Suryaa.co.in

Telangana

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగడాలు భరించలేకపోతున్నం

-మాపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారు
-పెన్షన్లు, ఇండ్లు లేవు, సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం
-టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మీరే కాపాడండి
-బండి సంజయ్ కు ముదిరాజ్ సంఘాల మొర
-ముదిరాజులుసహా హిందువులందరికీ బీజేపీ అండగా ఉంటుందని బండి భరోసా
-కేసీఆర్ దిగిపోతేనే పేదల బతుకులు మారేది
-తెగించి కొట్లాడదాం రండి…
– ముదిరాజ్ కులస్తుల ముఖా-ముఖి సదస్పులో బండి సంజయ్ సమావేశం

‘‘సార్… మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగడాలు భరించలేకపోతున్నం. మాపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాకు పెన్షన్లు రావడం లేదు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్డం లేదు., సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మీరే కాపాడాలి’’అంటూ ముదిరాజ్ కులస్తులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 23వ రోజు పాలమూరు పట్టణంలో పాదయాత్ర చేశారు. అంబా భవాని ఆలయం వద్ద నిర్వహించిన ముదిరాజ్ కులస్తులతో బండి సంజయ్ ‘ముఖా-ముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు టీఆర్ఎస్ పాలనలో వారికి జరుగుతున్న అన్యాయం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు, వేధింపులను బండి సంజయ్ ఎదుట మొర పెట్టుకున్నారు.

‘‘ఉమ్మడి ఏపీలో చూసుకున్నా…. ప్రస్తుత తెలంగాణలో చేసుకున్నా ముదిరాజుల సంఖ్య ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. శాసనసభలో సంఖ్యాపరంగా చూస్తే సగానికి సగం ముదిరాజులు ఉండాలి. ముదిరాజుల ది ప్రధాన వృత్తి చేపల వృత్తి. చేపల చెరువులలో కూడా మాకు అన్యాయం జరుగుతోంది. చేపల చెరువులను అమ్ముకుంటున్నారు… మా హక్కులను కాలరాస్తున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘తమను బీసీ-డి నుంచి బీసీ-ఎ లోకి మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. గతంలో జీవో 15 ద్వారా మమ్మల్ని బీసీ-ఎ లోకి మారిస్తే… ఒక సంవత్సరం పాటు బీసీ-ఎ లో ఉన్నాం. ఆ తర్వాత సుప్రీంకోర్టులో అదే పార్టీ వేరే కులస్తులతో G.O 15 కు వ్యతిరేకంగా పిటిషన్ వేయించి, మమ్మల్ని ఆగమాగం చేశారు. ముదిరాజుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి ఇవ్వలేదు. మమ్మల్ని బీసీ-ఎ లో కలిపితే… మాకు ఉద్యోగాలు అయినా వస్తాయి’’అని పేర్కొన్నారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలను, వేధింపులను వివరించారు. ‘‘స్థానిక మంత్రి ఇక్కడి ముదిరాజ్ లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముదిరాజులు 12 లక్షల మంది ఉన్నారు. ముదిరాజులకు పెన్షన్లు లేవు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవు. ప్రశ్నిస్తే మా పై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మంత్రి తన అనుచరులతో ఇక్కడి భూములు కబ్జాలు చేయిస్తున్నారు… మా చెరువుల మీద దాడులు చేయిస్తున్నారు… మా నోరు కొడుతున్నారు. మేము పూలు అమ్మాలన్నా… చేపలు అమ్మాలన్నా… మమ్మల్ని ఎక్కడ కూడా అమ్మకుండా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మాపై ఇంత కక్ష కట్టడానికి కారణం ఏంటో తెలియడం లేదు. కెసిఆర్ ప్రభుత్వం నుంచి ముదిరాజులను మీరే రక్షించాలి’’అని మొరపెట్టుకున్నారు.

ముదిరాజుల సమస్యలను సావధానంగా విన్న బండి సంజయ్ వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ‘‘టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లాగా బీజేపీ భయపడేది కాదు. నేను చావుకు కూడా భయపడను. నాకు గుండెపోటు వచ్చింది… చావు వరకు పోయి వచ్చిన… అమ్మవారి దయతోనే బతికా. దేశం కోసం, ధర్మం కోసం, పేదల కోసం చావడానికైనా సిద్దమే’’అని అన్నారు. ముదిరాజులతోపాటు పద్మశాలీలు, యాదవులుసహా హిందువుల్లో ఐక్యత రావాలని, అందుకోసమే తాను కృషి చేస్తున్నానని అన్నారు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖుడు.. ముదిరాజుల్లో ఒకరిద్దరికి ఆశచూపి మీలో మీకే గొడవ పెట్టిస్తాడు. మోడీ 18 గంటలు పనిచేస్తే… కేసీఆర్ 24 గంటలు పడుకుంటడు. కెసిఆర్ ను సీఎం చేసుకోవడం ప్రజలు చేసుకున్న ఖర్మ. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగేది ఇంకో 6 నెలలు మాత్రమే. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందుకోసం మీరంతా కలిసి పనిచేయాలి.’’అని సూచించారు. కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అవినీతిలో కూరుకుపోయారన్నారు.

‘‘రెండు వేల కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని కట్టారు…. ఒక్క వానతో నిర్మాణంలోని డొల్లతనం బయటపడింది. యాదగిరిగుట్టలో పార్కింగ్ చార్జీల దందా నడుస్తోంది. కార్ పార్కింగ్ చేస్తే…. రూ.500 ఛార్జ్… ఆ పై గంటకు అదనంగా 100 వసూలు చేస్తున్నారు. మన ఆలయాల్లో పనిచేసే అయ్యగార్లకు జీతాలు ఇవ్వరు… మౌజమ్ లకు, ఇమామ్ లకు, ఫాస్టర్స్ కు జీతాలు ఇస్తాడు. మన దేవతలకు దేవుళ్లకు అవమానం జరిగినా… కేసీఆర్ స్పందించడు ఓవైసీ ని పట్టుకుని, కౌగిలించుకుని, సెంట్ పూసుకుంటాడు… ఫ్రూట్స్ తినిపిస్తాడు’’అని మండిపడ్డారు. ‘‘ఇక బాంఛన్ బతుకులొద్దు…. గల్లాపట్టి నిలదీద్దాం. ప్రజల సమస్యలు తీరాలంటే…. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలి. వచ్చేది బిజెపి ప్రభుత్వమే. ముదిరాజుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం’’అని బండి సంజయ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE