* రెచ్చిపోతున్న మాఫియా
* సిండికేట్లుగా మారిన వైకాపా నేతలు
* జిల్లాల వారీగా అక్రమ టార్గెట్లు
* ముఖ్యనేతలకు ముడుపులు
గుప్పెడు ఇసుక తీసుకుని ఎంత పిండినా ఏమీ రాదు…
కానీ వైకాపా నేతలు మాత్రం అదే ఇసుక నుంచి కాసులు పిండుతున్నారు!
ఆ కాసుల విలువ వేలాది కోట్లు!
రాష్ట్రంలో ఇసుక మొత్తం ఇప్పుడు అధికార పార్టీ ముఖ్యనేతల గుప్పెట్లో ఉంది…
ర్యాంపుల్లోంచి, రీచ్‌ల్లోంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది…
తవ్వుతున్న ఇసుకకు లెక్కా జమా ఉండడం లేదు…
అమ్మకాలకు అయిపూ అజా కనిపించడం లేదు…
ఫలితంగా… ప్రభుత్వ ఆదాయానికి గండి
కాగితాలపై చూస్తే అంతా పక్కా
కానీ పరిశీలించి చూస్తే ఇసుక దందా విశ్వరూపం
ఇసుక తవ్వకాలు జరిపి అమ్మకాలు చేసే కాంట్రాక్టర్లు ఎవరైనా కావచ్చు…
కానీ ఈ మొత్తం వ్యవహారంపై గుత్తాధిపత్యం మాత్రం అధికార పార్టీ నేతలదే!
వేలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి…
లక్షలాది టన్నుల ఇసుక యధేచ్ఛగా తరలి పోతోంది…
అధికారికంగా చూపించే అమ్మకాలు గోరంత…
అక్రమంగా పిండుకునే సొమ్ము కొండకు మించినంత!
జనసేన నేతల పరిశోధనలో తేలిన నిజం
ఏపీలో యధేచ్చగా సాగుతున్న ఇసుక తవ్వకాలు, వాటి వెనుక దాగిన అధికార పార్టీ హస్తాలపై జనసేన చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. జనసేన నేతలు వివిధ ఇసుక రీచ్‌లకు వెళ్లి, జర్నలిస్టుల మాదిరిగా స్వయంగా చేసిన పరిశోధనలు బయటపెట్టారు. ఇక కథనంలోకి వె ళదాం రండి.
* అపారమైన వనరులు…
రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. ఆపైన నాగావళి, గోదావరి, కృష్ణాలాంటి పెద్ద నదులు… పెన్నా, వంశధార, తుంగభద్ర, చంపావతి, వేదావతి దగ్గర నుంచి ఎర్రకాలువ వరకు అనేక ఉపనదులు, కాలువలతో కూడిన విస్తారమైన తీరాలు ఉన్నాయి. వీటన్నింటి పరిధిలో వందలాది ఇసుక రీచ్‌లు ఉన్నాయి. గనుల శాఖ అధికారులు చెప్పే లెక్కల ప్రకారం చూస్తే… ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతాయని అంచనా. ఇసుకను ఎవరు తవ్వుతున్నా టన్నుకు రూ. 375 వంతున ప్రభుత్వ ఖజానాకు జమ అవ్వాలి. ఆ ప్రకారం రూ. 750 కోట్లు ప్రభుత్వానికి జమ అవుతుంది. అయితే ప్రస్తుతం పరిస్థితిని చూస్తే గనుల శాఖ అంచనాకు మించి ఎన్నో రెట్ల టన్నుల ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. మరి ఆ సొమ్ము మొత్తం ఎక్కడికి పోతోంది? ఇసుక మాఫియాను నడిపిస్తున్న వ్యక్తుల జేబుల్లోకి చేరుతోంది. మరి ఆ ఇసుక మాఫియాను ఎవరు నడిపిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు ఆశ్చర్యకరమైన వివరాలు వ్యక్తమవుతున్నాయి. ర్యాంపుల్లో, రీచుల్లో ఇసుక తవ్వకం, అమ్మకాలు జరిపే కాంట్రాక్టర్లు పేరుకు ఎవరో ఉంటారు. వారి పేరు మీద మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నది మాత్రం అధికార వైకాపా నేతలు, వారి ముఖ్య అనుచరులే.
