Suryaa.co.in

Editorial

వైసీపీ బాధిత సీఐలకు మోక్షం

– ఐదేళ్లు వీఆర్, లూప్‌లైన్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం
– ఐదేళ్లలో లా అండ్ ఆర్డర్ చేయని వారికే తొలి ప్రాముఖ్యం
– టీడీపీ నేతలపై కేసులు పెట్టిన వారికి నో పోస్టింగ్
– ఆరోపణలున్న వారికి పోస్టింగులేనట్లే
– ఎమ్మెల్యేల సిఫార్సులపై నిశిత పరిశీలన
– ఆరోపణలున్న సీఐల పేర్లు ఇవ్వవద్దని ఎమ్మెల్యేలకు ఐజీల సూచన
– కమ్మ-కాపు సీఐలకు మళ్లీ మంచిరోజులు
– పాత పోస్టింగులు నిలిపివేత
– ఈనెల 18 నాటి ‘సూర్య’ స్టోరీ ఎఫెక్ట్
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రిజర్వు-లూప్‌లైన్లలో మగ్గిపోయిన సీఐలకు టీడీపీ సర్కారు శుభవార్త చెప్పింది. త్వరలో ఇచ్చే పోస్టింగులలో వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు కొన్ని మార్గదర్శకాలను, పోలీసు శాఖ ఉన్నతాధికారులకు విడుదల చేసినట్లు సమాచారం. ఆ ప్రకారంగా.. జగన్‌రెడ్డి సర్కారులో వేధింపులకు గురైన సీఐ, ఎస్‌ఐలకు పోస్టింగులు ఇవ్వడంతోపాటు.. అకారణంగా టీడీపీతోపాటు జనసేన,జనసేన నేతలను ఇబ్బందిపెట్టిన వారికి ఎలాంటి పోస్టింగులు లభించనట్లే.

అంటే.. గత సర్కారులో ఎలాంటి పోస్టింగులు లేకుండా, వీఆర్-చివరి ఏడాదిలో లూప్‌లైన్‌కు పరిమితమైన కమ్మ-కాపు అధికారులకు మోక్షం లభించినట్లే. కాగా సీఐ పోస్టింగులలో కమ్మ సామాజికవర్గ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, ‘సూర్య’ ఈ-పేపర్‌లో ‘కమ్మ సీఐలు మాకొద్దు’ అన్న శీర్షికతో , ఈనెల 18వ తేదీన వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సూర్య’ కథనానికి స్పందించిన ప్రభుత్వం.. జగన్ సర్కారు బాధిత సీఐలకు మోక్షం కలిగించాలని నిర్ణయించడం ‘సూర్య’ విజయమే!

నిజానికి సీఐ పోస్టింగులలో కమ్మ వర్గ సీఐలు కూటమి ఎమ్మెల్యేల నుంచి ఎదుర్కొంటున్న ‘సామాజిక సమస్య’లపై , వార్తా కథనం వెలువరించిన ‘సూర్య’ కథనం అటు ప్రభుత్వం-ఇటు పోలీసు శాఖలో కలకలం రేపింది. గాలివార్తలు-కట్టుకథలకు దూరంగా.. వాస్తవాలకు దగ్గరగా ఉండే సూర్య కథనాలు, ప్రభుత్వంలో పునరాలోచనకు దోహదపడ్డాయి. ఒక్క గుంటూరు రేంజిలోనే ఎంతమంది కమ్మ సీఐ, డీఎస్పీ, ఎస్‌ఐలు గత ఐదేళ్ల నుంచి వీఆర్‌లో ఉన్నారు? ఎంతమంది లూప్‌లైన్‌లో మగ్గిపోతున్నారు? ప్రభుత్వం మారిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు వారు మాకొద్దని ఎందుకు చెబుతున్నారన్న అంశాన్ని ‘సూర్య’ సవివరంగా ఆవిష్కరించింది.

కాపు ఎమ్మెల్యేలు ధైర్యంగా తమ సామాజికవర్గ సీఐలకు ధైర్యంగా సిఫార్సు లేఖలు ఇస్తుంటే.. టీ డీపీ ఎమ్మెల్యేలు-కమ్మ వర్గానికి చెందిన టీ డీపీ ఎమ్మెల్యేలు మాత్రం, కమ్మ సీఐలు మాకొద్దని తిరస్కరిస్తున్న క్షేత్రస్థాయి వాస్తవాలపై ‘సూర్య’ ఆవిష్కరించిన చేదు నిజాలు, ప్రభుత్వంలో ఉన్న కొందరికి రుచించలేదు. కానీ వాస్తవ పరిస్థితి ఆవిష్కరించే సందర్భంలో.. ఎవరి ఒత్తిళ్లు.. ఎలాంటి మొహమాటాలు లెక్క చేయని నైజం ‘సూర్య’ది.

