– 20 సూత్రాల పథకం వార్షిక నివేదికలో కోతల వివరాలు
– ఏపీలో పవర్‌కట్‌పై సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
– ప్రజల డబ్బు ఆదా కోసమేనంటూ వ్యంగ్యాస్త్రాలు
– అందుకే 9 సార్లు కరెంటు చార్జీలు పెంచారని ఎద్దేవా
– గతంలో మద్యం ధరల పెంపుపై అంబటి డైలాగు రిపీట్
– ఇప్పుడు స్విచ్ వేస్తే షాక్ కొట్టేందుకే చార్జీలు పెంచారని ఎద్దేవా
– జగనన్న విసనకర్రల పథకం పెడతారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు
– జగనన్న కొవ్వొత్తి, జగనన్న లాంతరు పథకాలంటూ విచిత్ర పేర్లు
– సామాన్యులపై పెరుగుతున్న సోషల్‌మీడియా ప్రభావం
– కరెంటుకోతల విమర్శలతో ‘ఫ్యాను’ ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో సోషల్ మీడియా సైనికుల ఉత్సాహం పొంగి పరవెళ్లుతోంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, జనం సోషల్‌మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. అంతవరకయితే ఫర్వాలేదు. కానీ సర్కారు వైఫల్యాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తు, అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్నటి వరకూ ఏపీలో రోడ్లపై పేలిన సెటైర్లు.. ఇప్పుడు కరెంట్ కోతలపై పేలిపోతున్నాయి.
కరెంట్ కోతలపై.. సోషల్‌మీడియా సైనికులు సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలకు, ‘ఫ్యాను’కు ఊపిరాడని పరిస్థితి. ఇక టీడీపీ-జనసేన సోషల్‌మీడియా సైన్యం, వీటికి అదనంగా ఉండనే ఉంది. ఫలితంగా కరెంట్ లేక జనాలకు గాలి రాకపోతే.. ‘ఫ్యాను’ ఆగి చెమటలు పడుతున్న పరిస్థితి అధికార వైసీపీ నేతలది!
ఏపీలో కరెంటు కోతలు అధికార వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేళా పాళా లేని కరెంటు కోతలతో పరిశ్రమలు నష్టపోయే పరిస్థితికి చేరాయి. సాధారణ వ్యాపారాలు అటకెక్కుతుంటే, ఒక స్థాయి వ్యాపారులు జనరేటర్లతో నెట్టుకొస్తున్న పరిస్థితి. ఇటీవల కేంద్రం వెల్లడించిన 20 సూత్రాల పథకం వార్షిక నివేదికలో.. దక్షిణాదిలో ఎక్కువ కరెంట్ కొరత ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ముందన్న నివేదిక చర్చనీయాంశమయింది.
తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు డిమాండ్‌కు తగినట్లు వంద శాతం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు, ఆ నివేదిక వెల్లడించింది. ఏప్రిల్-మార్చిలో ఏపీలో 72,302 మిలియన్ యూనిట్ల డిమాండ్ నెలకొనగా, ఇంకా 409 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడినట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు.
కాగా గత కొద్దిరోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. సెల్‌ఫోన్ వెలుగుల మధ్య రోగులకు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. అందుకే ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ధైర్యం చేయడం లేదు. ఆపరేషన్ సమయంలో అటు ఇటయితే.. రోగుల బంధువుల చేసే దాడులకు, డాక్టర్లు ముందస్తుగా భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రధానంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఏజెన్సీ ప్రాంతాలు, ఉత్తరాంధ్ర-రాయలసీమలోని ప్రభుత్వాసుపత్రుల్లో.. డాక్టర్లు-నర్సులు రోగి బంధువుల సెల్‌ఫోన్ లైటింగ్ సాయంతో చికిత్స చేస్తున్న దృశ్యాలు, మీడియా-సోషల్‌మీడియాలో వస్తుండటం, అధికార పార్టీకి అప్రతిష్ఠగా మారింది.
