మాదిగలకు టీడీపీ చేసిన మేలు ఒక్కటైనా ఉందా..?
– టీడీపీ అధినాయకత్వాన్ని దళితులు నిలదీయాలి
– విద్య, సంక్షేమ పథకాలతోనే దళితుల జీవితాల్లో వెలుగులు
– ఇద్దరు మాదిగలు, ముగ్గురు మాలలకు కీలక మంత్రిత్వశాఖలు
– మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
మాదిగలకు టీడీపీ చేసిన మేలు ఒక్కటైనా ఉందా..?
టీడీపీలో మాదిగ నాయకులంతా కలిసి నిన్నొక సమావేశం పెట్టుకున్నారు. దానికి అచ్చెన్నాయుడును ఆహ్వానించుకుని చాలా అంశాలపై మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడానికి మాత్రమే ఆ సమావేశం పెట్టుకున్నారు గానీ ఎక్కడా మాదిగల సంక్షేమానికి సంబంధించిన విషయాల ప్రస్తావనను తీసుకురాలేదు. ఎంతసేపు వాళ్లు ఈ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి ని, ఇతర ప్రభుత్వ పెద్దల్ని తిట్టడమే పనిగా పెట్టుకుని మాట్లాడారు. అంతేగానీ, టీడీపీ అనేది మాదిగలకు గతంలో ఏం చేసింది..?
భవిష్యత్తులో ఏం చేయబోతుంది..? మాదిగల అభివృద్ధి, వారి జీవనశైలిలో వచ్చిన మార్పు ఏంటి..? అనే విషయాలపై ఏ ఒక్కరూ చర్చించకపోవడం చాలా బాధాకరం. అసలు, వాళ్లు సమావేశాన్ని ఏ ఉద్దేశంతో పెట్టారో కూడా అక్కడ కూర్చొన్న నాయకులకు తెలుసో లేదో కూడా అనుమానమే. ఏదిఏమైనా మాదిగ నాయకులను ఈ విధంగా వాడుకోవడం చాలా దురదృష్టకరమని చెబుతున్నాను.
ఎన్నికల ఏడాది రాగానే కులాల కుంపట్లు రాజేయడమనేది చంద్రబాబుకు, టీడీపీ నాయకులకూ సంప్రదాయంగా వస్తున్న ఆచారంగా ఉంది. కేవలం మాదిగ కులాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో ఆ సామాజికవర్గ ఓటుబ్యాంకును వాడుకునేందుకు.. లేదంటే, ఆ కులం నేతల్ని కూర్చోబెట్టి అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇతర ప్రభుత్వ పెద్దల్ని తిట్టించాలనే దిగజారుడు రాజకీయాలకు టీడీపీ ప్రయత్నిస్తుంది.
మాదిగల సమావేశం అని పెట్టినప్పుడు ఆ సమావేశ అజెండా ఏంటో దానిపై కూలంకుషంగా చర్చించాలి. ఆ పార్టీతరఫున మాదిగలకు ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పాలి గానీ.. పనిగట్టుకుని కక్షపూరితంగా తిట్టినట్లు ముఖ్యమంత్రి ని, ఇతర ప్రభుత్వ పెద్దల్ని, వైఎస్ఆర్సీపీకి చెందిన దళిత నాయకుల్ని ఇష్టానుసారంగా దూషించడం అనేది ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను. అచ్చెన్నాయుడైతే మరీ బరితెగించి దుర్భాషలాడారు. దీన్ని మేం ఖండిస్తున్నాము. దీనిపై టీడీపీలో ఉన్న మాదిగ నాయకులతో పాటు ఇతర పెద్దలు కూడా మనసుపెట్టి ఆలోచన చేయమని కోరుతున్నాను.
టీడీపీ అధినాయకత్వాన్ని దళితులు నిలదీయాలిః
నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేసి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా చితికిన అగ్రవర్ణాల పిల్లలకు ఈరోజు ఇంగ్లీషు మీడియం విద్యను అందిస్తూ.. వారికి సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తూ మెరుగైన విద్యకు శ్రీకారం చుట్టారు జగన్ . అంగన్వాడీ కేంద్రాల్ని ఆధునీకీకరించి జగనన్న గోరుముద్ద తదితర కార్యక్రమాలతో ప్రాథమిక స్థాయిలోనే విద్యావ్యవస్థలో మార్పును చూడాలని తపించిన ముఖ్యమంత్రిగా జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇలాంటి సున్నితమైన విషయాల పట్ల గతంలో పనిచేసిన ఏ ప్రభుత్వాలైనా కనీసం ఆలోచన చేశాయా..? చంద్రబాబు ఏరోజైనా దళితవర్గాల పిల్లల చదువుకు సంబంధించి మంచి నిర్ణయం ఒక్కటైనా తీసుకున్నారా..? దళితవర్గాల్లో మాల, మాదిగ పిల్లలకు ఇంగ్లీషు విద్య అవసరమని మా జగన్ గారు గుర్తించి అమలు చేస్తే ఈ చంద్రబాబు అడ్డుకుని కోర్టులకెళ్లిన సంగతిని టీడీపీలో ఉన్న మాదిగలకు తెలియదా..? ఇప్పటికైనా వారంతా మనసుపెట్టి ఆలోచించి టీడీపీ అధినాయకత్వాన్ని నిలదీయాలని చెబుతూ.. దళితుల పట్ల, దళిత సంక్షేమం పట్ల మా జగన్‌ని ప్రశ్నించే అర్హత ప్రతిపక్షానికి లేదని నేను స్పష్టంచేస్తున్నాను.