ఇలా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక నాయకులు, వారి బంధువులు అనధికార డీలర్లుగా అవతారమెత్తారు. వీళ్ల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ సిండికేట్లు ఏర్పడ్డాయి. ఆ సిండికేట్ల నుంచి నెల వారీగా ఎంతెంత సొమ్ము చెల్లించాలో లక్ష్యలుగా నిర్ణయించేశారు. ఆ సొమ్మంతా వైకాపా ముఖ్యనేతలకు చేరుతోందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలిసిన సత్యమే. ఇలా జిల్లాల సిండికేట్ల నుంచి ఏటా రూ.1800 కోట్ల మేరకు వసూలు చేస్తున్నారని అంచనా. ఇందులో నుంచి ప్రభుత్వానికి అధికారిక లెక్కల ప్రకారం రూ. 750 కోట్ల మేరకు కట్టి, మిగతా రూ. 1035 కోట్ల మేరకు భోంచేస్తున్నారని అర్థమవుతోంది.
ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి అక్రమంగా తరలిపోయే ఇసుక రవాణాను అరికట్టగలిగితే వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరతాయి. కానీ అలా జరగడం లేదు. ఇందువల్లనే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరి ఇసుక ర్యాంపుల నుంచి తవ్వే ఇసుకకు, తరలించే ఇసుకకు ఓ లెక్క, జమ ఉండవా? అంటే అదొక అమాయకమైన ప్రశ్నగానే మిగిలిపోతుంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ వ్యవహరానికి లోపాయికారీగా అనేక అండదండలు లభిస్తాయి. ఎలాగంటే… ఇసుక రీచ్‌ల నుంచి, ఇసుక నిల్వ కేంద్రాల నుంచి అమ్ముడయ్యే ప్రతి టన్ను ఇసుకకు పక్కా బిల్లు ఉంటేనే ఎంత మేరకు అమ్మకాలు జరిగాయో, ఎంత సొమ్ము ఖజానాకు చేరిందో తెలుస్తుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జరుగుతున్నది వేరు. రీచ్‌ల నుంచి బయటకు వెళ్లే ఇసుకకు సంబంధించి కచ్చితమైన బిల్లులు ఇస్తున్నది నామ మాత్రమే. అంటే ఆ నామ మాత్రపు అమ్మకాలకు సంబంధించిన సొమ్మే ఖజానాకు చేరుతుందన్న మాట. అయితే సరైన బిల్లులు లేకుండా కాగితంపై రాసిచ్చిన చీటీలతో రీచ్‌ల ద్వారా రవాణా అయ్యే వందలాది, వేలాది లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా ఎంత మేరకు ఇసుక తరలిపోతోందనేది ఎక్కడా లెక్కకు అందని పరిస్థితి.
* ఏదీ పారదర్శకత?
ఇసుక సరఫరాను పారదర్శకంగా చేయడానికంటూ ఆన్‌లైన్ విధానాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ప్రకారం బుక్ చేసుకునే వారికి ఇసుక సరఫరా జరిగితే ఆ మేరకు ఖజానాకు సొమ్ము జమ అయినట్టే. అయితే వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే అదీ జరగడం లేదని అర్థం అవుతుంది. ఎలాగంటే, ఆన్‌లైన్‌లో కొంత మేరకు అమ్మకాలు జరిగాక, సంబంధిత వెబ్‌సైట్ స్ట్రక్ అయిపోతుంది. లేదా సర్వర్ సమస్యంటూ నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో ఇసుక అత్యవసరంగా కావాలనుకుంటే నేరుగా రీచ్‌ల దగ్గరకు వెళ్లడమో, దళారులను ఆశ్రయించడమో తప్పని సరి. రీచ్‌ల దగ్గరకు వెళితే సరైన బిల్లలు లేని అమ్మకాలకు తలొగ్గక తప్పదు. పైగా అక్కడ నేరుగా క్యాష్ కట్టాలని సూచిస్తారు. డిజిటల్ విధానంపై చెల్లించడానికి అక్కడి వారు అంగీకరించరు. ఎందుకంటే డిజిటల్ విధానం ద్వారా జరిగే చెల్లింపులన్నీ అధికారికమవుతాయి కాబట్టి. అలాగే రీచ్‌లలో ఇసుకను కాంట్రాక్టర్లు టన్ను రూ. 475లకు అమ్మాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆ ఖర్చుకు ఇతర ఛార్జీలంటూ మరికొంత సొమ్మును వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇదంతా దళారుల ఆధిపత్యంలో జరిగిపోతుంది. దాంతో ఎంత తవ్వుతున్నారు, ఎంత అమ్మకాలు చేస్తున్నారనే విషయాలు నామమాత్రంగా మాత్రమే అధికారికంగా నమోదు అవుతాయి.
అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇసుక లభ్యమయ్యే ప్రాంతాల నుంచి అక్కడి స్థానికులు తమ సొంత అవసరాల కోసం కొంత ఇసుకను తీసుకోవచ్చనే వెసులుబాటు ఉంది. దీన్ని ఆధారం చేసుకుని కూడా అక్రమ రవాణా దారులు రెచ్చిపోతున్నారు. ఎలాగంటే ఎడ్ల బండ్లపై తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఈ వెసులు బాటును అడ్డం పెట్టుకుని ఇసుక దొరికే తీరాల నుంచి ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి..’. అన్నట్టు వందలాది ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఆ ఎడ్లబండ్లన్నింటినీ ఒక చోట చేర్చి ఇసుకను దింపించి నిల్వ చేస్తున్నారు. ఆపై వీలు చూసుకుని, దొంగ బిల్లులు చూపించి పెద్ద వాహనాల ద్వారా ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇదంగా అనధికారికంగా వైకాపా నేతల అండదండలతో సాగుతోందనేది బహిరంగ రహస్యమే కాబట్టి, నివారించరాల్సిన పోలీసులు కానీ, అధికారులు కానీ కిమ్మనరు. అడపా దడపా పట్టుకుని కేసులు పెట్టినట్టు చూపించినా అది నామ మాత్రమే. నిజానికి రాష్ట్రంలో ఇసుక రవాణా జరిగే ప్రాంతాల్లో 485 చెక్‌పోస్టులు ఉన్నాయి. వాటిలో సీసీ టీవీ కెమేరాల నిఘా కూడా ఉంది. అయినా కూడా ఇసుక మాఫియా రెచ్చిపోతోందంటే… వైకాపా నేతలు, అధికారుల అండదండలు ఎంతలా ఉన్నయో ఇట్టే అర్థమైపోతుంది.
* ఇదీ నేతల అసలు రూపం…
జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక విధానంలో ఎలాంటి మార్పులు జరిగాయో చూద్దాం. 2019 నుంచి 2021 వరకు ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించింది. ఆ తర్వాత 2021 మార్చిలో ఇసుక వ్యాపారాన్ని ఉత్తరాదికి చెందిన జయప్రకాశ్ పవర్ (జేపీ) వెంచెర్స్ సంస్థ దక్కించుకుంది. ఆపై ఈ కంపెనీ చెన్నైకి చెందిన టర్న్ కీ సంస్థకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇలా ఇవ్వడం చట్టబద్దమా కాదా అనే విషయం పక్కన పెడితే టర్న్ కీ సంస్థ ఇసుక టెండర్లు పిలిచిన కొన్ని నెలలకే పుట్టుకొచ్చిందనీ, నిజానికి అది వైకాపా నేతల అస్మదీయులకు చెందిన కంపెనీ అనే ఆరోపణలు వచ్చాయి. నిజానికి పేరుకి టర్న్ కీ సంస్థ ప్రతినిధులు ఇసుక రీచ్‌లలో ఉండాల్సి ఉన్నా, స్థానిక వైకాపా నేతలు, ఎమ్మెల్యేల అనుచరులే వ్యవహారం నడిపిస్తున్నారు. చాలా జిల్లాల్లో వైకాపా నేతలో, వారి అనుచరులో, బంధువులో ఇసుక వ్యాపారాన్ని కైవసం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిరిగి వాళ్లు జిల్లాలో రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలను తమ అనుచరులకు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కోట్లాది రూపాయలను వారి నుంచి ముందుగానే అందుకుంటున్నారు. ఇక్కడ మరిన్ని వివరాల్లోకి లోతుగా తొంగి చూస్తే అత్యధికంగా ఇసుక విక్రయాలు జరిగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రూ. 35 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ.18 కోట్లు, గుంటూరుకు రూ.17 కోట్లు, శ్రీకాకుళానికి రూ. 16 కోట్లు… ఇలా ప్రతి జిల్లాకు నెలవారీ లక్ష్యాలు విధించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వసూలయ్యే సొమ్ము వేలాది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. దాంట్లోంచి ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేది కేవలం నామ మాత్రమేనన్నది ప్రత్యేకంగా ప్రస్తావించనక్కరలేదు.
మొత్తానికి వైకాపా నేతలు ఇసుక నుంచి కాసులు పిండుకుంటున్నారు!
ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు!
చట్టానికి గంతలు కడుతున్నారు!
ప్రజల కంట్లో దుమ్ము కొడుతున్నారు!