Suryaa.co.in

Editorial

సత్తిబాబూ.. గురువులకిచ్చే గౌరవం ఇదేనా?

– వైరల్‌ అవుతున్న ఫొటో
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన విద్యాశాఖ మంత్రి కావచ్చు. ఒక ‘నాలుగైదు పట్టాలు’ తీసుకున్న ఉన్నత విద్యాతవంతుడు కావచ్చు. కానీ గురువులకు ఇచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా? ఉపాధ్యాయ సంఘాల నాయకులను నిలబెట్టి, తాను మాత్రం దర్జాగా కాలుమీద కాలేసుకుని కూర్చున్న విద్యామంత్రే.. ఉపాధ్యాయులను గౌరవించకపోతే, ఇక పాఠాలు వినే పిల్లలేం గౌరవిస్తారు? ఇప్పుడు సోషల్‌మీడియాలో ఒక ఫొటో, ఇలాంటి చర్చలాంటి రచ్చకే దారితీస్తోంది.

‘ బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషా కోవిదుడు.. సంసృ్కతాంధ్రతోపాటు, అనర్గళంగా మాట్లాడగల ఆంగ్లభాషా కోవిదుడు. ఎన్నో డిగ్రీలు అందుకున్న’ ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణను, ఇటీవల ఉపాధ్యాయ సంఘ నేతలు కలిశారు. తమ సమస్యలకు సంబంధించి ఆయనతో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడ ‘ఉన్నత విద్యావంతుడైన’ సత్తిబాబుతోపాటు, ఆ శాఖ కార్యదర్శి, ‘అందరినీ గౌరవిస్తారనే’ మంచిపేరున్న, ప్రవీణ్‌ ప్రకాష్‌ కుర్చీలో కూర్చున్నారు.

దానిదుంపతెగ. ఎంతలేదన్నా, ఎంత ఉపాధ్యాయ సంఘ నేతలయినా వారంతా గురువులు. కాబట్టి, వారు వస్తే లేచి నుల్చొని, పాధాభివందనం చేయకపోయినా.. కనీసం కూర్చోబెట్టి మాట్లాడాల్సిన సంస్కారం అయితే మంత్రి గారికి ఉండాలి. కానీ ఉపాథ్యాయ సంఘ నేతలు వచ్చినా, సీట్లోనో కాలుమీద కాలేసుకుని కూర్చున్న సత్తిబాబు వ్యవహారశైలి.. ఉపాధ్యాయులకే కాదు, సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్లకూ నచ్చినట్లు లేదు.

అందుకే ఆయన పై కారాలు మిరియాలు నూరుతున్నారు.‘ సత్తిబాబు గారికి ఇంగ్లీషులో ఎంత అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉన్నప్పటికీ, గురువులు వస్తే వారిని కూర్చోపెట్టి మాట్లాడాలన్న సంస్కారం లేని వ్యక్తి, ఆ శాఖకు మంత్రి కావడం.. విద్యార్థుల దురదృష్టం’ అని నెటిజన్లు సత్తిబాబు తీరుపై, యమా సెటైర్లు వేస్తున్నారు.

LEAVE A RESPONSE