Suryaa.co.in

Telangana

ఓరుగల్లు పోరు దారిలో సంజయుడి సంగ్రామ యాత్ర

– నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ప్రవేశం
– 12 రోజులపాటు కొనసాగనున్న పాదయాత్ర
– 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 160 కి.మీల వరకు సాగనున్న పాదయాత్ర
– చారిత్రక, తెలంగాణ వీరోచిత పోరాట యోధుల జన్మస్థలాల మీదుగా కొనసాగనున్న యాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపు (సోమవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఓరుగల్లు పోరు దారిలో కొనసాగే సంజయుడి ప్రజా సంగ్రామ యాత్రలో ఉమ్మడి జిల్లాలో 12 రోజులపాటు సాగనుంది.

7 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా దాదాపు 160 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. రేపు పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించే పాదయాత్ర పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వర్దన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల మీదుగా 13 మండలాలతోపాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు కొనసాగనుంది.

పలు చారిత్రక ప్రదేశాలతోపాటు తెలంగాణ పోరాట యోధులు జన్మించిన ప్రాంతాల మీదుగా బండి సంజయ్ నడవనున్నారు. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పుట్టిన విసునూరు, రజకార్లపై తిరుగుబావుటా ఎగరేసిన గిరిజన యోధుడు నాను నాయక్ జన్మించిన బోడతండ, నిజాం కోటలు బద్దలు కొట్టి ప్రజా రంజక పాలన సాగించిన సర్వాయి పాపన్న పుట్టిన ఖిలాషపూర్ తోపాటు స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని ఉద్యమాలు చేసి అమరులైన వారి గ్రామాల గూండా పాదయాత్ర కొనసాగనుంది. అట్లాగే ఐనవోలు మల్లన్న, వెయ్యి స్తంబాల గుడితోపాటు భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు.

ఉమ్మడి వరంగల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వారికి భరోసా కల్పించడంతోపాటు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ- నియంత- అవినీతి పాలనను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేయడమే ప్రజా సంగ్రామ యాత్ర ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరిస్తూ… తెలంగాణలోనూ బీజేపీ ఆధ్వర్యంలోని పేదల ప్రభుత్వ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర పేరుతో సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే.

 

LEAVE A RESPONSE