– అన్ని వర్గాలపై మోయలేని భారం మోపుతున్న కేసీఆర్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఫైర్
ఎల్ఐసీ ఏజెంట్ల నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ (వృత్తి పన్ను) పేరిట ప్రతి ఏజెంట్ నుండి రూ.2500లు వసూలు చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఏపీసహా ఇతర రాష్ట్రాల్లో ఎల్ఐసీ ఏజెన్సీని ప్రొఫెషన్ గా గుర్తించడం లేదన్నారు. అన్ని వర్గాలపై పన్నుల పేరుతో భారం మోపుతూ ఖజానా నింపుకోవడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వం చివరకు ఎల్ఐసీ ఏజెంట్ల నుండి కూడా వ్రుత్తి పన్ను పేరిట భారం మోపుతోందన్నారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు ఉదయం పాదయాత్ర శిబిరం వద్ద జడ్చర్ల ఎల్ఐసీ ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు బండి సంజయ్ ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. వ్రుత్తి పన్ను పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వాపోయారు. వారి సమస్యలను సావధానంగా విన్న బండి సంజయ్ ఈ విషయంలో ఎల్ఐసీ ఏజెంట్లకు వెసులుబాటు కలిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. బండి సంజయ్ ను కలిసిన వారిలో కాట్న రామచంద్రయ్య, దూసకంటి రాజు గౌడ్ తదితరులు ఉన్నారు.
కుల సంఘాల నేతలారా…ఏకం కండి
ఈ రోజు ఉదయం పాదయాత్ర శిబిరం వద్ద మున్నూరుకాపు, పద్మశాలిసహా పలు బీసీ సంఘాల నాయకులు బండి సంజయ్ ను కలిసి సంఘీభావం ప్రకటించారు. తమ తమ సామాజికవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనల కుల వ్రుత్తులు ధ్వంసమయ్యాయన్నారు. కుల సంఘాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నారని అన్నారు. ఇకపై కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమస్యలపై పోరాడితే… రాజకీయ పార్టీలన్నీ మీ వద్దకే వస్తాయన్నారు. కుల సంఘాల మధ్య ఐకమత్యం లేకపోవడంవల్లే టీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.