– మంత్రి కొడాలి నానిని కలిసి నిర్వాసితుల వినతి
– కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని
గుడివాడ, నవంబర్ 2: ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఇళ్ళను మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను పలువురు నిర్వాసితులు కోరారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి సమీపంలోని రోడ్డు మార్జిన్ స్థలంలో ఇళ్ళు నిర్మించుకుని నివాసం ఉంటున్న నిర్వాసితులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ళను వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఉన్నట్టుండి ఖాళీ చేయాలని అనడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదని వాపోయారు. దీనిపై మంత్రి కొడాలి నాని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు. నిర్వాసితులకు ప్రత్నామ్నాయంగా ప్రభుత్వ స్థలాలు మంజూరయ్యాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.