– పరిశ్రమలు పెట్టి బతుకులు పాడు చేయొద్దు
– ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
– సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి
పరవాడ: రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల్లో వేలాది మందికి ఉపాధి కలగనుందని ప్రభుత్వం చెబుతున్న మాటలను ప్రజలు విశ్వసించకపోవడమే కాదు, ఆ పరిశ్రమల ఏర్పాటు కోసం జరిగే ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయాలన్న డిమాండ్ పై ఏకమవడం నూతన పరిణామం. ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలని సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ అన్నారు. పరవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి పేరుతో మోసగించి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం పడుతున్న తాపత్రయానికి ప్రజా పోరాటాలు ప్రతిబంధకంగా మారాయి.
తమ ఆధీనంలోని పోలీసు బలగాలతో ప్రజలను భయపెట్టాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పరిశ్రమలు పెట్టి బతుకులు పాడుచేయొద్దన్న నినాదం ప్రతిధ్వనిస్తోంది. ప్రజల ఆగ్రహం ముందు అణచివేత, నిర్బంధ చర్యలు సాగవని జన సమూహాలు పాలకులను హెచ్చరిస్తున్నాయి. పోలీసును చూసి పారిపోయే మనుషులు భయపడకుండా ఎందుకు తిరగబడుతున్నారు? పరిశ్రమలకు ఒకనాడు భూములిచ్చిన రైతులు ఇపుడెందుకు ససేమిరా ఇవ్వమంటున్నారు? అన్న ప్రశ్నలకు ప్రభుత్వాల వద్ద జవాబులు లేవు. కానీ భూములిచ్చి, ఉపాధిలేక బతుకుతెరువుకు వూరూవాడా తిరుగుతున్న రైతులు, పేదలు, మత్స్యకారులు, చేతివృత్తిదారులకు అనేక అనుభవాలున్నాయి.
నేర్చుకున్న పాఠాలున్నాయి. మనసునిండా గూడుకట్టుకున్న బాధలున్నాయి. జీవితాలను సరిదిద్దుకోలేమన్న నిరాశలున్నాయి. ఈ క్రమంలోనే ప్రయివేటు పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన రూపంలో తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు వద్దని ఏక కంఠంతో ప్రజలు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి పనులు చేపడుతోంది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీసి ప్రయివేటీకరించేందుకు, స్థానికుల ఉపాధిపై ఊసెత్తని ఆర్సెలార్ మిట్టల్‌ను ప్రోత్సహించే ప్రభుత్వ కుట్రలను అర్ధంచేసుకున్న ప్రజలు కాలుష్యనియంత్రణ మండలి ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయసేకరణ సదస్సులో తమ అభ్యంతరం తెలిపారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి ప్రాంతంలో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే, పెట్టితీరాలని ప్రభుత్వం మొండిగావుంది. పోలీసులను చూపి వెనక్కుతగ్గేలా చేయాలని ప్రభుత్వం చూస్తే, తమ ఆలోచన విరమించుకొనేలా ఒత్తిడిపెంచాలని నిర్వాసితులు, బాధిత మత్స్యకారులు, ప్రజలు భావించారు. కొద్ది రోజుల క్రితం ఆ ప్రాంత పర్యటనకు వెళ్లిన మంత్రి అనిత వాహనం ముందు తాటిచెట్టు అడ్డంపెట్టి చెమటలు పట్టించేలా పోరాడారు.
విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలంలో గంగవరం పోర్టు ఆవరణలో అదానికి చెందిన అంబూజా సిమెంట్ గ్రైండింగ్ పరిశ్రమ ఏర్పాటుకు పెట్టిన ప్రజాప్రాయ సేకరణను వాయిదా వేసినట్లు అధికార యంత్రాంగం ప్రకటనచేసే పరిస్థితి ఏర్పడింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సొంత నియోజకవర్గం గాజువాక పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలో ప్రజలు తిరగబడ్డారు.
సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలను సిపిఎం, వామపక్షాలు సమీకరించాయి. అదానీ కొమ్ముగాసినా ప్రభుత్వ ఆటలు ఇక్కడ సాగనివ్వబోమని ప్రజల పక్షాన అవి నిలబడ్డాయి. అదానీకి చెందిన గంగవరం పోర్టు ధూళి, దుమ్ముతో భరించలేని కాలుష్యంతో బాధపడుతున్న ప్రజల్లో అంబూజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై ఆగ్రహం వెళ్లువెత్తింది. రాష్ట్రంలో తీరప్రాంతం, సెజ్‌లో ఏర్పాటైన ఔషధ, రసాయన పరిశ్రమలతో ఆ పరిసర ప్రాంత ప్రజలకు పీల్చే గాలి, తాగేనీరు ప్రమాదకరంగా మారాయి.
ప్రాణాంతక వ్యాధులకు అవి కేంద్రంగా వున్నాయి. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ఆటు ప్రభుత్వమూ, ఇటు పరిశ్రమాధిపతులు పూర్తిగా వదిలేశాయి. కోట్ల విలువైన రాయితీలు, సదుపాయాలు కల్పించి పరిశ్రమాధిపతులకు లాభాలు సమకూర్చడంపైనే ప్రభుత్వాలు శ్రద్ధ చూపుతున్నాయి. ఆ పరిశ్రమలకు భూములిచ్చిన రైతులు, ఉపాధి కోల్పోయిన పేదలు, వృత్తిదారులను విస్మరించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ముందుకుతెచ్చి ప్రజలకు కనీస భద్రతను లేకుండా డబుల్ ఇంజన్ (మోడీ, చంద్రబాబు) సర్కారు చేశాయి. చట్టబద్ద నియంత్రణలను కార్పొరేట్లు, పెట్టుబడిదారులు పాటించాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి. గాలి, నీరు కలుషితం చేస్తున్నా పట్టించుకోవడం మానేశాయి. చివరకు కాలుష్యనియంత్రణ మండలి, ఫ్యాక్టరీల అధికారుల తనిఖీలపై ఆంక్షలు విధించి విచ్చలవిడితనానికి అవకాశం కల్పించాయి.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రమాదకరమైన, అత్యంత ప్రమాదకరమైన జాబితాలో 386 పరిశ్రమలున్నట్లు 2023లో అధికార యంత్రాంగం గుర్తించింది. గత ఐదేళ్లలో 110 పరిశ్రమలకు నోటీసులు జారీచేశారు. విశాఖ నగర వాసుల ఆరోగ్యాలను కాలుష్యంతో దెబ్బతీస్తున్న విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టును పర్యావరణ ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవడంలేదు. ఎన్టీపిసి కాలుష్యంతో మూల స్వయంవరం, సోమినాయుడుపాలెం ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో పడుతున్నారు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీకి ఆనుకొనివున్న గ్రామాలు వాయు కాలుష్యంతో తల్లడిల్లుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గని శెట్టి డిమాండ్ చేశారు. కాలుష్యంలో అల్లాడిపోతున్న తాడి గ్రామం వెంటనే తరలించాలని కోరారు