Suryaa.co.in

Andhra Pradesh

సేవ్ ది నేషన్… సేవ్ డెమోక్రసీ.. నినాదంతో ప్రజల్లోకి

టీడీపీ, వైసీపీ.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి…
కాంగ్రెస్ తోనే ప్రత్యేక హాదా… విభజన హామీల అమలు
ఈనెల 4వ తేది నుంచి ఆంధ్రప్రదేశ్ లో వరుస సభలు
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

విజయవాడ : రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదిన్నరేళ‌్ల కాలంలో… టీడీపీ, వైసీపీలు ఆంధ్రప్రదేశ్ ను భ్రష్టు పట్టించాయని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని హాదాలో మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీలు రాష్ట్రానికి ప్రత్యేక హాదాతో పాటు అనేక విభజన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హాదాతో పాటు విభజన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందని మండి పడ్డారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన స్థానిక పార్టీలైన వైసీపీ, టీడీపీలు.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాస్తూ.. ప్రజలకు తీరని నష్టం చేస్తున్నాయని మండి పడ్డారు. ప్రజలకు భద్రత లేదని, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ తోనే సాధ్యం…
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదా రావాలన్నా… విభజన హామీలన్నీ అమలు కావాలన్నా… కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తేల్చి చెప్పారు. అందుకే సేవ్ ది నేషన్… సేవ్ డెమోక్రసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీజేపీతో కలిసి వైసీపీ, టీడీపీలు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా… దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని… ఈ నెల 3వ తేది మంగళవారం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఏఐసీసీ కార్యదర్శి మయప్పన్ తో కలసి, ప్రత్యేక పూజలు చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

సేవ్ ది నేషన్.. పోస్టర్ ఆవిష్కరణ…
సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ కార్యక్రమంలో భాగంగా.. ప్రత్యేక హాదా., విభజన హామీల అమలు కోరుతూ.. అక్టోబర్ 4వ తేది చిత్తూరు లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రకటించారు. జాతీయ స్థాయి నాయకులతో పాటు సీడబ్ల్యుసీ సభ‌్యులు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తో పాటు ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు విడుదల చేశారు. 5వ తేది మదనపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేశామని, అదే విధంగా 6వ తేది కడపలో ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.

రాహుల్ జోడో యాత్ర స్పూర్తితో…
రాహుల్ జోడో యాత్ర స్పూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని, ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమని, ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా భావిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకోవడంతో పాటు రెండో విడత ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు జరిగిన అన్యాయం వంటి అనేక ప్రజా సంబంధ సమస్యలపైనా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన గుర్తు చేశారు.

అదే విధంగా సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి.. ప్రిలిమినరీ, ఈవెంట్స్ తరువాత చివరి పరీక్షలకు మధ్య 45 రోజులు గడువు ఉండటంతో అర్హతగల కొంత మంది అభ్యర్థులకు నష్టం చేకూరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా ఈ సమస్యలపై ద్రుష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ముఖ్య నేతలు వి.గుర్నాధం, డాక్టర్ జంధ్యాల శాస్త్రి, యలమందారెడ్డి, మూలా వెంకట్రావు, పీవై కిరణ్, ఖుర్షీదా, జేసుదాసు, సత్యవతి, పూర్ణిమతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE