మంత్రి కొడాలి నానిని కలిసిన తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతలు

– డిజిటల్ తెర సంఘాలు ఏర్పాటు కాకుండా చూడాలని వినతి
గుడివాడ, నవంబర్ 2: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ జీ శ్యామ్ బాబు, కోఆర్డినేటర్ ఎం సువర్ణబాబు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు జీ కృపాసాగర్, గుడివాడ పట్టణ పాస్టర్స్ అధ్యక్షుడు జీ యేహేజ్కేలు, పాస్టర్ రత్నకర్, పాస్టర్ స్టీవెన్ తదితరులు పలు సమస్యలను మంత్రి కొడాలి నానికి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కల్వరి టెంపుల్ సంఘ కాపరి సతీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పలు పట్టణాల్లో డిజిటల్ తెరను ఉపయోగించి సంఘాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కావలి, కర్నూలు, నంబూరు, నంధ్యాల తదితర పట్టణాల్లో ప్రారంభమయ్యాయన్నారు. వీటివల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సంఘ కాపరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొన్ని సంఘాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళి మూతబడ్డాయన్నారు. ఈ డిజిటల్ తెర సంఘాలకు వ్యతిరేకంగా తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి సేవకులు, సంఘాలను చైతన్యపరుస్తున్నామని చెప్పారు.
గుడివాడ పట్టణంలోని ఒక రైస్ మిల్లును కొనుగోలు చేసి ఈ నెల 3 వ తేదీన ప్రారంభించడం జరుగుతోందన్నారు. డిజిటల్ తెరలను ఉపయోగించి సంఘాలను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇది పరిశుద్ధ బైబిల్ కు వ్యతిరేకమని, ప్రత్యక్ష క్రైస్తవ సంఘాల ఉనికికి ప్రమాదకరమన్నారు. డిజిటల్ తెర సంఘాల వల్ల క్రైస్తవ సంఘాల విశ్వాసుల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. గత 2 వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న క్రైస్తవ సాంప్రదాయాలను డిజిటల్ తెర సంఘాలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయన్నారు. క్రైస్తవ విశ్వాసులను ప్రలోభ పెట్టి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో అనేక సంఘాలు మూతబడడంతో పాటు ఆయా సంఘాల పాస్టర్లు ఉపాధిని కోల్పోతారన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని డిజిటల్ తెర సంఘాలు ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు. అలాగే గుడివాడలో ప్రారంభించే డిజిటల్ చర్చిని నిలుపుదల చేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతల వినతిపై మంత్రి కొడాలి నాని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి నాయకులు మంత్రి కొడాలి నానికి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వెంపటి సైమన్ పాల్గొన్నారు.

Leave a Reply