– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిదీ అదే పరిస్థితి
– నాటి టీటీడీ బోర్డు నిర్వాకంపై పెదవి విప్పిన మాజీ సభ్యుడు సిన్హా
– ఆస్తుల అమ్మకాన్ని అడ్డుకున్నానని వెల్లడి
– నాటి పాలకమండలి సభ్యులపై విచారణ జరపాలని పవన్ డిమాండ్
– నాటి బోర్డులో నేటి మంత్రి కొలుసు పార్ధసారథి సభ్యుడే
– ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కూడా సభ్యురాలే
– ఇద్దరికీ కీలకమైన పర్చేంజి కమిటీలో స్థానం
– నెయ్యి సహా అన్ని కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వామ్యం
– వారిద్దరూ నాడు ఏం చేశారని ప్రశ్నించిన భూమన, రోజా
– ఇప్పుడు నిజాలు చెప్పి జగన్‌ను ముద్దాయిగా నిలబెట్టే అవకాశం
– ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమన అక్రమాలపై సారథి పెదవి విప్పుతారా?
– సారథి మాట్లాడితేనే సీఎం ఆరోపణలకు మరింత బలం
– ఉదయభాను కూడా స్పందించక తప్పదా?
– జనసేనలో చేరనున్న సామినేని ఉదయభాను
– పవన్ వ్యాఖ్యలను భాను బలపరుస్తారా?
– అందరిచూపూ సారథి, ప్రశాంతిరెడ్డి వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)
తిరుమల శ్రీవారికి వాడిన లడ్డులో జంతువుల కళేబరాల కొవ్వు క లిసిందన్న నివేదికలతో హిందూ ప్రపంచం భగ్గుమంటున్న వేళ.. నాటి జగన్ సర్కారులోని టీటీడీ బోర్డు నిర్వాకాలను, హిందూ సమాజానికి వెల్లడించడం.. అప్పటి బోర్డు సభ్యులైన కొలుసు పార్ధసారథి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అనివార్యంగా మారింది.
జగన్ జమానాలో టీటీడీ బోర్డులో పర్చేంజింగ్ కమిటీలో సభ్యులు కూడా అయిన వీరిద్దరిలో… కొలుసు పార్ధసారథి నేడు కూటమి సర్కారులో మంత్రిగా ఉండగా, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక నాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభాను బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన త్వరలో జనసేన తీర్ధం తీసుకోనున్నారు. బోర్డు సభ్యులపై విచారణ జరపాలని పవన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో.. సామినేని కూడా స్పందిస్తే, జనసేనాధిపతి డిమాండుకు బలం చేకూరుతుంది. కాబట్టి భాను కూడా స్పందించడం అనివార్యమే.
జగన్ జమానాలో శ్రీవారి లడ్డులో జరిగిన అపచారంపై, స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. అప్పుడు బోర్డులో ఏం జరిగిందన్న నిజాలను బయటపెట్టి, చంద్రబాబు ఆరోపణలకు మరింత బలం చేకూర్చాల్సిన నైతిక బాధ్యత మంత్రి సారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై పడింద ని టీడీపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
ఎందుకంటే.. బీజేపీకి సంబంధించిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఆర్కే సిన్హా.. ‘‘టీటీడీకి సంబంధించి 183 ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తే నేను అడ్డుకున్నా. సనాతన ధర్మాన్ని అవమానించడమే వారి అజెండా’’ అని తాజాగా నాటి దారుణాలు ప్రస్తావించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడో ఉత్తరాదికి చెందిన బోర్డు మాజీ సభ్యుడే నాటి దారుణాలను బయటపెడితే.. కూటమిలో ఉన్న నాటి బోర్డు మాజీ సభ్యులు ఎందుకు బయటపెట్టరన్న కొత్త చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో నాటి దారుణాలను బయటపెట్టడం ఇప్పుడు కూటమిలో ఉన్న మంత్రి-ఎమ్మెల్యేకి అనివార్యంగా మారింది.
