– ప్రమాదంలో వీఐపీల ‘భద్రత’
– ఏపీలో విపక్షాలపై పోలీసుల పక్షపాతం ఆరోపణలు
– మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్లు
– చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయం
-తాజాగా పవన్ ఇప్పటం పర్యటనలోనూ పోలీసుల ఆంక్షలు
– మొన్న పవన్ కల్యాణ్‌కు విశాఖలో ఆటంకాలు
– గతంలోనూ పవన్‌పై అమరావతిలో ఆంక్షలు
– గతంలో కూడా బాబు కాన్వాయ్‌పై రాళ్లు
– ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి యత్నం
– డీజీపీ ఆఫీసు పక్కనే టీడీపీ ఆఫీసు విధ్వంసం
– కుప్పంలోనూ బాబు పర్యటనలకు ఆటంకాలు
– రిషికొండకు వెళ్లకుండా సీపీఐ నారాయణకు అడ్డంకులు
– పరామర్శ, పర్యటనలకూ అనుమతి కావాలా?
– కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుంటున్న దుస్థితి
– సొంత నియోజకవర్గానికి వెళ్లలేని ఎంపీ రఘురామకృష్ణంరాజు
– కేసుల భయంతో ఢిల్లీలోనే నర్సాపురం ఎంపీ
– పెద్దల భద్రతపై ‘నిఘా’ నిద్రపోతోందా?
– ముందస్తు సమాచారం లేదా?
– వీవీఐపీలకు భద్రతా ఇలాగేనా?
– దుర్ఘటన జరిగితే బాధ్యులెవరు?
– పోలీసుల తీరుపై పెరుగుతున్న విమర్శలు
– ఖాకీల తీరుపై విపక్షాల కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో ‘పోలీస్‌రాజ్’పై విపక్షాల ఆందోళన పెరుగుతోంది. వీవీఐపీలతో పాటు, విపక్ష నేతలకు ఇస్తున్న భద్రత ప్రమాదంలో పడుతోంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నేతల రక్షణకే దిక్కులేని దుస్థితి. విపక్ష నేతలు ఏదైనా ప్రాంతాన్ని పరిశీలించాలన్నా-పరామర్శించాలన్నా అడుగడుగునా ఆటంకాలు. అమరావతి రైతుల పాదయాత్ర నుంచి.. రుషికొండ సందర్శన, పవన్ ఇప్పటం గ్రామ సందర్శన వరకూఅడుగడుగునా ఆటంకాలే. చివరాఖరకు కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు నుంచి పవన్ కల్యాణ్ వరకూ, అందరి దయనీయం ఇదే. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న.. మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై దుండగులు, వందలమంది ఖాకీదండు సాక్షిగా రాళ్లేసిన తెంపరితనం. ఫలితంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాయాలపాలయిన విషాదం. అయినా ఎవరిపైనా చర్యలు లేవు.
డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఒక పార్టీ ఆఫీసుపై.. అధికార పార్టీ కార్యకర్తలు, విధ్వంసం చేసి స్వైరవిహారం సృష్టిస్తే, చర్యలు తీసుకోలేక చేతులెత్తేసిన దారుణ వైఫల్యం. ఒక పార్లమెంటు సభ్యుడు నెలల తరబడి, సొంత నియోజకవర్గానికి వెళ్లలేని భయాందోళన. ఎక్కడ కొత్త కేసులు బనాయిస్తారోనన్న భయంతో సదరు ఎంపీ, ఢిల్లీలోనే తలదాచుకుంటున్న దురదృష్టకర పరిస్థితి. హైదరాబాద్‌కు వచ్చినా ఆయనను వెంటాడుతున్న వైచిత్రి.
ఈ అత్యుత్సాహంపై లెక్కలేనన్ని సార్లు డీజీపీని స్వయంగా కోర్టుకు పిలిచి, అక్షింతలు వేసినా మారని తీరు. సీఐడీ తీరుపై జడ్జిలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా, అదే బేఖాతరిజం. ఇదీ.. ఏపీలో పోలీసుల ‘సమర్ధ నిర్వహణ’. ఇదీ.. ఏపీలో, ప్రజాస్వామ్యం ‘పరిఢవిల్లుతున్న’ వైనం!