విద్యతోనే దళితుల జీవితాల్లో వెలుగులుః
దళితుల అభివృద్ధి విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబూ జగ్జీవన్‌రామ్ గారు ఏం చెప్పారు.. ? వాళ్ల ఆశయాలేంటి..? దళితవర్గాల్లో మాల, మాదిగల్ని ఏవిధంగా పైకి తీసుకురావాలని వారు ఎలాంటి మార్గదర్శకాలను సూచించారు..? కిందపడిన వర్గాల్ని ఏవిధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి..? వీటన్నింటికి సంబంధించి వారు ఏవిధమైన కార్యచరణను ప్రకటించారు..? వారి ఫిలాసఫీని క్షుణ్ణంగా అధ్యయన చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిపాలన ఏ విధంగా సాగుతోందన్నది ప్రతి ఒక్క దళితుడూ ఆలోచించాలి.
అంబేద్కర్ గారిచ్చిన ఏకైక అస్త్రం విద్యకు జగన్ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది. విద్య ద్వారానే దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని.. అధికారం పగ్గాలు చేపట్టిన తొలిరోజు నుంచి విద్యారంగంలో ఆయన తెచ్చిన సమూల మార్పుల్ని అందరం గమనించుకోవచ్చు. ఎలాంటి సామాజికరుగ్మతనైనా నిర్మూలించాలంటే మొదట ఆ సమాజాన్ని ఎడ్యుకే ట్ చేయాలనే లక్ష్యం పట్ల జగన్ గారి చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవాలని పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
దళిత కుటుంబాల్లో మార్పును చూడాలంటే కేవలం విద్యద్వారానే కాకుండా ఇతర రంగాల్లో కూడా జగన్‌గారు అనేక విప్లవాత్మక నిర్ణయాలు చేపట్టిన సంగతిని అందరూ గుర్తెరగాలి. వైద్యరంగం విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని.. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలను కొత్తగా తేవడంతోపాటు, 49 వేల మంది వైద్య సిబ్బందిని నియామకం, ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో సేవల ద్వారా సమూల మార్పులు తెస్తున్నారు.
విద్య, వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో పేదలకు అవసరమైన అభివృద్ధి ఎదుగుదల సాధ్యమౌతుందని ఆలోచించిన నాయకుడు శ్రీ వైఎస్ జగన్‌గారు అని నేను ఈరోజు గుర్తుచేస్తున్నాను. ఇలాంటి ప్రాథమిక అభివృద్ధి సూత్రాల్ని టీడీపీ అధినాయకుడు ఏనాడైనా ఆలోచించారా..? అని గుండెలమీద చెయ్యేసుకుని ప్రశ్నించుకోవాలని ప్రతిపక్షనేతల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మరేదైనా ఉందా..?ః
బడుగు, బలహీన, పేదవర్గాలకు ఒక స్థిరమైన నివాసం ఉండాలి. పేద కుటుంబాల గౌరవం పెంచాలని ఈరోజు రాష్ట్రంలో దాదాపు 30 లక్షలమందికి ఉచితంగా ఇళ్లస్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతోపాటు అమరావతి రాజధాని ప్రాంతంలోనూ మరో 50వేల మందికి ఇళ్లస్థలాలిచ్చారు కదా.. భారతదేశంలో ఒకేసారి అంతమందికి ఉచితంగా ఒక ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఉందా..?
ఇళ్లస్థలాలు తీసుకున్న లబ్ధిదారుల్లో మాదిగలు, మాలలు లేరా..? ఇతర బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల్లేరా..? మరి, ఏనాడైనా చంద్రబాబుకు అధికారంలో ఉండగా ఇలాంటి మంచి ఆలోచన తట్టిందా..? అని అడుగుతున్నాను. పేదోడికి గూడు కల్పించడమనే ఆలోచన ఎందుకు చేయలేదని ఆయన్ను ప్రశ్నిస్తున్నాను. ఇందుకు సమాధానం ఇచ్చుకునే పరిస్థితి కూడా మీకు లేనందున మీకు మాదిగల సంక్షేమం గురించి, దళితుల గురించి మాట్లాడే అధికారం ఈ ప్రతిపక్షానికి లేదని మరోమారు గుర్తుచేస్తున్నాను.