నిఖిల ప్రపంచం నివ్వెరపోయేలా తిరుపతి లడ్డులోని నెయ్యి జంతు కళేబ రాల కొవ్వు కలిసిందన్న నివేదిక, హిందూ ప్రపంచంలో ఇంకా అలజడి సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్న నాటి టీటీడీ బోర్డులో.. ఇప్పటి మంత్రి కొలుసు పార్ధసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, త్వరలో జనసేనలో చేరనున్న సామినేని ఉదయభాను వివిధ సందర్భాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరిలో పార్ధసారథి, ప్రశాంతిరెడ్డి టీటీడీకి సంబంధించి.. ఏయే వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయించే , కీలకమైన పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
నెయ్యి కొనుగోలుపై ఆరోపణలు వచ్చిన క్రమంలో… తెరపైకి వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి- మాజీ ఎమ్మెల్యే రోజారెడ్డి, ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ‘నిజంగా నెయ్యిలో అపచారం జరిగితే అప్పుడు పర్చేజింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న పార్ధసారథి, ప్రశాంతిరెడ్డి ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఆ విషయం వారికి తెలియదా? వాళ్లిద్దరూ ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు కదా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు.
అటు జగన్ సైతం.. బీజేపీవాళ్లకు సగం తెలుసు. సగం తెలియదు. బోర్డులో కేంద్రమంత్రులు సిఫార్సు చేసిన బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. నిజంగా ఏదైనా అపచారం జరిగితే వారు ఊరుకుంటారా అని ప్రశ్నించి, బీజేపీని వ్యూహాత్మకంగా ఆత్మరక్షణలో నెట్టారు. ఫలితంగా బీజేపీ నుంచి ఇప్పటికీ ఎదురుదాడి లేదు. అంటే బీజేపీకి సంబంధించినంత వరకూ.. ఈ ఎదురుదాడిలో జగన్ పైచేయి సాధించినట్లే లెక్క.
ఈ క్రమంలో కూటమిలో మంత్రిగా ఉన్న కొలుసు పార్ధసారథి- ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నాటి నిర్ణయాలపై గళం విప్పాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భూమన-రోజా వేసిన ప్రశ్నలు ఇప్పటికే భక్తుల్లో చర్చాంశంగా మారింది కాబట్టి! పైగా నెయ్యి, బియ్యం, నూనె వంటి నిత్యావసర వస్తువులతోపాటు.. ఆలయ అవసరాలకు అవసరమయ్యే అన్ని వస్తువుల కొనుగోళ్లను పర్చేజింగ్ కమిటీనే నిర్ణయిస్తుంది. దానిని బోర్డు ఆమోదిస్తుంది. సహజంగా ఇంత కీలకమైన కమిటీలో సభ్యులుగా, ఈఓకు సన్నిహితంగా ఉండేవారినే నియమిస్తుంటారన్నది బహిరంగ రహస్యం.
ఇప్పుడు గత వారం నుంచి నెయ్యి కల్తీ చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో.. నాడు పర్చేంజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నేడు భక్తులకు ఏం జరిగిందో వివరించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఈ అంశాన్ని ప్రస్తావించినందున.. సారథి- ప్రశాంతి నాటి కొనుగోళ్ల వ్యవహారాలపై గళం విప్పడం ద్వారా, తమ అధినేతకు నైతిక మద్దతు ఇవ్వడం అనివార్యంగా మారింది.
అంటే నాటి పర్చేజింగ్ కమిటీ సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చ జరిగింది? ఏ ప్రాతిపదికన తాము వివిధ కంపెనీలకు ఆమోదముద్ర వేయాల్సి వచ్చింది? అప్పుడు తమపై ధర్మారెడ్డి ఏమైనా ఒత్తిడి చేశారా? ఒకవేళ తమకు ఇష్టం లేకుండా, తమ ప్రమేయం లేకుండానే ఈఓ నిర్ణయం తీసుకుంటే.. దానిని వ్యతిరేకిస్తూ, డిసెంట్ నోట్ ఏమైనా ఇచ్చారా? అసలు బోర్డు మీటింగులో ధర్మారెడ్డి-సుబ్బారెడ్డి-కరుణాకర్‌రెడ్డి పెత్తనం ఎలా ఉండేది? అనే రహస్యాలను పార్ధసారథి,-ప్రశాంతిరెడ్డి బయటపెట్టడం ద్వారా.. పార్టీ-ప్రభుత్వం చేస్తున్న ఆరోణలకు బలం చేకూర్చాల్సిన, నైతిక బాధ్యత వారిపై ఉందని అటు టీడీపీ సీనియర్లు సైతం స్పష్టం చేస్తున్నారు.