ఏపీలో సెక్యూరిటీ ‘డేంజర్‌జోన్’లో పడింది. వీవీఐపీల రక్షణే ప్రమాదంలో పడిన దారుణ ఘటనలు. అది పరిపాటిగా మారిన వైనం, పోలీసుల పరితీరును విమర్శలకు గురిచేస్తున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజా కృష్ణా జిల్లా పర్యటనలో.. ఆయనపై రాళ్లేసిన దుండుగునిబరితెగింపు, పోలీసుల వైఫల్యానికి పరాకాష్ఠగా నిలిచింది. చంద్రబాబు రోడ్‌షోపై రాళ్లేసిన దుండగుని ఉన్మాదానికి, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడిన వైనం, ఆ సందర్భంలో లైట్లు తీసేసిన తీరు ఏపీలో ప్రముఖుల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. విపక్ష నేత చంద్రబాబుకు కేంద్రం ఇటీవల జడ్ ప్లస్ భద్రత పెంచినప్పటికీ, ఏపీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్న దానికి, కృష్ణా జిల్లా ఘటనే నిలువెత్తు నిదర్శనం.
రెండేళ్ల నుంచి ఏపీలో విపక్షనేతల నుంచి.. సామాజిక ఉద్యమకారులు, సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టే నెటిజన్ల వరకూ, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా సీఐడీ దూకుడుపై కోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా, ఏమాత్రం మార్పు రాని ధిక్కారధోరణి. ఇది ఏమాత్రం మంచిదికాదన్నది ప్రజాస్వామ్య ప్రియుల ఆవేదన. చివరకు వృద్ధులపైనా సీఐడీ కేసుల కొరడా ఝళిపించడం.. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి చెరబడుతున్న దుష్ట సంప్రదాయం, ఏపీ పోలీసు వ్యవస్థకే మాయనిమచ్చగా ప్రజాస్వామ్యవాదులు అభివర్ణిస్తున్నారు.
సీఎం జగన్- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య చెలరేగిన వ్యక్తిగత మనస్పర్ధలు.. ఎంపీని ఆయన నియోజకవర్గంలో నెలల తరబడి, అడుగుపెట్టనీయని పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా వ్యక్తుల మధ్య ఉండే విరోధాలకు, పోలీసులు అతీతంగా వ్యవహరించాలి. రాజకీయ నాయకత్వాలు తీసుకునే నిర్ణయాలకు, పోలీసుల నిర్ణయాలకు తేడా ఉండి తీరాలి.
కానీ ఏపీ పోలీసులు అచంచెల రాజభక్తితో పనిచేస్తున్నారన్న విమర్శలు, అటు మానవహక్కుల సంఘాల నుంచీ వినిపిస్తున్నాయి. ఎంపీ రాజును హైదరాబాద్‌లో చెరబట్టి, సీఐడీ ఆఫీసులో కొట్టిన వైనం.. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, లోక్‌సభ స్పీకర్, జాతీయ మానవహక్కుల సంఘం, సుప్రీంకోర్టు వరకూ వెళ్లిందంటే.. ‘ఏపీ పోలీసుల ప్రతిష్ఠ’ ఏ స్థాయిలో విస్తరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సీఐడీ చీఫ్ సునీల్‌పై, ఎంపీ రాజు అన్ని వేదికలపైనా పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, విపక్షంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల బృందం అనేక ప్రాంతాల్లో నిజనిర్ధారణ నిర్వహించింది. ఓబులాపురం మైనింగ్ అక్రమాలపై, మీడియా బృందాన్ని తీసుకువెళ్లింది. అప్పుడు వైఎస్ సర్కారు వారికి ఎలాంటి అడ్డంకులు కల్పించలేదు. మరోసారి ఏపీ పోలీసులకు చిక్కకుండా, టీడీపీ ఎమ్మెల్యేల బృందం ఓబులాపురం వెళ్లింది.
ఎన్‌కౌంటర్లలో హతులైన నక్సల్స్, అత్యాచార బాధితుల వద్దకు విపక్షాలు-మానవహక్కుల సంఘాలు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండేది. కాంగ్రెస్-టీడీపీ హయాంలో జరిగిన కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, కంచికచర్ల ఘటనల సమయంలో.. నాటి విపక్షాలు స్వేచ్ఛగా అక్కడికి వెళ్లాయి. ఆ సందర్భంలో బాధితులను పరామర్శించిన విషయాన్ని, రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు అలాంటి ప్రజాస్వామిక లక్షణాలు.. ఏపీలో భూతద్దం వేసినా కనిపించడం లేదన్న ఆవేదన, ప్రజాస్వామ్యవాదుల్లో వ్యక్తమవుతోంది. రిషికొండను అక్రమంగా తవ్వేస్తున్నారన్న ఆరోపణలు, విపక్షాలను అటువైపు వెళ్లేందుకు ప్రేరేపించాయి. అయితే దానిని పరిశీలించకుండా పోలీసులు వేసిన ఆంక్షల కంచె, విమర్శలకు గురవుతోంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను మధ్యలోనే అడ్డుకోగా, పలు పార్టీ నేతల ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించారు.