గుంటూరు-కృష్ణా జిల్లాల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు పుష్కలంగా కరెంట్ ఉందని మంత్రులు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న వీడియోలు, ఫొటోలతో.. అధికార పార్టీ నేతలు, జవాబులేక మౌనంగా ఉండాల్సిన దుస్థితి.
దీనిపై సోషల్‌మీడియా వేదికగా వైసీపీ సర్కారుపై పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు, సర్కారు వైఫల్యాన్ని వేలెత్తిచూపేలా ఉన్నాయి. ‘కరెంట్ కోతలు విధించడం మంచిదే. దానివల్ల ప్రజలకు బోలెడు డబ్బులు మిగులుతాయి కదా? దీనికి జగనన్నకు కృతజ్ఞత చెప్పేబదులు విమర్శించడం మంచిది కాదు’ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇంకొందరేమో.. ‘త్వరలో జగనన్న విసనకర్ర, జగనన్న లాంతరు వెలుగు, జగనన్న కొవ్వొత్తుల దీవెన వస్తున్నాయి. ఇప్పటినుంచే వాలంటీర్ల వద్ద మీ పేర్లు నమోదు చేసుకోండి. ఆలసించిన ఆశాభంగం. ఇవి కేవలం మహిళలకే. ప్రత్యేక వాహనాల్లో వాలంటీర్లే జగనన్న లాంతర్లు, జగనన్న కొవ్వొత్తులు, జగనన్న విసనకర్రలు ఇళ్లద్దకు వచ్చి అందిస్తారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇటీవలి కాలంలో జరుగుతున్న దొంగతనాల నివారణకు.. జగనన్న కోతల పథకం బాగా ఉపయోగపడుతుందని, మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కరెంట్ లేకపోతే పిల్లలు సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టుకోలేరు. ఆవిధంగా స్కూళ్లకు పోకుండా, చదువుకోకుండా నిరంతరం సెల్‌ఫోన్లకు అంటుకుపోయే పిల్లలను వాటి నుంచి దూరం చేసే మహత్తర పథకం ఇది. పిల్లలను ఆ అలవాటు మాన్పిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే’ అంటూ ఇంకొందరు సైటెర్లు పేలుస్తున్నారు.
ఇక టీడీపీ, జనసేన సోషల్‌మీడియా సైనికులయితే.. కరెంట్ కోతలపై పొలిటికల్ సెటైర్లు సంధిస్తూ, నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నారు. వాటికి గతంలో మద్యం ధరల పెంపుపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యను జోడిస్తున్నారు. మద్యం తాగాలంటేనే భయపెడేలా మందు ధరలు పెంచాం. మందు తాగాలన్న ఆలోచన రావాలంటే భయపడేలా, కావాలనే మందు రేట్లు పెంచాం అని గతంలో అంబటి అసెంబ్లీలో సెలవిచ్చారు.
ఇప్పుడు తాజా కరెంట్ కోతలకు సంబంధించిన వీడియోలో, అంబటి మాటలు జోడించి సెటైర్లు పేలుస్తున్నారు. ‘కరెంటు స్విచ్ వేయాలంటేనే భయపడేలా ఇప్పటికి 9 సార్లు కరెంటు చార్జీలు పెంచాం. ఇప్పుడు ప్రజల డబ్బును ఆదా చేయడానికే కరెంటు కోతలు విధిస్తున్నాం. ఇదంతా జనం మేలు కోసమే జగనన్న కోతల పథకం ప్రవేశపెట్టామని మనవి చేస్తున్నాం అధ్యక్షా’ అని తెగ జోకులేస్తున్నారు. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఈ వ్యంగ్యాస్త్రాలు, నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తుంటే.. అధికార వైసీపీ నేతలకు మాత్రం చెమటలు పట్టిస్తున్నాయి.