– నేడు బీఆర్ఎస్ఎల్పీ, నేతలతో కేసీఆర్ భేటీ
– పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై సింహగర్జన
– నీటిదోపిడీ, సర్కారు వైఫల్యాలపై గళం విప్పనున్న కేసీఆర్?
– జనవరిలో రెండు భారీ బహిరంగసభలు
– ఆ ఐదుగురు ఫిరాయింపుదారులు భేటీకి వస్తారా?
– భేటీకి వస్తేనే స్పీకర్ ప్రకటనకు విశ్వసనీయత
– మళ్లీ జనక్షేత్రంలోకి కేసీఆర్?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఇప్పటివరకూ ఫాంహౌస్‌కు పరిమితమయి.. ఒకవైపు ఆరోగ్యం కాపాడుకుంటూ, మరోవైపు.. రాష్ట్ర రాజకీయాలు- సొంత పార్టీ అంతర్గత వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనున్నారా? ఆ మేరకు జనవరి నుంచి జనక్షేత్రంలో కార్యాచరణకు దిగనున్నారా? నిలిచిపోయిన ప్రాజెక్టులు, పరాయి రాష్ట్ర నీటిదోపిడీపై సింహగర్జనతో కేసీఆర్ రీ ఎంట్రీ ఉండబోతోందా? ఈ కసరత్తుకు నేటి బీఆర్ఎస్ఎల్పీ, సీనియర్ల భేటీ కేంద్రం కానుందా?.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
గులాబీదళాలు సార్ అని గౌరవంగా పిలుచుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రెండేళ్ల విరామానంతరం మళ్లీ తెరపైకి రానున్నారు. ‘‘రేవంత్ పాలనకు రెండేళ్లయింది. అంటే ఇక హనీమూన్ ముగిసినట్లే. ్రప్రజల్లోకి ఎప్పుడు రావాలో కేసీఆర్‌కు తెలుసు’’ అంటూ ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ శాసనసభ్యులతోపాటు, సీనియర్ నేతలతో విస్తృత సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో.. అందరి చూపూ కేసీఆర్ వైపే మళ్లింది.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు 90 శాతం పూర్తయి నిలిచిపోయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనే.. కేసీఆర్ ప్రధానంగా గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టుపై కేటీఆర్‌తో పాటు పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ సర్కారుపై తరచూ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.
‘‘ కేసీఆర్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన ఆ పది శాతం పనులను రేవంత్ కావాలనే పడావు పెడుతున్నారు. ఎందుకంటే అది పూర్తయియే కేసీఆర్‌కు పేరొస్తుందన్న దుగ్ధ. అందుకే పాలమూరు ప్రాజెక్టును కాదని, 4 వేల కోట్లతో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల టెండర్లు పిలిచారు. వాటికి అనుమతులు లేకపోవడంతో ఎన్జీటీ స్టే ఇచ్చింది. రెండేళ్లలో రేవంత్ పాలమూరు ప్రాజెక్టుకు పదిపైసలివ్వకుండా ఆయన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకున్నార’’ని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు తరచూ విరుచుకుపడుతున్నారు.
అయితే కేటీఆర్, బీఆర్ఎస్ ఆరోపణలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. ఆ ప్రాజెక్టు 90 శాతం పూర్తయినట్లు నిరూపించాలని, నిజమయితే నేను రాజీనామా చేస్తా. లేకపోతే మీరు రాజీనామా చేస్తారా? దీనిపై తాను చర్చకు సిద్ధమేనని సవాల్ చేశారు.
మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న రేవంత్ సర్కారు వినతిని కేంద్రం తిరస్కరించింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్ధిక మదింపు చేయకుండా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేమని పార్లమెంటులో స్పష్టం చేసింది.
ప్రాజెక్టు లక్ష్యం విస్తృతం
నిజానికి హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామికనగరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు-తాగు తీరు అందించాలన్న లక్ష్యం.. 35 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును నాటి సీఎం కేసీఆర్ 2015లో శంకుస్థాపన చేశారు.
