Suryaa.co.in

Editorial Telangana

సికింద్రాబాద్ ఎంపీ బరిలో అజారుద్దీన్?

– ముషీరాబాద్ అసెంబ్లీకి అంజన్‌కుమార్ యాదవ్?
– సికింద్రాబాద్ అసెంబ్లీకి ఆదం సంతోష్?
– సనత్‌నగర్ నుంచి అభ్యర్ధి కరవు

                                                                               ( మార్తి సుబ్రహ్మణ్యం)

రాజధాని నగరంపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలమైన అభ్యర్ధులను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్ధిగా భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిం వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ఖైరతాబాద్ వంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువ. ప్రధానంగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే విజయ నిర్ణేతలు.

ఈ సమీకరణను దృష్టిలో ఉంచుకుని అజర్‌ను ఎంపి బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అజర్ అభ్యర్ధిగా ఉంటే అటు హిందువులు, యువత ఓట్లు కూడా ఆకర్షించవచ్చన్న మరో వ్యూహం కూడా నాయకత్వ యోచనలో లేకపోలేదంటున్నారు. అజర్‌పై ముస్లిం ముద్ర లేకపోవడం కూడా, దానికి మరో కారణమంటున్నారు.

ఇక సికింద్రాబాద్ మాజీ ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్‌ను, ముషీరాబాద్ అసెంబ్లీకి బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంజన్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత, సికింద్రాబాద్ పార్లమెంటులో పెద్దగా పర్యటించిన దాఖలాలు లేవంటున్నారు. అప్పటినుంచి ఆయన నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి సారించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పైగా ముషీరాబాద్‌లో బలమైన కాంగ్రెస్ నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అంటున్నారు. ఈ కోణంలోనే అంజన్‌కుమార్‌ను అసెంబ్లీకి మార్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. అయితే అక్కడి నుంచి అంజన్ తనయుడు ప్రయత్నిస్తున్నప్పటికీ, అంజన్ మాత్రమే సరైన అభ్యర్ధి అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సికింద్రాబాద్ అసెంబ్లీకి రైల్వే కార్మికుల కుటుంబాలతో సత్సంబధాలున్న మున్నూరుకాపు నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆదం సంతోష్‌కుమార్‌కు టికెట్ ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన పీసీసీ మాజీ చీఫ్ వి.హన్మంతరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతునిస్తున్నారు. సంతోష్ సుదీర్ఘకాలం నుంచీ పార్టీలో పనిచేస్తున్నా, ఇప్పటిదాకా టికెట్ దక్కలేదు.

సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగులతో ఆదం సంతోష్‌కుమార్‌కు సత్సంబంధాలు ఉండటం, ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉండటం కూడా ఆయనకు ప్లస్‌పాయింట్‌గా కనిపిస్తోంది. నిజానికి ఆదం సంతోష్‌కుమార్ చాలాకాలం నుంచి, నియోజకవర్గంలో గ్రౌండ్‌వర్క్ చేసుకుంటున్నారు.

సీనియర్ నేత నోముల ప్రకాష్ గౌడ్ ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి, రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు మాజీ ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్ మద్దతునిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. టికెట్ల వ్యవహారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్నాటక ఫార్ములా’ను అనుసరిస్తున్నందున, అంజన్ సిపార్సు పనిచేయడం కష్టమేనంటున్నారు.

ఇక సనత్‌నగర్‌లో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మున్నూరు కాపు వర్గానికి చెందిన శీలం ప్రభాకర్ ఉన్నప్పటికీ, ఆయన పెద్దగా పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఆయన తండ్రి శీలం రాందాస్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓటర్ల సంఖ్య ఎక్కువ.

అయితే డాక్టర్ రవీందర్‌గౌడ్ కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో, సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను ఢీటొట్టే స్థాయిలో.. కాంగ్రెస్‌కు సరైన అభ్యర్ధి లేకుండా పోయారు. బహుశా ఇక్కడ బయట నుంచి ఎవరినైనా బరిలో దింపవచ్చంటున్నారు.

 

LEAVE A RESPONSE