• ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రతిపాదనలను సత్వరమే పంపాలి
– రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, జూన్ 2: అన్ని ఇంజనీరింగ్ శాఖలకు సంబందించిన ఎస్సీ కంపొనెంట్ స్పిల్ ఓవర్ పనులను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబందించి శాఖల వారీగా ఎస్సీ కంపొనెంట్ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు.
గురువారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లో పంచాయితీరాజ్, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, చిన్న నీటి పారుదల శాఖలు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమావేశమై గత ఏడాది ఎస్సీ కంపొనెంట్ నిధుల కేటాయింపు, వాటి వినియోగంపై మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ కంపొనెంట్ నిధులను అన్ని ఇంజనీరింగ్ శాఖలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాయనే అసంతృప్తిని వ్యక్తంచేశారు.
రోడ్లు,భవనాలు, చిన్న నీటి పారుదల శాఖలు కనిష్ట స్థాయిలో నిధులను వినియోగించుకోవడంపై ఆయన తప్పు పట్టారు. ఇటు వంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులకు ఆయన సూచించారు. వర్షాకాల ప్రారంభంలోపే చిన్ననీటి పారుదల శాఖ పనులను పూర్తిచేయాలని సూచించారు. ఎస్సీలు సాగుచేసుకొనే సొసైటీ భూములకు సాగునీరు అందించే విధంగా పోతారలంక ఎత్తిపోతల పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ అధికారులను ఆయన అదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చేపట్టిన మినీస్టేడియంల నిర్మాణం, ఆధునీకరణకై రూ.8 కోట్లతో చేపట్టిన 37 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని శాప్ అధికారులను ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ పనులన్ని ఏ ఏ దశల్లో ఉన్నాయో నివేదికను రూపొందించి ఐదు రోజుల్లో తమకు నివేదించాలని సాంఘిక సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల సెక్రటరీ భాను మూర్తిని మంత్రి ఆదేశించారు. ఆంద్రప్రదేశ్ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నాబార్డు నిధులతో సత్తెనపల్లి, బ్రహ్మంగారిమఠం, కురిచేడు, ఆరుగొలను మరియు ఎడ్లపాడులో చేపట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను సాద్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబందించి శాఖల వారీగా ఎస్సీ కంపొనెంట్ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదలను సాద్యమైనంత త్వరగా తమకు పంపినట్లైతే పక్షం రోజుల్లోనే మంజూరు ఉత్తర్వులను జారీచేస్తామని అధికారులకు ఆయన సూచించారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, సంచాలకులు కె.హర్షవర్థన్, ఆశ్రమ పాఠశాలల సెక్రటరీ భాను మూర్తి తదితరులతో పాటు పంచాయితీరాజ్, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, చిన్న నీటి పారుదల శాఖల, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.