రాష్ట్రంలో ప్రతి యుఎల్ బి పరిధిలో ఒక నగరవనం ఏర్పాటు

– ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగరవనాలు
– ఎకో టూరిజం కోసం రూ.15 కోట్లు కేటాయింపు
– రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది
– రాష్ట్రంలో 49,732 హెక్టార్ లలో ఎపి అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా ప్లాంటేషన్
– సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం

అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు అహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అటవీశాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 23 నగరవనాలు, 7 టెంపుల్ ఎకో పార్క్ లు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగరవనాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొత్తం రూ.18.02 కోట్ల వ్యయంతో 220.48 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలోని మొత్తం 120కి పైగా అర్భన్ లోకల్ బాడీలు ఉన్నాయని, వాటి పరిధిలో కనీసం ఒక్కో నగరవనంను అయినా ఏర్పాటు చేయాలనేది అటవీశాఖ లక్ష్యంగా నిర్ధేశించామని తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నగరవనం కోసం ఈ ఏడాది 2022-23 లో 14.94 కోట్లు మేర రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చేశామని, వాటికి తోడు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగర వనాల్లో ఉదయపు నడక, పిక్ నిక్ స్పాట్ లుగా వినియోగించుకునేలా సదుపాయాలు కల్పించాలని అన్నారు. లోకల్ బాడీల పరిధిలో అయిదు కిలోమీటర్ల లోపు ఈ నగరవనాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, దీనిపై అటవీశాఖ ప్రతిపాదనలు సిద్దం చేయాలని రాష్ట్రంలో ఎకో టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఎకో టూరిజం (వనవిహారి) ప్రాజెక్ట్స్ ఉన్నాయని, ఈ ఏడాది పులికాట్, నేలపట్టు, కోరంగి, పాపికొండలు ఎకో టూరిజం ప్రాజెక్ట్ లను అభివృద్ది చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. అలాగే అరకు ప్రాంతంలో జంగిల్ రిసార్ట్స్ ఏర్పాటు పై దృష్టి సారించాలని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో ఎకో టూరిజంకు మంచి గుర్తింపు వచ్చిందని, దానిని ఆదర్శంగా తీసుకుని మనరాష్ట్రంలో కూడా ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలు, ఆచరణపై దృష్టి సారించాలని కోరారు.

రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నల్లమల నుంచి శేషాచలం వరకు పులుల సంచారం గుర్తించడం జరిగిందని అన్నారు. తాజాగా కాకినాడ జిల్లా పత్తిపాడులో కూడా పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ గుర్తించడం జరిగిందని, ఒరిస్సా అడవుల నుంచి ఇది వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పులుల వల్ల మనుషులకు, పశువులకు ఎటువంటి హానీ కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాపికొండలు నేషనల్ పార్క్ లోనూ పులుల సంచారంపై స్టడీ చేయాలని, వన్యప్రాణుల సంరక్షణలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

నల్లమల, శేషాచలం అటవీప్రాంతాల్లో ఎర్రచందనం ప్లాంటేషన్ పై దృష్టి సారించాలని కోరారు. టాస్క్ ఫోర్స్, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరారు. అటవీశాఖలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసే ఉద్యోగులకు స్థానచలనం కలిగించాలని సూచించారు. జిల్లాల విభజన తరువాత అన్ని డివిజన్లు, సర్కిళ్ళలో సిబ్బంది సంఖ్యను క్రమబద్దీకరించాలని, హేతుబద్దంగా పోస్ట్ లు ఉండేలా చూడాలని కోరారు.

ఎపి అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్లాంటేషన్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, సమీప ప్రాంతాల ప్రజలకు జీవనోపాది మార్గాలను కల్పించాలని అన్నారు. యూకలిప్టస్ సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం టన్ను రూ.4050 రూపాయలు ధర లభిస్తోందని, దీనిని మరింత పెంచేందుకు ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫాం లను పెంచాలని సూచించారు. రాష్ట్రంలో 49,732 హెక్టార్ లలో ఎపి అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ రకాల చెట్ల పెంపకం జరుగుతోందని, గత ఏడాది యూకలిప్టస్, టేకు ప్లాంటేషన్ 326.41 హెక్టార్ లలో చేయగా, ఈ ఏడాది 200 ఎకరాల్లో ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అలాగే జీడిమామిడి తోటలకు సంబంధించి గత ఏడాది 5.50 హెక్టార్ లలో ప్లాంటేషన్ చేపట్టగా, ఈ ఏడాది 120 హెక్టార్ లలో చేయాలని, గత ఏడాది 15.73 లక్షల హెక్టార్ లలో వెదురు ప్లాంటేషన్ చేపట్టగా, ఈ ఏడాది 13.22 హెక్టార్ లలో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. గత ఏడాది 183 హెక్టార్ లలో కాఫీ ప్లాంటేషన్ చేపట్టగా ఈ ఏడాది 300 హెక్టార్ లలో చేయాలని, గత ఏడాది 34 హెక్టార్ లలో మిరియాల ప్లాంటేషన్ చేపట్టగా ఈ ఏడాది 30 హెక్టార్ లలో చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. జీడిపప్పు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో ఉందని, గ్రాఫ్టింగ్ విధానం ద్వారా మంచి నాణ్యమైన జీడిమొక్కలను ఉత్పత్తి చేస్తున్నామని, అలాగే రాష్ట్రంలోని ఉద్యానవన యూనివర్సిటీల ద్వారా మరింత మెలుజాతి జీడి మొక్కల ఆవిష్కరణకు కృషి చేస్తున్నామని తెలిపారు. వీటన్నింటిని వినియోగించుకుని ప్లాంటేషన్ లపై మరింత ముందుకు వెళ్ళాలని కోరారు.

సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (అటవీ, పర్యావరణ) నీరబ్ కుమార్ ప్రసాద్, పిసిసిఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ప్రదీప్ కుమార్, చిరంజీవి ఛౌదరి (పిసిసిఎఫ్ – క్యాంపా), పిసిసిఎఫ్ (ప్రొడక్షన్) ఆర్పి ఖజూరియా, పిసిసిఎఫ్ (రీసెర్చ్) అజయ్ కుమార్ నాయక్, పిసిపిఎఫ్ ఎకె ఝా ఎపిఎఫ్ డిసి విసి అండ్ ఎండి పికె సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply