ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదని ఆగ్రహించింది. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తోందని మండిపడింది. ఇక తమ వద్ద కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, వారంలోగా కేంద్రం తమ తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది.
ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ‘‘ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్), ఎన్సీఎల్ఏటీ(నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్) వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనవి. వీటితో పాటు సాయుధ బలగాలు, వినియోగదారులకు సంబంధించిన ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఉన్నాయి. దీని వల్ల అనేక కేసుల్లో పరిష్కారం లభించక వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తోంది’’ అని ధర్మాసనం పేర్కొంది. దీనికి కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని తెలిపారు.
దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘గత రెండేళ్ల నుంచి ట్రైబ్యునళ్లలో ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. నియమాకాలు చేపట్టకుండా మీరు ట్రైబ్యునళ్లను బలహీనపరుస్తున్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదు. ఇది చాలా విచారకరం. మేం కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవట్లేదు. కానీ మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంలో తమ వద్ద కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపారు. ‘‘1. కేంద్రం తెచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం. 2. ట్రైబ్యునళ్లను రద్దు చేసి హైకోర్టులకు అధికారాలివ్వడం. 3. కోర్టు స్వయంగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టడం.. వీటితో పాటు కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే ఆప్షన్ను కూడా పరిగణించాల్సి వస్తుంది’’ అని సీజేఐ హెచ్చరించారు. ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టేందుకు వారం గడువు కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అప్పటికైనా కేంద్రం తమ తీరు మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.