-విజయవాడలో రాజ్ భవన్ ఘెరావ్
-నిరసనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొనాలి
-దేశాన్ని నరేంద్ర మోడీ కళ్ళ ముందే అమ్మేస్తున్నారు
-ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్తంగా జైల్ భరో
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విశాఖపట్నం: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వెల్లడించారు. ఆ రోజు విజయవాడలో రాజ్ భవన్ ఘెరావ్ కార్యక్రమం ఉంటుందని, ఈ నిరసనలో హోదాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఆగస్ట్ 9 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో “ఆజాదీ కా గౌరవ యాత్ర” పేరుతో 75 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన విశాఖపట్నం ఇందిరా భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
భారత దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అదానీ, అంబానీ ఇద్దరి కోసం పరిపాలన చేస్తున్నారని శైలజనాథ్ ధ్వజమెత్తారు. మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ కి లేదని, ఆహార సూచీలో భారత దేశం పాకిస్థాన్ కంటే కిందకు రావడం సిగ్గు చేటని, నైజీరియా కంటే భారత దేశం లో పేదలు ఎక్కువ ఉండడాన్ని చూస్తే వీరి పరిపాలనలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి సంబంధించిన సర్వ ఆస్తులను అమ్మే కార్యక్రమాలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇంకా వంగి వంగి దండాలు పెడుతూ రాష్ట్రం హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని దండాలు పెట్టినా మీ వీపు మీద స్వారీ తప్ప రాష్ట్రానికి ఏమీ ఒరగదని ప్రజలకు అర్థం అయ్యిందని పేర్కొన్నారు. అగ్నిపధ్ పేరుతో భారత సైనికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఏదో చీకటి ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి వంటి ఎన్నో నెరవేరకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా వైసీపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేం నడుపుకుంటామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రధానికి ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని శైలజనాథ్ ప్రశ్నించారు.