Suryaa.co.in

Editorial

అభివృద్ధి నినాదంపై ‘సనాతన’ అస్త్రం!

– మోదీ అభివృద్ధి నినాదాన్ని దారి మళ్లించే ఎత్తుగడ?
– అభివృద్ధి నినాదం తెరమరుగు చేసే వ్యూహం
– సనాతన అస్త్రంతో కుల-మత సెంటి‘మంట’
– దానితో మోదీ సర్కారు అభివృద్ధి చర్చ పక్కదారి పట్టించే యోచన
– తద్వారా అభివృద్ధి నినాదాన్ని దారి మళ్లించే మాయోపాయం
– ఎన్నికల వరకూ సనాతన చర్చ పనిచేయాలన్నదే అసలు లక్ష్యం
– స్టాలిన్ ఉచ్చులో పడని కమలదళం
– ఉదయనిధి వ్యాఖ్యలు ఇండియా కూటమికి బూమెరాంగ్
– ఉదయగిరి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి
– సోనియా, రాహుల్ మౌనంపై మాటల మంటలు
– కాంగ్రెస్ హిందూ ధర్మానికి అనుకూలమా? వ్యతిరేకమా?
– ఇండియా కూటమి పార్టీలను ఇరికించిన ఉదయనిధి వ్యాఖ్యలు
– సనాతన ధర్మంపై పెదవి విప్పక తప్పని పరిస్థితి
– బీజేపీకి అనుకోని అస్త్రంలా పరిణమించిన స్టాలిన్ ‘సనాతన’ వ్యాఖ్యలు
– స్టాలిన్ బీజేపీకి తెలియకుండానే అస్త్రం ఇచ్చారా?
– సోనియా-రాహుల్, ఇండియా కూటమి లక్ష్యంగా బీజేపీ ప్రశ్నాస్త్రాలు
– మైనారిటీలను ఏకం చేసే ఉదయనిధి వ్యూహం ఫలిస్తుందా?
– ఉదయనిధి వ్యాఖ్యలు హిందువులను ఏకం చేస్తాయా?
– ఎన్నికల వేళ సనాతన అంశంతో ‘కమలం’ వికసిస్తుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. తన భాగస్వామ్యపార్టీకి చెందిన ఓ కుర్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాణసంకటంలా పరిణమించాయి. దానిని స్వాగతిస్తే ఒక చావు. ఖండిస్తే మరో చావు. ఏదైనా చావే. పోనీ అదేమైనా ఆషామాషీ అంశమా అంటే కానేకాదు. దేశంలోని మెజారిటీ హిందువుల మనోభావాలతో ముడిపడిన సెంటిమెంట్. ఇప్పుడు దానికి మంట పెట్టిన ఉదయనిధి స్టాలిన్ పిల్లచేష్టలు, కాంగ్రెస్ పెద్దన్నకు శిరోభారంగా మారింది.

మోదీ అభివృద్ధిని పక్కదారి పట్టించి, చర్చను సనాతన ధర్మంవైపు మళ్లించాలన్న వ్యూహం బెడిసికొట్టింది. ఎన్నికల వరకూ సనాతన ధర్మ వ్యాఖ్యలపై చర్చించేలా చూసే రాజకీయ ఎత్తుగడ బెడిసికొడుతోంది. ఫలితంగా కాంగ్రెస్ హిందువు వైపా? హిందూ వ్యతిరేకుల వైపా అన్న అంశం తేల్చుకునేలా చేసింది. ఇది సహజంగానే ఎన్నికల వేళ, పువ్వుపార్టీకి అనుకోని అస్త్రంలా పరిణమించింది.

అయ్యవారిని చేయబోతే కోతి అయిందట. సనాతనధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, ఇండియా కూటమి పాలిట అలాగే మారాయి. ‘డెంగీ, మలేరియా, జ్వరాల మాదిరిగానే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల’ని తమిళనాడు డిఎంకె మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, దేశంలో సెంటి‘మంట’ రగిస్తున్నాయి. స్టాలిన్ కూడా దీనినే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. హిందూ సమాజంలో ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పరిణామాలు అటు తిరిగి ఇటు తిరిగి, ఇండియా కూటమిని పుట్టించిన కాంగ్రెస్‌కు శిరోభారంలా పరిణమించాయి. ఇది కూడా చదవండి: సనాతన ధర్మానికి బద్ధ వ్యతిరేకి డీఎంకే పార్టీ

ఉదయనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, ఆయా రాష్ట్రాలోని ఇండియా కూటమి భాగస్వామి పార్టీల ఉనికికే ప్రమాదం తెచ్చేలా మారింది. ఫలితంగా కూటమి ధర్మం పక్కనపెట్టి.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై, మైనారిటీ పక్షపాతి అన్న ముద్ర ఉన్న విషయం తెలిసిందే. అలాంటి మమత కూడా.. ఉదయనిధి వ్యాఖ్యలు ఖండించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొందంటే, ఆయన వ్యాఖ్యలు విపక్షాలున్న రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీలను, ఏ స్థాయిలో ఆత్మరక్షణలోకి నెట్టాయో స్పష్టమవుతోంది.

‘ఉదయనిధి ఒక జూనియర్. ఆయన మాటలు పట్టించుకోవలసిన పనిలేదు. నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తా. ప్రతి మతానికీ ప్రత్యేక సెంటిమెంట్లు ఉంటాయని’ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శివసేన చీలిక వర్గం కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించింది. సనాతనధర్మం మనదేశానికి పునాది అని, ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. స్టాలిన్ మాటలతో తాను ఏకీభవించేది లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాధ్ స్పష్టం చేశారు.

అయితే కాంగ్రెస్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ మాత్రం.. కర్రవిరక్కుండా పాము చావకుండా వ్యాఖ్యానించడం, సనాతన ధర్మంపై ఆ పార్టీ ఇరకాటం ఏమిటన్నది స్పష్టమయింది. ‘అన్ని మతాలను గౌరవించాల్సిన అవసర ం ఉంది. ప్రతిపార్టీకి భావవ్యక్తీకరణ హక్కు ఉంది. ఉయదగిరి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ స్పష్టం చేశారు. కానీ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించకపోవడం ప్రస్తావనార్హం.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తన మిత్రపక్షమై డిఎంకె చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ అధినేత్రి సొనియా గాంధీ, యువనేత రాహుల్ ఇప్పటివరకూ స్పందించకుండా మౌనరాగం ఆలపించడం విమర్శలకు దారితీస్తోంది. ఉదయనిధి వ్యాఖ్యలను వారిద్దరు సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా అన్న దానిపై జవాబు ఇవ్వాలంటూ, బీజేపీ శరపరంపరగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సెక్యులర్ ముసుగులో హిందూద్వేషిగా పనిచేస్తోందంటూ బీజేపీ- హిందూ సంఘాలు విరుచుకుపడుతున్నా, తల్లీకొడుకులు మౌనంగా ఉండటం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది.

దీన్నిబట్టి ఉదయనిధి రేపిన సనాతన తేనెతుట్టె.. కాంగ్రెస్‌ను ఏ స్థాయిలో కుడుతోందో స్పష్టమవుతోంది. అయితే వారిద్దరూ ఈ మౌనం మరింత కాలం కొనసాగిస్తే.. కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న మిగిలిన హిందువులు కూడా, పూర్తిగా దూరమయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న హిందువుల మద్దతు అవసరమా? లేదా? అన్నది నిర్ణయించుకోవడం, ఆ పార్టీ తీసుకునే నిర్ణయంపై బట్టే ఉంటుంది.

నిజానికి మోదీ సర్కారు సంధిస్తున్న అభివృద్ధి నినాదాన్ని పక్కదారిపట్టించేందుకే.. సనాతన ధర్మ అంశాన్ని, వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారన్న చర్చ జరుగుతోంది.

అటు బీజేపీ కూడా తాజా పరిణామాలను, సద్వినియోగం చేసుకునేందుకు రంగంలోకి దిగింది. సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదంటూ, సోనియా-రాహుల్‌పై ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.

గత తొమ్మిదేళ్ల తన పాలనలో జరిగిన అభివృద్ధిని ఏకరవు పెడుతున్న మోదీ అభివృద్ధి మంత్రానికి విరుగుడుగా, విపక్షాలు తెరపైకి తెచ్చిన సనాతనధర్మ అస్త్రం.. చివరాఖరకు ఇండియా కూటమికే ఎదురు తిరుగుతున్న పరిణామాలు, సహజంగా బీజేపీకి అనుకూలించేవేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల వరకూ మోదీ అభివృద్ధి నినాదం జనంలోకి వెళ్లకుండా, స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యల చుట్టూనే చర్చ జరిగేలా చూడాలన్నదే విపక్షాల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే దానివల్ల ఇండియా కూటమికి లాభం కంటే నష్టమే ఎక్కువన్నది, మమతా బెనర్జీ ఆందోళనతో చేసిన వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. ఇది తమ రాష్ట్రాల్లో తమకు నష్టం కలిగిస్తాయన్నది ఇండియా కూటమి నేతల అసలు ఆందోళన. బీజేపీ సమరశంఖం పూరించిన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు, అసలుకే ఎసరు తెస్తాయన్నది వారి వాదన.

నిజానికి కాంగ్రెస్‌కు మైనారిటీ అనుకూలపార్టీ అన్న ముద్ర ఉందన్నది బహిరంగం. కానీ ఇండియా కూటమి పార్టీలపై ఆ స్థాయిలో ఆ ముద్ర లేదు. కూటమిలో ఉన్న శివసేన చీలిక వర్గానిది మొదటి నుంచీ హిందూవాదమే. మరో ప్రధాన భాగస్వాములైన ఆప్, జనతాదళ్ వంటి పెద్ద పార్టీలనా మైనారిటీ అనుకూల ముద్ర గానీ- హిందుత్వ ముద్రగానీ లేవు. అవి ఆయా రాష్ట్రాల్లో సెక్యులర్ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయి. అసలు ఇండియా కూటమిలో ఒక్క కాంగ్రెస్‌పై తప్ప, ఏ ఒక్క పార్టీపైనా మైనారిటీ అనుకూల పార్టీ ముద్ర లేదన్నది సుస్పష్టం.

పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీలకు అనుకూలంగా ఉంటారన్న విమర్శలున్న మమతా బెనర్జీ వంటి అగ్రనేతనే.. సనాతన ధర్మం గొప్పదని ప్రకటించారు. అంటే దీన్ని బట్టి ఉదయనిధి వ్యాఖ్యలతో.. హిందువుల నుంచి తన పార్టీకి ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో, ఆమె ముందస్తుగా గ్రహించినట్లు స్పష్టమవుతుంది.

కాగా స్టాలిన్ వ్యాఖ్యల వెనుక.. బీజేపీని రెచ్చగొట్టి, సనాతన ఉచ్చులోకి తీసుకురావావలన్న లక్ష్యం కూడా లేకపోలేదు. తన వ్యాఖ్యలపై బీజేపీ రెచ్చిపోయి, మోదీ సర్కారు అభివృద్ధి నినాదాన్ని పక్కకుపెట్టి, హిందుత్వ పైనే దృష్టి కేంద్రీకరిస్తుందని స్టాలిన్ అంచనా వేసి ఉండవచ్చు. దానితో మైనారిటీలను ఏకతాటిపైకి తెచ్చి, హిందువుల్లో కులాలను చీల్చి, తద్వారా బీజేపీకి ఓడించాలన్నది స్టాలిన్ వ్యాఖ్యల మర్మంగా కనిపిస్తోంది. అయితే బీజేపీ ఆ ఉచ్చులో పడకపోవడం ప్రస్తావనార్హం.

తాజా పరిణామాలతో హిందువులంతా, ఏకతాటిపైకి వచ్చే అవకాశాలపై బీజేపీ ఆశతో ఉంది. ఉదయగిరి వ్యాఖ్యలపై సోనియా-రాహుల్ మౌనంతో, హిందువుల్లో కాంగ్రెస్‌పై ఉన్న భ్రమలు తొలగిపోతాయని బీజేపీ అంచనా వేస్తోంది. స్టాలిన్ వ్యాఖ్యలు తమకు మతపరంగా లబ్థిచేకూరుస్తోందని బీజేపీ భావిస్తోంది. స్టాలిన్ వ్యాఖ్యలపై సగటు హిందువు రగిలిపోతున్న వైనం ఎన్నికల వరకూ కొనసాగితే, కాంగ్రెస్‌కు ఓటేసే హిందువులెవరూ ఉండరని అటు హిందూ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పుడు కాంగ్రెస్ ముందున్నవి రెండే మార్గాలు. అది తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని చెప్పడమా? లేక ఉద యగిరి చెప్పినట్లు, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పడమా? దీనికి సమాధానం చెప్పకుండా.. రాహుల్ గాంధీ ఎన్ని గుళ్లకు వెళ్లి పూజలు చేసినా, సగటు హిందువు ఆగ్రహావేశం నుంచి తప్పించుకోవడం అసంభవం.

LEAVE A RESPONSE