Suryaa.co.in

Andhra Pradesh

నీట్ పరీక్షలో సత్తా చాటిన ఎస్సీ గురుకుల విద్యార్థులు

• ఈ ఏడాది 28 ఎంబీబీఎస్, 16 డెంటల్ సీట్లు
• గత ఏడాది కంటే మిన్నగా నీట్ ఫలితాలు
• మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి.

అమరావతి, జూన్ 14: ఎస్సీ గురుకులాల నుంచి నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులలో గత ఏడాది కంటే అధికంగా ఈ ఏడాది 28 మంది ఎంబీబీఎస్, 16 మంది డెంటల్ సీట్లను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులాల నుంచి మొత్తం 181 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాగా వారిలో 171 మంది ఈ పరీక్షలో అర్హత సాధించారని వివరించారు.

రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు నీట్, జేఈఈ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు చిన్న టేకూరు (కర్నూలు), ఈడ్పుగల్లు (కృష్ణా), అడవి తక్కెళ్లపాడు (గుంటూరు)లో ఉండగా ఈ కేంద్రాల నుంచి మొత్తం 181 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారని ఒక ప్రకటనలో నాగార్జున తెలిపారు. చిన్న టేకూరుకు చెందిన విద్యార్థులు ఈ పరీక్షలో ఎక్కువ ప్రతిభను కనబరిచారని చెప్పారు. చిన్నటేకూరు కేంద్రం నుంచి 43 మంది విద్యార్థులు నీట్ కు హాజరు కాగా వారందరూ కూడా నీట్ లో అర్హతను సాధించారన్నారు.

అలాగే ఈడ్పుగల్లు నుంచి 113 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా వారిలో 106 మంది అర్హతను సాధించారని చెప్పారు. చిన్నటేకూరుకు చెందిన విద్యార్థి బెజవాడ మహేశ్వర రావు 97.76, మందా వివేక్ 95.88, బెలూం నరేష్ 95.16 పర్సంటైల్ ను సాధించారని తెలిపారు. ఇంకా పలువురు విద్యార్థులు కూడా మంచి పర్సంటైల్ ను సాధించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నీట్ లో విద్యార్థులు సాధించిన పర్సంటైల్, మార్కుల ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది ఎస్సీ గురుకుల విద్యార్థులకు మొత్తం 44 వైద్య విద్యా సీట్లు రానున్నాయని నాగార్జున వెల్లడించారు.

వీటిలో 28 ఎంబీబీఎస్ సీట్లు కాగా 16 డెంటల్ (బీడీఎస్) సీట్లు ఉన్నాయని చెప్పారు.ఈ సీట్లలో చిన్న టేకూరు విద్యార్థులు 19 ఎంబీబీఎస్, 12 బీడీఎస్ సీట్లను సాధించారని చెప్పారు. ఈడ్పుగల్లు విద్యార్థులు 7 ఎంబీబీఎస్, 1 బీడీఎస్ సీటును సాధించుకోగా, అడవి తక్కెళ్లపాడుకు చెందిన విద్యార్థులు 2 ఎంబీబీఎస్, 3 బీడీఎస్ సీట్లను సాధించుకున్నారని నాగార్జున వివరించారు. 2022 నీట్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థులు 15 ఎంబీబీఎస్, 2 బీడీఎస్ సీట్లను సాధించగా ఈ ఏడాది నీట్ లో గత ఏడాది కంటే అధికంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేసారు.

ఈ ఏడాది నీట్ పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ సీట్లను సాధించడానికి కృషి చేసిన గురుకుల కార్యదర్శి ఆర్. పావనమూర్తి, ఏఎంఓ సంజీవరావు, ఇతర ఉపాధ్యాయులను నాగార్జున అభినందించారు. కాగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తర్వాత ఎస్సీ గురుకుల విద్యా సంస్థల ఫలితాలు మరింతగా పెరిగాయని నాగార్జున వెల్లడించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు 2057 మంది ఉత్తీర్ణులు కాగా సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు 1222 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని తెలిపారు. దీంతో జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల శాతం 63 నుంచి 82 కు, సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల శాతం కూడా 74 నుంచి 85 కు పెరిగిందని వివరించారు.

 

LEAVE A RESPONSE