– రఘురామరాజు కేసు విచారణకు హాజరైన ఐపిఎస్ సునీల్ కుమార్
– విచారించిన ఎస్పీ దామోదర్
– ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విచారణ
– కొన్నింటికే సమాధానాలు చెప్పిన సునీల్?
గుంటూరు: తనను కస్టోడియల్ టార్చర్ చేశారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన కేసులో తొలి ముద్దాయిగా ఉన్న సీనియర్ ఐపిఎస్ పివి సునీల్‌కుమార్ ఎట్టకేలకు పోలీసు విచారణకు హాజరయ్యారు. గుంటూరు సీసీఎస్ పోలీసుస్టేషన్‌కు ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఆయనను ఎస్పీ దామోదర్ విచారించారు.
నిజానికి ఆయన విచారణకు హాజరుకాకుండా హైకోర్టులో స్టే తెచ్చుకుంటారని చాలామంది భావించిన్పటికీ, అందరి అంచనాలకు భిన్నంగా సునీల్‌కుమార్ విచారణకు హాజరయి, ఎస్పీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం విశేషం. ‘‘ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవలసిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం కూడా ఆయననేమీ మిగిలిన వారిలా ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఆ పనిచేసి ఉంటే ఎప్పుడో జైలుకు పంపించేది కదా? ఆ కారణంతోనే ఆయన ఇప్పటివరకూ కోర్టుకు వెళ్లలేదు. అందుకే సార్ అంత ధైర్యంగా విచారణకు హాజరయ్యారు. ఏదో ధీమా లేకపోతే ఇంత పెద్ద కేసులో సారు అంత ధైర్యంగా హాజరుకాలేరు. ఏదేమైనా చట్టాన్ని గౌరవించి, సునీల్ సార్ విచారణకు హాజరుకావడం మంచి పరిణామం’’ ఒక పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
కాగా విచారణలో సునీల్ సరైన సమాధానాలు ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలకు మాత్రమే స్పందించారని తెలుస్తోంది. ప్రధానంగా రఘురామరాజును కస్టొడియల్ టార్చర్ చేసిన సమయంలో మీరు అక్కడే ఉన్నారా? ఫోన్లో రఘురామరాజును కొడుతున్న దృశ్యాలను మరొకరికి లైవ్ చూపించిన మాట నిజమేనా? మీతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఆరోజు అక్కడ ఉన్నారా? గుడివాడకు చెందిన తులసి, మీ అనుమతితోనే రఘురామరాజును హింసించారా వంటి ప్రశ్నలకు సునీల్‌కుమార్ జవాబు ఇవ్వలేదని సమాచారం.