Suryaa.co.in

Features

సనాతన ధర్మం – వాద వివాదాలు

తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ “సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అని, ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యపై పెద్ద చర్చ జరుగుతోంది.

‘సనాతన ధర్మం అంటే, హిందూ మతం కాదు. అది ప్రాచీన కాలం నుంచీ వస్తున్న మానవ ధర్మ పరంపర!’ అని కొందరు సమర్థకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉదయనిధి తన వ్యాఖ్యల్లో ప్రధానంగా చెప్పింది “సమానత్వానికి, సామాజిక న్యాయానికి అడ్డుగా నిలుస్తున్న ‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలి” అని! దీని వెనుక నున్న ప్రధాన ఉద్దేశం “మనుషుల్ని విడదీస్తున్న, సోదరభావాన్ని చంపుతున్న, కుల రక్కసి” ని విమర్శించడమే అనీ, స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినా కొందరికి ఇది రుచించదు.

‘సనాతన ధర్మమంటే.. హిందూ ధర్మం కాదు, బ్రాహ్మణ ధర్మం కాదు, మను ధర్మం కాదు, అది మానవ ధర్మం’ అని చెప్పేవాళ్లు.. అదేమిటో స్పష్టంగా చెప్పగలగాలి. ఉదయనిధి వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్న వర్గాలు, రాజకీయ పార్టీలు, హిందూ మతాన్ని భుజానికి ఎత్తుకున్నవే అన్నది స్పష్టం. “సనాతన ధర్మం” అన్నది హైందవానికి, మనుధర్మానికి ఘనతను ఆపాదించడానికి పెట్టిన మారు పేరే తప్పా, మరోటి కాదు!

సనాతనం అంటే స్థిరమైనది, శాశ్వత మైనది అని అర్థం. ఈ అర్థంలో చూస్తే ఏ ధర్మమూ స్థిరంగాను, శాశ్వతంగా ఉండవని ముందుగా మనం తెలుసుకోవాలి. పరిణామంలో ఉన్న ఈ విశ్వంలో ఏదీ స్థిరం కాదు. మనిషి ఏర్పాటు చేసుకున్న ధర్మాలు, అసలే స్థిరం కాదు! అవి కాలానుగుణంగానే గాక, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి, నాగరికతను బట్టి మారిపోతుంటాయి. స్థిరమైన ధర్మాలను పాటించాలంటే, సామాజిక మార్పులన్నింటినీ గంపగుత్తగా తిరస్కరించాలి!

సనాతనుడు అనే పదానికి పూర్వగాథాలహరి “ధర్మరాజు కొలువులోని ఒక ఋషి” అని చెబుతుంటే, శబ్ద రత్నాకరం “బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు” అని చెబుతోంది. ఇలా చూసుకున్నా.. సనాతన ధర్మమంటే, ‘మనుధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నదే’ అని తెలుస్తుంది. సనాతన ధర్మం మంటగలసి పోతోందని, విమర్శలకు గురవుతోందని వాపోతున్నవారు.. ఈ ధర్మాలన్నీ అందులో భాగమేనని, అవి కొనసాగ వలసిందేనని కోరగలరా?

* సతీ సహగమనం, సనాతన ధర్మంలో భాగం!
* అంటరానితనం, సనాతన ధర్మంలో భాగం!
* బాల్య వివాహాలు, సనాతన ధర్మంలో భాగం!
* విధవా పునర్వివాహాల నిరోధం, సనాతన ధర్మంలో భాగం!
* దేవదాసీ, జోగినీ వ్యవస్థలు సనాతన ధర్మంలో భాగం!
* వివాహానంతరం వధువు మొదటి రాత్రి పురోహితుడితో గడపడం, సనాతన ధర్మంలో భాగం!
* స్త్రీలకు, శూద్రులకు చదువు నిషేధించడం, సనాతన ధర్మంలో భాగం!
* నేరం చేస్తే, కులాన్ని బట్టి శిక్ష విధించడం, సనాతన ధర్మంలో భాగం!
* శూద్రులు వృత్తి – ఉద్యోగాలు చెయ్యకుండా.. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలందించడం, సనాతన ధర్మంలో భాగం!
* పురుషులు, కిందికులాల స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు మాత్రం, కిందికులాల పురుషులను పెళ్లి చేసుకోకూడదు. ఇదీ సనాతన ధర్మంలో భాగమే!

మరి ఇప్పుడు ఇవన్నీ పాటిద్దామా? కాలాన్ని బట్టి మారదామా? ఆలోచించండి!

సాధువు దగ్గర 10 కోట్లా?

ఉదయనిధి తల నరికిన వారికి, పది కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు… అయోధ్య సాధువు పరమహంస ఆచార్య! ‘ఇలాంటి మత ఉగ్రవాదులను, ప్రభుత్వాలు ఎందుకు శిక్షించవు’ అని అనుకోవడం, మన అమాయకత్వమే అవుతుంది! ఎందుకంటే, పాలకవర్గాల అండతోటే, వీరు ఇలా బరితెగించి మాట్లాడుతున్నారు కాబట్టి!

ఉదయనిధి కామెంట్స్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లు, ముందు సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పాలి! సమానత్వాన్ని, శ్రమను గౌరవించని ఏ మత ధర్మం అయినా.. అది మానవ సమాజానికి, అవసరం లేని ధర్మమే అవుతుంది!

( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– జుట్టు తాతారావు
కెవి శేషారెడ్డి రైటింగ్ నుంచి సేకరణ

LEAVE A RESPONSE