-సీబీఐ,ఈడీ,ఐటీల విశ్వసనీయతకు ఇది మచ్చుతునక
-అయితే మోడీ, లేదంటే అదానీ కోసమే దర్యాప్తు సంస్థలు
-ప్రశ్నించిన వారిపై కేసులు అరెస్టులు
-తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్ : మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) చైర్మన్ వై.సతీష్ రెడ్డి తప్పుపట్టారు. పుల్వామా దాడికి సంబంధించిన వాస్తవాలను బయటపెట్టినందుకే సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. పుల్వామా ఘటన కేంద్రంలోని పాలకులు కుట్రపూరితంగా చేయించిందేనని సతీష్ రెడ్డి ఆరోపించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. పుల్వామా అమరుల పేరిట తమకు ఓటు వేయాలని అనేక సభల్లో అడిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
పుల్వామా ఘటనకు సంబంధించి సత్యపాల్ మాలిక్ చెప్పిందే నిజం కాబట్టి.. ఇప్పటి వరకు ఏ ఒక్క బీజేపీ నేతగానీ, ప్రధాని మోడీ స్పందించలేదన్నారు. కానీ వారం రోజుల్లోనే బీజేపీ చేతిలో తోలు బొమ్మ, బీజేపీ పంజరంలో చిలుక అయిన సీబీఐ మాత్రం వేగంగా స్పందించిందన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.
దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు సతీష్ రెడ్డి. ప్రశ్నించడం పెద్ద నేరంగా మారిపోయిందన్నారు. కేంద్రంలోని పాలకుల తప్పుల గురించి మాట్లాడితే సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని, అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అంతకుముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గతంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసులు కూడా ఇలా కక్ష పూరితంగా పెట్టినవేనన్నారు. దర్యాప్తు సంస్థలు మోడీ కోసం.. లేకపోతే అదానీ, అంబానీ కోసం మాత్రమే పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు.
ప్రజల కోసం పనిచేయడం పూర్తిగా మానేశాయని మరోసారి స్పష్టమైందన్నారు. దేశంలోని ఏ ఒక్క సంస్థ కూడా స్వతంత్ర్యంగా పనిచేయడం లేదన్నారు. దీన్ని బట్టి దేశంలో రాబోయే ఎన్నికలు ఎంత పారదర్శకంగా జరుగుతాయో అర్థమవుతోందని విమర్శించారు. దేశాన్ని నియంతపాలనవైపు నడిపిస్తున్న మోడీకి, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.