– మంత్రి నిరంజన్ రెడ్డి సూటి ప్రశ్నలు
అమ్మవారి సాక్షిగా అబద్దాలు చెప్పడం బిజెపి నేతలు బండి సంజయ్ ,కిషన్ రెడ్డిలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఓ పత్రికా ప్రకటనలో వారి తీరును ఎండగట్టారు. 2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని చెప్పింది నిజం కాదా? దానిని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టింది నిజం కాదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి పథకానికి ఒక్కపైసా ఇయ్యని కేంద్ర ప్రభుత్వం, కనీసం ఈ ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలున్నాయా? అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. నడిగడ్డ కు ,ఉమ్మడి పాలమూరు జిల్లాకు నష్టం కలిగించే కర్ణాటకలోని భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
ఈ విషయమై ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న నేతలు ఎవరైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అడిగారా అంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. దశాబ్దాలుగా పాలమూరు , కందనూలు ,గద్వాల ప్రాంత ప్రజల కల అయిన గద్వాల _మాచర్ల రైల్వే లైను దేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల నిర్మిస్తున్నట్టు ఈ ప్రాజెక్టును చేపట్టడం లో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి పాదయాత్ర చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి ,అబద్ధాలతో కాలం వెళ్లదీసే తప్పుడు పనులు మానుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి హితవు చెప్పారు.