-సదరు ఎమ్మెల్యే తండ్రి ఇంకా టిడిపి లోనే ఉన్నారు
-మామ పేరు, తండ్రి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారు
-ఆ మూడువేల కోట్ల పనులకు అవినాష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కాంట్రాక్టర్లు
-ప్రతి పధకం, ప్రాజెక్టు కి తండ్రి, కొడుకుల పేర్లేనా?
-అధికార పార్టీ తప్పులను మేము ప్రశ్నిస్తాం
-అయిపోయిన పార్టీ, ప్రతిపక్ష పార్టీని మేమెందుకు అడుగుతాం ?
-దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
-మీరు వస్తారా… మీ సిఎం వస్తారా… చర్చకు నేను రెడీ
-వైసీపీ నేతలకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సవాల్
విజయవాడ: తనపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, అవినీతి, కేంద్ర సాయం వంటి అంశాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని సత్య సవాల్ విసిరారు. తనతో చర్చకు మీరు వస్తారా? మీ సీఎం జగన్ వస్తారా అని సవాల్ విసిరారు. తనపై విమర్శలు చేసిన శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ఇంకా టీడీపీలోనే ఉన్నారని, చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోవడం తమకు తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్న పార్టీనే ప్రశ్నిస్తాము తప్ప, ప్రతిపక్ష పార్టీని ఎందుకు విమర్శిస్తామని వ్యాఖ్యానించారు. జగన్ చెబుతున్న 3 కోట్ల వ్యయం ప్రాజెక్టులకు ఎంపీ అవినాష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలే కాంట్రాక్టర్లని బయటపెట్టారు.
సత్య ఇంకా ఏమన్నారంటే…నా మీద వ్యక్తిగత విమర్శలు చేసిన వారికి అవగాహన లేదు. సదరు ఎమ్మెల్యే తండ్రి ఇంకా టిడిపి లోనే ఉన్నారు. నేను టిడిపి కి మద్దతు గా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా? మీలాగా పదవుల కోసం పార్టీ లు మారలేదు. తాతలు, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయం చేయం. మామ పేరు, తండ్రి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారు.
కర్నూలులో న్యాయ రాజధాని వద్దా అని అడుగుతున్నారు. మీలాగా ఏ ఎండ కి ఆ గొడుగు పట్టే వ్యక్తులం కాదు. ఇప్పటికీ మేము కర్నూలు న్యాయ రాజధాని కావాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీగా ఏం చేశారు? కేంద్రానికి అయినా మీ వంతుగా ఒక లేఖ అయినా రాశారా? కర్నూలు కు హైకోర్టు తరలించే ప్రతిపాదన లేదని కేంద్రం చెప్పింది. రాయలసీమ వాసులంతా కూడా వైసీపీ చేసే మోసాలను గ్రహించాలి. ఇరిగేషన్ ప్రాజెక్టు ల నిర్వాసితుల గోడు మీకు పట్టదు. అమరావతి, పోలవరం పనుల్లో స్కాం జరిగింది. దీని పై మీరు విచారణ చేయండి. 25 కోట్లు స్కాం అన్నవాళ్లు చర్యలు ఎందుకు తీసుకోరు?
మీరు చేయకుండా కేంద్రాన్ని ప్రశ్నిస్తారా?రాష్ట్రం లో కేంద్రం ఆధ్వర్యంలో ముడు లక్షల కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా కూడా తేలేదు. మోడీ వచ్చాక రైల్వే లైన్ పనులు పూర్తి చేశాం. రాయచోటి వద్ద 2650 కోట్లు ప్రాజెక్టు లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆరు కోట్లు ఇచ్చింది. సిఎం సొంత జిల్లా కడప విమానాశ్రయం మీరు ఎందుకు విస్తరణ చేయలేదు? రాయలసీమ అభివృద్ధి కి నికర ప్రభుత్వమే నిధులు ఇచ్చింది. ఇటువంటి ఎన్నో అంశాలను ఆ ఎమ్మెల్యే, సిఎం తెలుసుకుని మాట్లాడాలి. నేషనల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ నిర్మాణం కోసం కేంద్రం ముందుకు వచ్చింది. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఇంతవరకు స్థలం ఇవ్వలేదు.
ప్రతి పధకం, ప్రాజెక్టు కి తండ్రి, కొడుకుల పేర్లేనా? వీటన్నింటి స్పందించి వాస్తవాలు చెప్పండి. జల జీవన్ మిషన్ కింద కేంద్రం నీరు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఇవ్వడం లేదు. పేదలకోసం మోడీ 25లక్షల ఇళ్లు కు ఆమోదం తెలిపారు. వీటిలో కేవలం ఆరు లక్షల ఇళ్లు నిర్మించారు. మూడు వేల కోట్లు ప్రాజెక్టు లు ఇక్కడ ఇచ్చానని జగన్ చెప్పారు. అవినాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఈ పనులకు కాంట్రాక్టర్లు.
అధికార పార్టీ తప్పులను మేము ప్రశ్నిస్తాం. అయిపోయిన పార్టీ, ప్రతిపక్ష పార్టీని మేమెందుకు అడుగుతాం? మీరు గురువిందలు… మీ గురించి మీరు తెలుసుకోండి. వెనుక నుంచి పట్టుకుంటాం అంటారుగంట, అరగంట అంటారు. తాజాగా చూసిన ఘటనతో వాళ్ల పార్టీ నాయకుల తీరు అర్థమైంది. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద కట్టిన రోడ్ల పై మీరు తిరుగుతున్నారు. డొంక తిరుగుడు వద్దు… దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. మీరు వస్తారా… మీ సిఎం వస్తారా… చర్చకు నేను రెడీ.