మావిగన్! జగన్మోహన్ రెడ్డి వదిలిన తూటా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దాని అర్థం తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అస్త్రాలు వదలటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. తాను జైలుకు వెళ్లినప్పుడు పార్టీ కకావికలమవుతుంది అనుకున్న సందర్భంలో షర్మిలను ఉపయోగించాడు.
అన్నల మీద ఆడపిల్లలకు ఉండే సహజమైన ప్రేమానురాగాలతో “జగనన్న వదిలిన బాణాన్ని” అంటూ అహర్నిశలూ శ్రమించి ఆమె పార్టీని నిలబెట్టింది. ఇప్పుడు అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించే సమయంలో, అసెంబ్లీ తీర్మానం చేసే ప్రక్రియ మొదలవగానే అసంబద్ధమైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశాడు. చివరకు రాజధాని బిల్లు పార్లమెంటు వరకు వెళ్లి ఎగువసభ, దిగువసభ ఆమోదం పొందుతున్న వేళ “మావిగన్” అనే గన్ పేల్చాడు.
అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే, తాను అధికారంలోకి రాగానే అసెంబ్లీలో మరో తీర్మానం చేసి అమరావతిని ఆపేయలేనా అంటూ ఒక ప్రశ్న సంధించగానే, అధికార పక్షం “అమరావతిని జగన్ తిరిగి మార్చలేడు” అంటూ ప్రజలకు భరోసా ఇవ్వటం మొదలుపెట్టింది. జగన్ “మావిగన్” అనగానే కాసేపు నవ్వుకోవటానికి పనికి వచ్చిందిలే అని ప్రజలు అనుకున్నారు.
కానీ, దీనిపై చర్చను ఎంతగా మొదలుపెట్టగలిగాడంటే టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ వదిలిన మావిగన్ పై ప్రజలకు వివరణ ఇవ్వవలసి వచ్చింది. జగన్ మావిగన్ అన్నరోజు సరదాగా తీసుకున్న ప్రజలు, ఇప్పుడు మావిగన్ అంటే ఏమిటో సెర్చ్ చేసే వరకు వెళ్లారు. ఈ మధ్యలో రాజధాని చట్టబద్ధత గురించిన చర్చ, ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని వస్తున్నది అనే సంబరాలు పక్కకు పోయాయి.ఆంధ్రప్రదేశ్‌లో కూటమిప్రభుత్వం కొలువుతీరిన రోజు నుండి జగన్ సంధించే అర్థం లేని ప్రశ్నలకు సమాధానం చెప్పటానికే సమయం సరిపోతున్నది.
రాజధాని గురించి ఒకసారి పార్లమెంటులో చట్టం చేశాక దానిని సవరించటం చాలా కష్టం అని జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం కాదు. కానీ రాష్ట్ర ప్రజల ఆలోచనను తన చుట్టూ తిప్పుకోవడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. దానివలన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల ప్రచార ప్రాధాన్యత తగ్గిపోతున్నది. ఉదాహరణకు ప్రభుత్వం చేసే అప్పు గురించి వైసీపీ ప్రచారం చేస్తున్నది. అందుకు తగిన విధంగా పెరిగిన ఆదాయం గురించో, జరిగిన అభివృద్ధి గురించో ప్రజలకు చెప్పే అవకాశం, సమయం కూటమి ప్రభుత్వానికి ఉండటం లేదు. అప్పు చేసే మాట అబద్ధం కాకపోవచ్చు. నిజం ఏమిటో ప్రజలకు ప్రభుత్వమే చెబితే బాగుంటుంది.
అమరావతి పైన జరుగుతున్న దాడి అనేది వైసీపీ స్ట్రాటజీ మాత్రమే. అమరావతిలో జరుగుతున్న పనుల్లో వేగం ఎంతో ప్రజలకు తెలియదు. కానీ ప్రజలకు తెలుస్తున్నది అమరావతి పనుల్లో గుత్తేదార్లు (Contractors) జాప్యం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు అనేది మాత్రమే. గుత్తేదార్లను అడిగి తెలుసుకోగలిగే సామర్థ్యం ప్రజలకు ఉండదు. వారి పనిని ప్రజలకు తెలియపరచగలిగే జర్నలిస్టులకు చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరగని రీతిగా గుత్తేదార్లు డిఫమేషన్ నోటీసులు ఇస్తున్నారు.