మైనర్ ఇరిగేషన్లో వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను, మొత్తంగా 90 టీఎంసీల నికర జలాలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించింది. కాగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. కాగా 2013 నాటికి ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని నాగర్ కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద ప్రార ంభించిన కేసీఆర్ వాటిని జాతికి అంకితం ఇచ్చారు.
కేంద్రం మెలిక-రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
ఇక ప్రాజెక్టు అనుమతి విషయంలో కేంద్రం.. ఏపీ-తెలంగాణ మధ్య పంచాయతీ పెట్టడంతో అది కాస్తా నిలిచిపోయింది. ఏపీ అంగీకరిస్తేనే అనుమతులు ఇస్తామని, లేకపోతే ట్రిబ్యునల్ వాదనలు ముగిసేవరకూ అనుమతి మంజూరు కష్టమేనని, సీడబ్ల్యుసీ తేల్చిచెప్పడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. అయితే ఈ ప్రాజెక్టుపై ఏపీ తొలి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోపాటు, అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తోందంటూ ఫిర్యాదు చేస్తూ వస్తోంది.
నిజానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2024 డిసెంబర్ 19న ఇంప్లిమెంటేషన్ రిపోర్టు పార్లమెంటుకు ఇచ్చింది. ఆ ప్రకారంగా.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు ఈఏఈ సిఫార్సు చేసింది. అయితే అవి ‘‘పర్యావరణ ప్రభావ మదింపు నోటిఫికేషన్ 2006’ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ-అటవీ శాఖ 2023 అక్టోబర్ 27న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పర్యావరణ అనుమతుల కోసం కావలసిన అదనపు సమాచారాన్ని పరివేశ్ పోర్టల్‌లో సూచించాం. కానీ రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ దానికి అవసరమైన డాక్యుమెంట్లు రాలేద ’’ని ఆ నివేదికలో వెల్లడించింది. అంటే తప్పంతా తెలంగాణ ప్రభుత్వానిదే తప్ప, తమది ఎంతమాత్రం కాదని కేంద్ర అటవీ-పర్యావరణ శాఖ స్పష్టం చేసిందన్నమాట.
పవర్ స్టేషన్లకు కరెంట్ కట్
కాగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రాజెక్టులోని అన్ని పంపింగ్ స్టేషన్లకు పవర్ సర్వీసు కనెక్షన్లను విద్యుత్ శాఖ తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. 500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు చెల్లిస్తేనే కరెంటు సరఫరా చేస్తామని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. నిజానికి ఆ పెండింగ్ బిల్లు క్లియరెన్సు కోసం ఇరిగేషన్ అధికారులు సర్కారుకు మొరపెట్టుకుంటూనే ఉన్నా, ఫలితం లేకుండా పోయింది. దానితో ప్రాజెక్టును పడావు పెట్టేందుకే.. రేవంత్ సర్కారు బిల్లులు ఇవ్వడం లేదంటూ, పాలమూరు బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ధ్వజమెత్తారు.
ఫలించని రేవంత్ వినతి
ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న ఏపీ సర్కారుకు ఒక విజ్ఞప్తి చేశారు. ‘ రెండు రాష్ట్రాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న మీ మాటలు నిజమైతే, రోజుకు 3 టీఎంసీలు తరలించే మీ రాయలసీమ ప్రాజెక్టు రద్దు చేసుకుని ఉదారత ప్రదర్శించండి’’ అని ఏపీ సీఎం చంద్రబాబును, లౌక్యంగా ఇరికించే ప్రయత్నం చేయడం చర్చనీయాంశం అయింది. పనిలోపనిగా.. పాలమూరు-రంగారెడ్డి, డిండి, బీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సహకరిస్తే పాలమూరు బిడ్డలు మిమ్మల్ని జీవితకాలం గుర్తుంచుకుంటారని పొగిడే ప్రయత్నం చేశారు.
