Suryaa.co.in

Entertainment

వెన్నెల నడిచొచ్చిన వేళ..!

కథగా కల్పనగా కనిపించెను
నాకొక దొరసాని..

సిరిమల్లె పూవా..
సిరిమల్లె పూవా..
చిన్నారి చిలకమ్మా..

జాము రాతిరి జాబిలమ్మ
జాగు చేయకే ఇలా..

అందాలలో అహో మహోదయం..
భూలోకమే నవోదయం..
పువ్వు నవ్వు పులకించే
గాలిలో..నింగి నేలా
చుంబించే లాలిలో..

సమ్మోహనంగా
దివి నుంచి దిగివచ్చిన
అతిలోకసుందరి..
ఒకనాటి నీ..నా..
కలల రాణి..
మన మొహబ్బత్ కి
తొలినాటి బోణీ..
వెండితెర పూ’బోని’..
సురుచిర సుందర వాణి..!

శ్రీదేవి..పూలతావి..
ముద్దులొలికే
అందమైన మోవి..
బూచాడమ్మా బూచాడు..
బుల్లి పెట్టెలో ఉన్నాడు..
ఆనాటి బడిపంతులు మనుమరాలు..
ఆకు చాటు పిందె తడిసె
కోక మాటు పువ్వు తడిసె
ఆకాశ గంగొచ్చింది..
అందాల ముంచెత్తింది
నిన్నటి జాబిల్లి
వేటగాడి ప్రియురాలు..
అదే ముద్దుల మోము..
శ్రీదేవి రెండు తరాల
హీరోలకి గారాము!

అంతటి ఎన్టీఆరే
1980 వరకు ఇట్టాంటి
ఓ పిల్ల నా కంట పడలేదు..
పడినా నే వెంట పడలేదు..
అని మురిసిపోలేదా బంగారక్కని..శ్రింగారక్కని
చూసి..మురిసి..!

తారలు దిగివచ్చిన వేళ..
వెన్నెల నడిచొచ్చిన వేళ
అక్కినేని చేసేసాడు ప్రేమాభిషేకం..

టాలీవుడ్డుని జాలీగా చుట్టేసి
బాలీవుడ్డులో హిట్టుల
‘బోనీ’ కొట్టి..

కోలీవుడ్డులో
కోకిలమ్మలా కూసిన
చాందినీ..
ఊపేసిన నగీనా..

అమ్మ బ్రహ్మదేవుడో
కొంప ముంచినావురో..
పూలరెక్కలు..
కొన్ని తేనె చుక్కలు
రంగరిస్తివో..
ఇలా బొమ్మ చేస్తివో..
అసలు భూలోకం
ఇలాంటి సిరి చూసి ఉంటదా!

అలాంటి అందాల సుందరి..
ఇంద్రకుమారి..
ముంబైకి వెళ్లిపోతేనే బెంగెట్టుకున్న
నాటి కుర్రాళ్ళు..
అక్కడ బోనీని చేసుకుందేంట్రా అని కలవరపడిపోతే..
బంగారక్క మరణం
మరీ విషాదం..
నీళ్ళ తోటలో శవమై పడి ఉంటే గింజుకుపోయింది
ప్రతి హృదయం..
మరచిపోలేక
ఆమె అభినయం..!

కనురెప్పలు పడ్డప్పుడు
కల కళ్ళపడదుగా
కనుకిప్పుడు ఎదరున్నది
కలైపోదుగా

ఇంద్రకుమారైనా ఇంత అందంగుంటదా..
హీరోయినంటే
అంత సొగసు ఉట్టిపడతదా..
అందమే శ్రీదేవిగా పుట్టిందా..
అభినయమే అలా సొగసులద్దుకుని
వెండితెరపై వెలుగులు
విరజిమ్మిందా..
క్షణక్షణంలో అమాయక బ్యాంకు పాప..
ఆఖరిపోరాటం ప్రవల్లిక..
ఒక కల..వసంతకోకిల..
ఓ ఎర్ర గులాబీ విరిసింది
తొలిసారి నినుకోరి…
స్వర్గం వెలిసింది భువిలో..

శ్రీదేవి..
ఒక కల..ఒక కళ…
ఒక వల..ఒక వెన్నెల..
ఒక మెరుపు..ఒక విరుపు..
భారతీయ చలనచిత్ర యవనికపై మెరిసిన మరీచిక..!

శ్రీదేవి
అద్భుతలోకం నుంచి జారిపడ్డ ఇంద్రజ..
అల నీలి గగనంలో
వెన్నెలలా మెరిసి..
తారగా తళుక్కుమని..
లక్ష్మీదేవి స్వహస్తాలతో
రాసి ఇచ్చిన పత్రం..
ఎప్పటికీ మనతోనే ఉండిపోయే చైత్రం..
చిత్రం..ఆమె ప్రతి చిత్రం..!

శ్రీదేవి
వలపు వసంతం…
అందం ఆమె సొంతం..
అరుదుగా ఉద్భవించే
ఓ అద్భుతం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE