Suryaa.co.in

Telangana

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులివ్వరా?

– సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌

యాసంగి వడ్ల కోనుగోలు డబ్బు రైతాంగానికి వెంటనే చెల్లించాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఆయన కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు.
గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం …
విషయం: యాసంగి వడ్లు కొనుగోలు డబ్బు రైతాంగానికి వెంటనే చెల్లించడం గురించి …
వడ్లు కొనుగోలు రాష్ట్రప్రభుత్వం చేపట్టాలని బిజెపి తెలంగాణశాఖ చేసిన అనేక పోరాటాల తరువాత రాష్ట్రప్రభుత్వం రైతులనుండి వడ్లు కొనుగోలు ప్రారంభించిన విషయం మీకు, రాష్ట్ర రైతాంగానికి విధితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. అనేక జిల్లాల్లో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఖరీఫ్‌ సీజను ప్రారంభం అవుతున్నా యాసంగి పంట డబ్బు చేతికి రాకపోవడంతో, డబ్బుకోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్థులు రైతులకు అప్పుల ఆశచూపి అధిక వడ్డీలు వసూళ్ళు చూస్తున్నారు. అమ్మిన పంట పైసలు రాలేదు, రైతుబంధు డబ్బు అందలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 1286 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,91,852 మంది రైతుల నుండి 11.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.2197.16 కోట్లు కాగా వీటిలో ఇంకా రూ.517.16 కోట్లు ప్రభుత్వం రైతులకు బకాయి పడిరది. రాష్ట్రప్రభుత్వ అహంకార పూరిత ప్రకటనలతో దాదాపు 14 లక్షల ఎకరాలలో యాసంగిలో రైతులు వరిపంట వేయలేదు. దీంతో వరివేయని రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉన్నా మీ ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం సాధారణ రైతులను బలిపశువులను చేస్తున్నారు.

రైతుసంక్షేమాన్ని కోరే ప్రభుత్వమని చెప్పుకొనే మీరు రైతాంగాన్ని నిలువునా దివాళ తీయిస్తున్నారు. మీ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదు. వానాకాలం సీజను ప్రారంభం అయినా మీ వ్యవసాయ శాఖామంత్రికాని, వ్యవసాయశాఖ రాష్ట్ర, జిల్లా అధికారులు గాని కనీసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడం చూస్తే వ్యవసాయరంగం మరియు రైతులపై మీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతుంది.

యాసంగి పంట కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవడంతోపాటు, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు వంటి విషయాలలో వ్యవసాయశాఖ మొద్దునిద్ర వీడే విధంగా చర్యలు చేపట్టాలని, అన్నీ జిల్లాల్లో రైతుసంఘాలతో, అన్నీ రాజకీయపార్టీలతో రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం వెంటనే అందించాలని, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మీరు వెంటనే ఫామ్‌హౌజ్‌ నుంచి బయటకి వచ్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించాలని బిజెపి రాష్ట్రశాఖ తరపున కోరుతున్నాము.

అభినందనలతో …
బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి.

LEAVE A RESPONSE