మళ్లీ అంతలోనే.. మమ్మల్ని బతకనివ్వండి. మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది. దానికి నేనే నాయకత్వం వహిస్తానని బెదిరించే కోణాన్నీ ఆవిష్కరించారు. కానీ ఏపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అది వేరే విషయం.
కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు ప్రకారం.. తాగునీటి అవసరాల కోసం 7.5 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణ ం చేపట్టే అవకాశం ఉన్నా, నాటి టీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోనందుకే పనుల వేగం మందగించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కథ!
మళ్లీ కేసీఆర్ రీ ఎంట్రీ
ఈ నేపథ్యంలో ప్రాజెక్టును మళ్లీ పట్టాలకెక్కించాలంటూ కేటీఆర్ గళం విప్పనునున్నారు. ఆ మేరకు జనవరిలో ప్రాజెక్టు పరిథిలోని రెండు జిల్లాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకూ ఆ బహిరంగసభలకు ఇప్పటినుంచే విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి కేసీఆర్ మళ్లీ మునుపటిలా క్రియాశీల రాజకీయాల్లో, చురుకుగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇప్పుడు కేటీఆర్-హరీష్ దాడితోనే రేవంత్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. జనవరి నుంచి సార్ రంగప్రవేశం చేస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాద’ని ఒక ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు వస్తారా?
కాగా ఆదివారం నాటి బీఆర్ఎస్ఎల్పీ భేటీకి కాంగ్రెస్ పార్టీకి జంపయిన పదిమంది ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తికి తెరలేచింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాంధీకి సంబంధించిన ఫిరాయింపు పిటిషన్‌ను స్పీకర్ ప్రసాద్‌కుమార్ కొట్టివేశారు. వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బి-ఫారం టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్ కండువా కప్పేసుకున్న ఆ అయిదురు.. మరో ఐదుగురు బీఆర్ఎస్ఎల్పీ భేటీకి హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. వీరంతా ఒకవేళ ఆదివారం నాటి బీఆర్ఎస్ఎల్పీ భేటీకి హాజరుకాకపోతే.. స్పీకర్ ప్రకటనకు విశ్వసనీయలేదని, వారంతా కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టే.. ముఖం చెల్లక బీఆర్ఎస్ఎల్పీ భేటీకి రాలేదని, బీఆర్ఎస్ ఎదురుదాడి చేసేందుకు ఒక అస్త్రం లభించనుంది. అసలు ఈ ఫిరాయింపుదారులను ప్రజల ముందు ముద్దాయిలుగా నిలబెట్టేందుకే, కేసీఆర్ ఈ వ్యూహాత్మకంగా ఈ భేటీ ఏర్పాటుచేసినట్లు కనిపిస్తోంది.
వాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలయితే భేటీకి రావాలి: ఎమ్మెల్సీ దాసోజు సవాల్
‘పార్టీ మారలేదంటూ స్పీకర్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు, బీఆర్ఎస్లోనే ఉన్నామని నిస్సిగ్గు-నిర్లజ్జగా చెప్పుకుంటున్న మరో ఐదుగురు నిజంగా బీఆర్ఎస్లోనే ఉంటే ఆ పదిమంది ఆదివారం నాటి సమావేశానికి హాజరుకావాల’ని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. ‘మేం బీఆర్ఎస్లోనే ఉన్నామని కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని ప్రెస్‌మీట్ పెట్టిన కడియం శ్రీహరి, మేం దేవుడి గుళ్లో కండువా మాత్రమే కప్పుకున్నామని చెప్పుకుంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నిజంగా దమ్ము-ధైర్యంతోపాటు, తామంతా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బి ఫారం ఇస్తేనే గెలిచామన్న విశ్వాసం ఉంటే, వాళ్లంతా ఆదివారం నాటి సమావేశానికి హాజరవుతార’’ని దాసోజు విశ్లేషించారు.