అందుకే ఆ కథనానికి అనూహ్య-అనన్యసామాన్యమైన – అపూర్వ స్పందన లభించింది. చివరాఖరకు విదేశాల నుంచి కూడా అసంఖ్యాకమైన ఫోన్ల అభినందనలు. సూర్య ప్రారంభించిన తర్వాత ఆ స్థాయి స్పందన ఇదే తొలిసారి. ఒక వివాదాస్పద అంశంపై సానుకూల-ప్రతికూల స్పందన సహజం. కానీ మాకు ‘కమ్మ సీఐలు మాకొఓద్దు’ కథనంపై వచ్చిన స్పందన.. ప్రతికూలత కంటే సానుకూలతే ఎక్కువ. దాన్ని మేం ఆస్వాదించాం. ఇక మళ్లీ సీఐ పోస్టింగుల్లోకి వెళదాం.

ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది సీఐలు, కూటమి ఎమ్మెల్యేలను పోస్టింగుల కోసం రకరకాల దారుల్లో సంప్రదించారు. కులాల పేరుతో ఒకరు, బంధుత్వాల పేరుతో మరొకరు, ప్రాంతాల పేరుతో ఇంకొకరు, ముడుపులతో చాలామంది సంప్రదించి సిఫార్సు లేఖలు తీసుకున్నారు. అయితే ఐదేళ్ల నుంచి ‘ఆకలి’తో ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు, వారి బ్యాక్‌గ్రౌండ్ తెలియదు. తెలిసిందల్లా ముడుపులే. అందుకే వారు అడిగిన చోట పోస్టింగులివ్వాలని ఐజీలకు సిఫార్సు లేఖలిచ్చారు. అందులో భాగంగా తుళ్లూరు లాంటి చోట్ల ఇచ్చిన పోస్టింగుల గురించి, సోషల్‌మీడియాలో బూమెరాంగయింది. ఫలితంగా నాలుక్కరచుకుని ఆ సీఐని వీఆర్‌కు పంపించారు. ఇలాంటి ‘నాలుక్కరుచుకున్న సంఘటనలు’ బోలెడు. అదంతా టీడీపీ సోఏల్‌మీడియా సైనికుల చైతన్యమే.

ఈ నేపథ్యంలో ‘కమ్మ సీఐలు మాకొద్దు’ శీర్షికతో.. ‘సూర్య’లో వచ్చిన వార్తా కథనం ప్రభుత్వం-పోలీసుశాఖలో తుఫాను రేపింది. జగన్‌రెడ్డి జమానాలో పోస్టింగులు లేకుండా, చివరి ఏడాదిలో లూప్‌లైన్‌లోకి వెళ్లిన కమ్మ-కాపు సీఐల విషాదంపై వచ్చిన కథనం, సర్కారును పునరాలోచనలో పడేసింది. దానికి సంబంధించిన బాధితుల వివరాలను ససాక్ష్యంగా వెల్లడించిన ‘సూర్య’ ధైర్యాన్ని అందరూ అభినందించారు.

దానితో దిద్దుబాటుకు దిగిన సర్కారు.. సీఐల పోస్టింగులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసినట్లు సమాచారం. ఆ ప్రకారంగా.. గత ఐదేళ్ల నుంచి లా అండ్ ఆర్డర్‌లో పనిచేయని సీఐలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అదేవిధంగా ఐదేళ్లపాటు వీఆర్‌లో ఉన్నవారితోపాటు, ఎక్కువకాలం వీఆర్-లూప్‌లైన్లలో ఉన్న సీఐలకు పోస్టింగులలో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆ ప్రకారం చూసుకున్నా.. కమ్మ-కాపు సీఐలకు మంచిరోజులు వచ్చినట్లే. ఎందుకంటే జగన్‌రెడ్డి జమానాలో బాధితులు వారే కాబట్టి!

అదేవిధంగా గత ఐదేళ్లలో అకారణంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు-నేతలపై అక్రమ కేసులు పెట్టి, అత్యుత్సాహం ప్రదర్శించిన సీఐలకు పోస్టింగులు ఇవ్వకూడ దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రాపకంతో పోస్టింగులు పొందిన సీఐల పోస్టింగులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా ‘సూర్య’ కథనంతో వైసీపీ బాధిత సీఐలకు మోక్షం లభించినట్లే.

LEAVE A RESPONSE