‘బోర్డు సభ్యులు ఏదైనా ఒక అంశాన్ని వ్యతిరేకిస్తే, దానికి కారణాలు వివరిస్తూ డిసెంట్‌నోట్ నమోదుచేయాలి. గతంలో రమణాచారి ఈఓగా, నేను సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక అంశంలో నేను బోర్డుతో విబేధించి, డిసెంట్‌నోట్ నమోదు చేశా. విజయసాయిరెడ్డి-భూమన కరుణాకర్‌రెడ్డి దానికి సాక్షులు. కాబట్టి సభ్యులు తమకు నచ్చని అంశాలు చర్చకు వచ్చినప్పుడు డిసెంట్ నోట్ ఇచ్చే అధికారం ఉంది’’ అని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ నాయకుడు, బలిజనాడు కన్వీనర్ డాక్టర్ ఓ.వి.రమణ వివరించారు. దానిప్రకారం.. ఒకవేళ పార్ధసారథి-ప్రశాంతిరెడ్డి ఏదైనా అంశాన్ని వ్యతిరేకించి ఉంటే దానికి సంబంధించి డిసెంట్ నోట్ నమోదుచేసే ఉండాలి.
ఆవిధంగా ధర్మారెడ్డి జమానాలో జరిగిన దారుణాలను, మంత్రి పార్ధసారథి- ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి భక్తులకు వెల్లడించడం ద్వారా.. ఇప్పటిదాకా వైసీపీపై కూటమి సర్కారు చేస్తున్న ఎదురుదాడికి, నైతికబలం చేకూరుతుందని కూటమి వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఇప్పుడు బాబుగారి ఇమేజ్, విశ్వసనీయత పెంచే బాధ్యత వారిదే. వారి నోరు విప్పితే వచ్చే నిజాలు బాబుగారి ఆరోపణను బలపరచడమే కాదు. నెయ్యిలో అపచారం జరిగిందన్న ఆయన వ్యాఖ్యను నమ్ముతున్న కోట్లాదిమంది భక్తులలో, బాబుగారి విశ్వసనీయత పెంచుతుంది’’ అని కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
కాగా గతంలో టీటీడీ సభ్యుడిగా పనిచేసిన, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీసీకి రాజీనామా చేసి, త్వరలో జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనాధిపతి పవన్‌తో భేటీ కూడా అయ్యారు.
రెండురోజుల క్రితమే.. తిరుమలలో జరుగుతున్న అపచారాలపై, ఇటీవల ధర్మాగ్రహం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. బోర్డు సభ్యులందరిపైనా విచారణ జరిపితేనే, నిజాలు వెలుగు చూస్తాయని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఆ క్రమంలో త్వరలో జనసేనలో చేరనున్న టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు సామినేని ఉదయభాను.. కరుణాకర్‌రెడ్డి-ధర్మారెడ్డి జమానాలో ఎన్ని అక్రమాలు జరిగాయో, భక్తకోటికి వెల్లడించడం ద్వారా.. తన అధినేత పవన్ విశ్వసనీయను పెంచేందుకు కారకులవుతారని జనసేన ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను..జగన్ జమానాలో టీటీడీ సభ్యులుగా తమ అనుభవాలపై, ఎలాంటి నిజాలు వెల్లడిస్తారన్న ఉత్కంఠ అటు భక్తులు-ఇటు కూటమి శ్రేణుల్లో నెలకొంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి.. మళ్లీ టీటీడీలో స్థానం లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో, ఆమె కూడా ఎలాంటి నిజాలు వెల్లడిస్తారో చూడాలి.