పార్లమెంటులో అమరావతికి ఆమోదం రాగానే రాయలసీమ గురించి వివాదాలు లేపే ప్రయత్నం మొదలుపెట్టింది వైసీపీ. ప్రభుత్వానికి పాలన పైన కంటే వైసీపీ దుష్ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో అనే విషయం పైనే ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తున్నది. పార్లమెంటులో రేణుకాచౌదరి చెప్పినట్లు, అమరావతి గురించి వైసీపీకి సమాధానం ఇవ్వటం కంటే పనుల్లో వేగం పెంచటం ముఖ్యం.
అమరావతిని ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పటం కంటే, ఇప్పటికి జరిగిన పనుల గురించి ప్రజలకు తెలిపితే బాగుంటుంది. అమరావతి విషయంలో ఎంత పారదర్శకత ఉంటే ప్రభుత్వానికి అంత మేలు. రాజధాని పనులలో వేగం గురించి జగన్ ప్రశ్నించక ముందే ప్రభుత్వం వివరిస్తే, ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉండదు. చట్టబద్ధత వచ్చింది కాబట్టి అమరావతిని మార్చే ప్రక్రియ కష్టం కావచ్చు.
కానీ ఒక వ్యవస్థను నీరుగార్చటం కష్టం కాదు. అమరావతిపై దాడిని వైసీపీ ముమ్మరం చేస్తున్నది. అందుకోసం మాడభూషి శ్రీధర్ లాంటి మేధావిని ఉపయోగిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక న్యాయకోవిదుడు అనుకునే మాడభూషి, న్యాయస్థానాల తీర్పులను కూడా ప్రస్తావిస్తూ అమరావతి రాజధానిగా అవసరం లేదు అని రాయటమంటేనే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అర్థమవుతుంది.
రాష్ట్రపతి ఆమోదముద్రతో అమరావతి రాజధాని గెజిట్ అయి చట్టబద్ధత ప్రక్రియ పూర్తయింది. అయినా జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాన్ని ఆపకపోవచ్చు. అది విఫలయత్నమే అయినప్పటికీ అమరావతి చుట్టూ వైసీపీ అలాగే ప్రయత్నిస్తుందని మొన్న బొత్స, ధర్మాన మాట్లాడిన విధానం రుజువు చేస్తున్నది.
అనేక రాష్ట్రాలు విడిపోయాయి, కొత్త రాజధానులు ఏర్పడినాయి. కానీ ఎక్కడా కేంద్రం ఇంతగా జోక్యం చేసుకోవలసిన అవసరం కలగలేదు. ఇప్పుడు బాధ్యత రాష్ట్రప్రభుత్వం భుజస్కంధాలపైనే ఉన్నది. ‘తాత్కాలిక రాజధాని’ అనే పేరు పెట్టటం రాష్ట్రాన్ని ఎంత గాయం చేసిందో రాష్ట్ర ప్రజలు చూశారు. అందుకే వారు విజ్ఞతను ప్రదర్శించారు.
కానీ కూటమిప్రభుత్వం వారికి భరోసా కల్పించటంలో విఫలమవుతున్నది. విడతల వారీగా అమరావతిలో నిర్మాణాల పురోగతిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిపేటంతటి పారదర్శకతను పాటించవలసిన అవసరం ఉన్నది. ప్రజా రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా ఉంటే కొంత అయోమయం తగ్గే పరిస్థితి ఉంటుంది. జగన్ మళ్లీ రాకూడదనే పట్టుదల చూపించిన ప్రజలు, ఇప్పుడు “మళ్లీ జగనే వస్తే?” అనే ఆందోళనకు లోనవుతున్నారు.
అమరావతి నిర్మాణ పనుల జాప్యం పట్ల సాక్షాత్తు ముఖ్యమంత్రే అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు, రాజధాని రైతులు లేదా రాష్ట్ర ప్రజలు అనుమానం వ్యక్తం చేయటంలో ఆశ్చర్యం లేదు. “జగన్ హయాంలో ఏ గుత్తేదార్లు టెండర్లు దక్కించుకున్నారో, వారే కూటమి హయాంలో కూడా నిర్మాణ పనులు చేస్తున్నారు.
వారు జగన్‌తో కలిసి కుట్ర చేయటం వలనే కావాలనే పనులు జాప్యం చేస్తున్నారేమో” అని ఒక రైతు భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆ అనుమానం అసంబద్ధం కావచ్చు, కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి టీమ్‌కు ఏదీ అసాధ్యం కాదు అనే భయంలో ఉన్న ప్రజలకు విశ్వాసం కలిపించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే!
– ఇంద్రాణి