Suryaa.co.in

Political News

సనాతన ధర్మ సవ్యసాచి పవన్ కళ్యాణ్

– తిరుపతిలో వారాహి సభలో డిక్లరేషన్ వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం ఏమిటి?
– హిందూ ధర్మ పరిరక్షణకు మోదీ తర్వాత పవన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతారా?
(పులగం సురేష్)

సనాతన ధర్మానికి సవ్యసాచిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారనున్నారు. దీనిపై అనుమానాలు అవసరం లేదు. అవును ఆయన వ్యూహాత్మకంగానే సనాతన ధర్మాన్ని గురించి దాని పరిరక్షణ గురించి పాటుపడుతున్నట్లు బహిరంగంగా ఇకపై తన మార్గం ఇలాగే ఉంటుందని ప్రకటించారు.

అందుకనే తమిళనాడు తో సహా ఇతర రాష్ట్రాల్లోని సనాతన హైందవ ధర్మాన్ని కించపరుస్తూ, లేదా దాన్ని అవమాన పరుస్తూ, జరిగిన సంఘటనలను ఉదహరించి వాటికి కారకులైన ప్రముఖుల అందరిని ఒక విధంగా కడిగిపారేశారు. ఇకపై ఇలాంటి హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని సహించనని హెచ్చరికలు జారీ చేస్తూ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారు.

తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ ఈ విధమైన ప్రసంగం చేయడాన్ని ఎవరూ ఊహించలేదు. ఈ ప్రసంగం వెనుక బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థల స్క్రిప్ట్ అందించాయని వాదనలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ కోణాన్ని ధ్రువీకరిస్తున్నారనే జనసేన రాజకీయ భవిష్యత్తు బయటపడింది.

భారతదేశానికి ఇప్పటికే హిందూ దేశంగా గుర్తింపు తీసుకురావడానికి ప్రధానమంత్రి స్థాయిలో.. నరేంద్ర మోడీ తీసుకుంటున్న అనేక చర్యలను, దేశంలో 100 కోట్ల మంది హిందువులు హర్షిస్తున్నారు. పైకి ఆయనపై అనేక అంశాలపై విమర్శలు చేస్తున్నప్పటికీ అంతర్లీనంగా హిందువులందరికీ నరేంద్ర మోడీ మనోధైర్యాన్ని కలిగిస్తున్నారని ఘంటాపథంగా చెప్పవచ్చు.

కేంద్రంతో సత్సంబంధాలు కలిగి మోడీ బాటలో పయనించడానికే కేంద్ర స్థాయిలో చక్రం తిప్పడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మంపై దాని పరిరక్షణపై తాను ఒక కీలకమైన ప్రతినిధిగా నిరంతరం కొనసాగేలా ప్రకటించుకున్నారనేది రాజకీయ వ్యూహకర్తల ఆలోచన గా ఉంది.

సనాతన ధర్మ పరిరక్షకుడిగా గతంలో ఎవరు చేయని సాహసాన్ని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతి సభలో ఆయన ఇతర రాష్ట్రాలు లోని కొందరిని టార్గెట్ చేసి మాట్లాడారు. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడైన ఉదయనిది స్టాలిన్, శ్రీరాముడి విగ్రహాన్ని చెప్పులతో ఊరేగించిన గతంలోని సంఘటనను ఉదాహరించి, మరో మంత్రిని ఇలా అనేక మందిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆంగ్లంలోనూ, తరువాత తమిళంలోనూ, అనంతరం తెలుగులోను సనాతన ధర్మంపై సుదీర్ఘమైన ప్రసంగాన్ని కొనసాగించారు.‌ తన భాషలోనే కాదు తన వేషంలోనూ ఆయన సనాతన ధర్మం ఉట్టిపడేలా డ్రెస్ కోడ్ మార్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఎవరెవర్నో టార్గెట్ చేశారు.. మత రాజకీయాలు చేస్తున్నారు.. ఇలా ఏవేవో అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం కొత్తేమీ కావు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి, డిప్యూటీ సీఎం అయ్యేవరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎన్నెన్నో విమర్శలు.. ఏవేవో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు.. అన్నిటినీ, ఆయన తట్టుకుని నిలబడ్డారు.

