Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా

– కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం గొప్ప నిర్ణయం
– ఎన్టీఆర్ ఆశయాలకు వైసీపీ, జగన్ వ్యతిరేకం కాదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సీఎం జగన్మోహనరెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయమని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్ కు పాదాభివందనం చేస్తున్నానని మంత్రి కొడాలి నాని తెలిపారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర మీడియా పాయింట్లో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. 2018 లో కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని అడిగినప్పుడు రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయడంతో పాటు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని సీఎం జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారన్నారు. దానికి అనుగుణంగా విజయవాడ క్యాపిటల్గా ఉ న్న కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ అభిమానులు, ఆయనను ఆరాధించే, దైవంగా భావించే వ్యక్తుల తరపున సీఎం జగన్మోహనరెడ్డికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

ఎన్టీఆర్ అభిమానిగా, ఆయనంటే ఇష్టమైన వ్యక్తిగా, నాకంటే చిన్నవాడైన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. టీడీపీకి వ్యతిరేకంగా పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ఆశయాలకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన చంద్రబాబుకు, ఇప్పటి నాయకులకు సీఎం జగన్మోహనరెడ్డి, తాను వ్యతిరేకమని, ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కాదని తెలియజేశారు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. 2018 లోనే ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తానని కృష్ణాజిల్లాలోనే సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. చాలా మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయని, నోటిఫికేషన్ విడుదల అయిందని, ఇంకా నెల రోజుల సమయం ఉందన్నారు. మార్పులు, చేర్పులు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నారు. ఎవరికి ఎటువంటి అభిప్రాయం, ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని పరిష్కరించి ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజల ఆమోదం పొందినప్పటికీ చిన్నా చితక మార్పులుంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ కు ఉన్న ఖ్యాతి, స్టేటస్ కు మచిలీపట్నం కన్నా విజయవాడ అయితే ఇంకా మంచిగా ఉంటుందని సీఎం జగన్ ఆలోచన చేసి ఉండవచ్చన్నారు.

ఎన్టీఆర్ ను వాడుకుని, ఆయనను ముంచి, వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని చంద్రబాబు లాక్కున్నాడన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరుతూ ఉంటాడన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పన్నెండున్నర సంవత్సరాల పాటు చంద్రబాబు కలిసివున్న పార్టీలే కేంద్రంలో అధికారంలో ఉన్నాయన్నారు. అలాంటపుడు ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని అన్నారు. ఇప్పించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చనిపోయిన 24 గంటల లోపు కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే చంద్రబాబును ఎవరైనా ఆపుతారా అని అడిగారు. చంద్రబాబుకు తప్ప ఎవరికీ పేరు రాకూడదని దుర్మార్గపు ఆలోచనలు చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు వినబడకూడదు, తలవకూడదని అనుకుంటాడన్నారు. టీడీపీని ఎవరు స్థాపించారంటే చంద్రబాబు పేరు చెప్పాలని అనుకుంటాడన్నారు. చంద్రబాబు సొంత పార్టీ టీడీపీ అని ప్రజలు అనుకోవాలనుకుంటాడన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమై, ఆయన పేరును కూడా భరించలేని మనస్థత్వం చంద్రబాబుది అని మంత్రి కొడాలి నాని అన్నారు.

LEAVE A RESPONSE