడలో వేసుకుని గ్రామ వాలంటీర్ విధులను నిర్వహిస్తున్నారన్నారు.

ఐదువేల గౌరవ వేతనం పై పని చేస్తున్న గ్రామ వాలంటీర్లు జీతం పై కంటే గీతం పైనే ఎక్కువగా మక్కువ చూపుతున్నారని తెలిపారు. 5000 రూపాయలకు పనిచేసేవారు కన్నాలు వెయ్యకపోతే, ఏమి చేస్తారంటూ ఎదురు ప్రశ్నించారు. పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లోకి సొమ్ము బదిలీ చేయకుండా, నగదునే అందజేయడం ఎందుకని ప్రశ్నించారు.

ప్రజల నెత్తిన అక్రమంగా రుద్దిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, అదే ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కడనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు . అటువంటి అక్రమాలను అడ్డుకునేందుకు, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములు కాకుండా చూసేందుకు తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తానని తెలిపారు.

LEAVE A RESPONSE