చివరకు హైకోర్టు కూడా రిషికొండ అక్రమాలను ప్రశ్నించింది. మూడు ఎకరాలు నిబంధనలు అతిక్రమించి, అదనంగా తవ్వామని ప్రభుత్వం కోర్టులో అంగీకరించాల్సి వచ్చింది. అంటే ఆ అక్రమాలను ఎవరూ అడ్డుకోకుండా-పరిశీలించకుండా.. పోలీసులే, సర్కారుకు రక్షణకవచం కల్పిస్తున్నారన్నది స్పష్టమయింది. రిషికొండలో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు, ‘పోలీసుల ఆంక్షల కంచె’ సహజంగానే మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
ఇక విపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌పై, గౌతం సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు దాడి జరిగింది. ఇటీవల ఆయన కుప్పం పర్యటనలపైనా దాడి చేశారు. చంద్రబాబు నివాసంపై.. నాటి ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికిప్రయత్నించిన సందర్భంలో, పోలీసులు చంద్రబాబు ఇంటి కే గేట్లకు తాళ్లు వేసిన వైచిత్రి. చివరకు డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్న, టీడీపీ ఆఫీసుపైనే అధికారపార్టీ దళాలు విధ్వంసానికి తెగబడ్డాయి.
తాజాగా కృష్ణా జిల్లాలో.. చంద్రబాబు రోడ్‌షోపై రాళ్లేసిన సందర్భంలో, ఆయన సీఎస్‌ఓ గాయపడ్డారు. చంద్రబాబు మాజీ సీఎం మాత్రమే కాదు. జడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న కీలక నేత. కుప్పంలో ఆయనపై దాడి జరిగిన సమయంలోనే, కేంద్రం బాబుకు భద్రత పెంచింది. అయినా మళ్లీ రాళ్ల దాడి జరిగిందంటే, నిఘా విభాగం నిద్రపోతోందన్న విమర్శలు రావడం సహజం. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న నేత పర్యటనపై, నిఘా దళానికి ఎలాంటి ముందస్తు అంచనా లేకపోవడం ఆశ్చర్యమే. కేంద్ర భద్రత ఉన్న నేత రక్షణకే దిక్కు లేకపోతే, ఇక సామాన్యుల సంగతేమిటన్న ఆందోళన రావడం సహజం.
అటు జనసేనాధిపతి పవన్‌కూ, ఏపీలో భద్రత కరువయింది. తాజాగా ఆయన ఇప్పటం గ్రామ పర్యటనలోనూ, పోలీసు ఆంక్షలు విమర్శలకు దారితీశాయి. కారులో వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డగించడంతో, పవన్ కారు దిగి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళగిరిలోని జనసేనఆఫీసు నుంచి, ఇప్పటం వరకూ పవన్ పర్యటనకు పోలీసుల అడ్డంకులపై ఆగ్రహం వ్యక్తమయింది. గతంలో అమరావతి వెళ్లిన పవన్‌ను, ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవలి ఆయన విశాఖ పర్యటన, పోలీసు ఆంక్షల నడుమే ముగిసింది. కారు టాప్‌పైకి ఎక్కవద్దని ఒత్తిడి చేయడం నుంచి.. హోటల్ నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసేవరకూ సాగిన పోలీసుల అత్సుత్సాహం, వారిని విమర్శల పాలుచేసింది.
ఒకప్పుడు తమ అద్భుత పనితీరుతో, దేశాన్ని తన వైపు ఆకర్షించిన ఏపీ పోలీసు వ్యవస్థ.. ఇప్పుడు తన వైఫల్యాలతో, దేశాన్ని ఆకర్షిస్తోందన్న వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. పార్టీలుఅధికారంలోకి వస్తాయి. పోతాయి. కానీ పోలీసు వ్యవస్థ శాశ్వతం. అధికారంలో ఉన్న పార్టీలే విపక్షంలోకి మారితే, అవి పోలీసులను తూర్పారపడతాయి. విపక్షం నుంచి అధికారపక్షంలోకి వచ్చిన పార్టీలు, అదే పోలీసులను ఆకాశానికెత్తుతాయి. ఈ తత్వం తెలుసుకోవడం ప్రతి పోలీసు కర్తవ్యం.
కొట్టుకోండి.. తిట్టుకోండి.. చంపుకోండి.. అరెస్ట్ చేసుకోండి.. – జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan#JanaSenaWithIppatam pic.twitter.com/rVAgNdgqZr
— JanaSena Party (@JanaSenaParty) November 5, 2022
Idem Attitude anna 🥵🔥🙏#JanaSenaWithIppatam @PawanKalyan pic.twitter.com/C7CVOjlcsX
— ѕυииуραωαиιѕт ツ (@SunnyPawanist) November 5, 2022