ఓ ముఖ్యమంత్రి సిగ్గూ ఎగ్గూ లేకుండా బహిరంగ సభల్లో, పవన్ కళ్యాణ వ్యక్తిగత జీవితంపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం చూశాం. పవన్ కళ్యాణ్‌కి ప్రధాన ఆదాయ వనరు అయినా, సినిమాల్ని దెబ్బకొట్టాలని ఏకంగా ఓ ప్రభుత్వమే చూసింది. అప్పుడే, పవన్ కళ్యాణ్ వెనకంజ వేయలేదు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం! అంతకు మించి, ఆయన అసలు సిసలు విజేత.! ఓడినప్పుడు కుంగిపోని పవన్ కళ్యాణ్, గెలిచాక పొంగిపోతారని ఎలా అనుకోగలం.? ఆయనెప్పుడూ ఒకేలా ఉంటారు. కాకపోతే, ఆయన చుట్టూ ‘పవర్’ అనేది ఎప్పుడూ వైఫైలా వుంటుంది. పవన్ కళ్యాణ్‌కి ఎనర్జీ ఇచ్చేది ఆయన మీద కోట్లాది మందికి వున్న అభిమానం. ఆయన గెలుపు, ఆ అభిమానులకు బోల్డంత పవర్ ఇస్తుంది.

సనాతన ధర్మం గురించి భారత దేశంలో మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే, అదో బూతు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, గుండుతో స్కూలుకి వెళితే, అక్కడా వివక్ష.! బొట్టు పెట్టుకుంటే, కళాశాలల్లో వివక్ష. అయ్యప్ప మాల వేసుకుంటే, కార్యాలయాల్లో అవమానాలు. ఇదీ సనాతన ధర్మం పట్ల దేశంలో అనుసరిస్తున్న అణచివేత వైఖరి. అందుకే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం పవన్ కళ్యాణ్ నినదిస్తున్నారు.

సనాతన ధర్మం అంటే, హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడం.. అలాగని, అన్యమతాలను ద్వేషించడం సనాతన ధర్మం తాలూకు ఉద్దేశం కానే కాదు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి సభ ద్వారా, వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. అందులో ప్రతి అంశమూ సనాతన ధర్మం చుట్టూనే ప్రస్తావించబడింది. సనాతన ధర్మ పరిరక్షణకు ఇంతకంటే మంచి డిక్లరేషన్, దేశంలో ఇంకెవరూ చూపించలేరు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, రాజకీయ అంశాల్నీ ప్రస్తావించారు.

సనాతన ధర్మంపై జరిగిన, జరుగుతున్న రాజకీయ దాడిని కూడా పేర్కొన్నారు. మధ్యలో న్యాయ వ్యవస్థ గురించి కూడా ప్రస్తావించారు. నిజమే కదా, సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే హిందువైతే సరిపోతుంది కదా? న్యాయ వ్యవస్థ ఆ సనాతన ధర్మాన్ని గౌరవించకపోతే, దాన్ని సనాతన ధర్మాన్ని ఆచరించేవారు ప్రశ్నించకపోతే ఎలా?

ప్రసాదం నాణ్యత, పవిత్రతను ఏ న్యాయస్థానం నిర్ధారించ కలుగుతుంది? అన్న ప్రశ్న దేశంలో వంద కోట్ల మంది హిందువులకు కలిగితే, అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒకవేళ ప్రస్తావిస్తే అది తప్పెలా అవుతుంది.? దేశంలో ఒకే ఒక్క నాయకుడు, సనాతన ధర్మం గురించి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అతనే పవన్ కళ్యాణ్.

ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మీద, హిందూయేతరులైన కొందరు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాడికి దిగే అవకాశం లేకపోలేదు. అది ట్వీట్ల ద్వారా కావొచ్చు.. తమ మీడియా సంస్థల ద్వారా కావొచ్చు.. తమ అదుపాజ్ఞల్లో వుండే వ్యవస్థల ద్వారా కావొచ్చు. దేశంలో వంద కోట్ల మంది హిందువులు.. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన పవన్ కళ్యాణ్‌కి అండగా నిలవాల్సిన సమయం వచ్చేసింది.

ఔను, సనాతన ధర్మానికి ప్యాన్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’! మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి స్థాయిలో చక్రం తిప్పనున్న కీలకమైన నేత పవన్ కళ్యాణ్.

రామ మందిరం పేరుతో బిజెపి నాయకులు ఎలాగైతే కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకొని చక్రం తిప్పుతున్నారో.. అదే విధంగా పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షకుడుగా మారి, భవిష్యత్తులో అనూహ్యమైన రాజకీయ భవిష్యత్ నిర్దేశకుడుగా మారనున్నారనేది కాదనలేని వాస్తవం.

LEAVE A RESPONSE