ఇద్దరు మాదిగలు, ముగ్గురు మాలలకు కీలక మంత్రిత్వశాఖలుః
మంత్రివర్గం విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో ఒక మాదిగ, ఒక మాల కులానికి చెందిన నాయకుడు మంత్రిగా ఉండటం పెద్ద గొప్ప. ఇచ్చే అరాకొరా పదవుల్ని కూడా సమర్ధులకు ఇవ్వరు. గతంలో మీరు ఎలాంటి వ్యక్తులకు మంత్రి పదవులు కట్టబెట్టారో మీరే ఆలోచించుకోవాలి. మీ మాదిరిగా కాకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఇద్దరు మాదిగలు, ముగ్గురు మాలలకు మొత్తం ఐదుమంది దళితులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
చరిత్రలో ఏనాడైనా ఇలాంటి అవకాశం రావడం జరిగిందా..? అని ప్రశ్నిస్తున్నాను. అదీకూడా మాదిగల్లో ఇద్దరు నేతలైన తానేటి వనిత గారికి హోంశాఖ, ఆదిమూలపు సురేశ్ కి మున్సిపల్‌శాఖ ఇచ్చారు. అదేవిధంగా మాల సామాజికవర్గంలో మేరుగు నాగార్జున కి సోషల్ వెల్ఫేర్, నారాయణస్వామి , పినిపే విశ్వరూప్ కి ఫోకల్శాఖలు అప్పగించారు.
ఈవిధంగా దళిత నాయకులకు కీలక పదవులిచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఎప్పుడైనా గతంలో చంద్రబాబు చేశాడా..? వారి హయాంలో ఇలాంటి పరిస్థితి సాధ్యమవుతుందను కున్నారా..? కనుక, దళిత నాయకుల రాజకీయ సాధికారత విషయంలో జగన్‌గారిని ప్రశ్నించే అర్హత, అధికారం టీడీపీ నేతలకు లేదని చెబుతున్నాను.
దళితుల ఆత్మ గౌరవం పెంచేలా పథకాలుః
వీటన్నింటితోపాటు రాష్ట్రంలో నూతనంగా అమలవుతున్న సచివాలయ వ్యవస్థను చూస్తే మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కనిపిస్తుంది. గ్రామాల్లో పల్లెల్లో ఏ చిన్న పని అవసరమైనా మండల కేంద్రాలకు పరిగెత్తుకుని వచ్చే పరిస్థితి లేకుండా.. ఈరోజు ఎక్కడ చూసినా సచివాలయ వ్యవస్థ ఇంటిగడపకొచ్చి పనిచేస్తుంది. అధికారం అనేది పెద్దవర్గాల చేతుల్లో ఉంటే, వారితో పనులు చేయించుకునే పరిస్థితి పేదవర్గాలకు ఉండదని.. పేద,బడుగు వర్గాల కాలనీల్లోనే సచివాలయాల్ని ఏర్పాటు చేశారు.
స్థానికంగానే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ ఒక్కరూ తమకు ఈ సర్టిఫికెట్ కావాలని అడగకముందే లబ్ధిదారులకు అన్ని అవసరాల్ని సచివాలయ వ్యవస్థ ద్వారా తీరుస్తున్న ఘనత జగన్ గారిది కాదా..? ఇంటికే వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమం..? ఇలాంటి విషయాల్ని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు. సమాధానం చెప్పాలి.
ఇంకా రైతుభరోసా కేంద్రాలతో రైతుల్ని, కూలీలును ఆదుకునే కార్యక్రమం జగన్‌గారు అమలు చేస్తున్న టీడీపీలో ఉన్న మాదిగలకు సంగతి తెలియదా..? ఇక, ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క దళిత నేతకైనా పార్లమెంట్ సీటిచ్చారా..? అదే మా జగన్‌గారు తనను నమ్ముకున్న అతిపేద వ్యక్తి నందిగం సురేశ్ ని బాపట్ల ఎంపీ సీటిచ్చి గెలిపించుకున్నారు. అలాంటి కీలక నిర్ణయాన్ని ఏనాడైనా బాబు తీసుకునే సాహసం చేశాడా..? అని అడుగుతున్నాను.
టీడీపీ మాదిగ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలిః
అమ్మ ఒడితో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయానికొస్తే.. దళితులకు దామాషాకు మించి వాటా దక్కుతుంది. మాదిగలకు మాదిగ కార్పొరేషన్ ద్వారా రూ.6వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చుచేయడం జరిగింది. మాదిగలు, మాలలు, రెల్లి కులస్తులకు కలిపి ఒక కార్పొరేషన్ పెట్టాలని చంద్రబాబును గతంలో అనేకమార్లు అడిగినా ఆయన నోరుమెదపలేదు.
అదే జగన్ అధికారంలోకి రాగానే ఆ కార్పొరేషన్ పెట్టి వాళ్ల వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ పెట్టడమనేది ఒక విప్లవాత్మకమైన మార్పు కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. అందువల్ల టీడీపీలో ఉన్న మాదిగ నాయకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని.. మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారని గుర్తుచేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇతర ప్రభుత్వ పెద్దల్ని అనవసరంగా ధూషిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నాను.