పేరు తేటగీతిలో..
నచ్చిన గీతమూ
అదే శృతిలో..
ప్రతి రచనా
జనం మెచ్చే రీతిలో…
శంకరంబాడి సుందరాచారి..
ఇలా చెబితే..ఓహో కవి..
మా తెలుగు తల్లికి మల్లెపూదండ…
మా కన్నతల్లికి మంగళారతులు..
ఇది పాడితే
పరిచయమే అవసరం లేని
తెనుగింటి మహాకవి..
ప్రతి ఆంధ్రుడి మదిలో
ఆనందభైరవి!
మా తెలుగుతల్లికి
మల్లెపూదండ
పాటను పలికించిన
సుందరాచారి..
వారి గీతాలు..
అద్భుతమైన మన గతాలు..
అవగతాలు..!
అటు సంస్కృతము కాని…
మరీ ప్రాకృతమనిపించని…
ఇటు పల్లెపదాల వల్లె
జాడే కనిపించని…
ఓ ప్రత్యేక శైలి..
పదాలతో వ్యాహ్యాళి..
అక్షరాల కేళి..
సుందరంబాడి జావళి..
పండితపామరులను
అలరించే కవితల కథకళి..!
గలగలా గోదారి కదలిపోతుంటేను..
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను..
బంగారు పంటలే పండుతాయి..
ఈ భావాలే కదా
ఆ కలం నుండి
అలవోకగా జాలువారిన
మురిపాల ముత్యాలు..
అమరావతి నగర
అపురూప శిల్పాలు..
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు..
తిక్కయ్య కలములో
తియ్యందనాలు..
ఈ పదాలు
నిత్యమై నిఖిలమై
నిలిచి ఉండవా మరి..
తెలుగోడి నోరూరి..!
రుద్రమ్మ భుజశక్తి..
మల్లమ్మ పతిభక్తి..
తిమ్మరుసు ధీయుక్తి..
కృష్ణరాయల కీర్తి..
మా చెవులు రింగురింగుమని
మారుమ్రోగే దాకా
ఓ సుందరంబాడి..
నీ పాటలే పాడుతాం..
నీ ఆటలే ఆడుతాం
నీ పాటే సమరస గీతమై..
ఘనమైన మన గతమై..
ఓ సరికొత్త సుప్రభాతమై..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286