రావు గోపాలరావూ తిరిగిరావూ..

అల్లో..అల్లో..అల్లో..
ఈ ఒక్కమాటతో వేసేసావయ్యా
తెలుగునాట ముత్యాలముగ్గు..
కిక్కిచ్చే నీ డవిలాగుల పెగ్గు..
ఆకాశం ఎర్రగా ఉంటే అక్కడ మర్డర్ జరిగినట్టు కాదు..
నువ్వు కన్నప్పలో
కైలాసనాథ శాస్త్రిగా
శివుడితో మాటాడుతూ రౌద్రారూపం
దాల్చి అక్కడ నిల్చున్నట్టు..
శివశివ అననేలరా అంటూనే శివాలెత్తించేశావు కదయ్యా..
ఫ్రెంచి మీసకట్టు..
చిత్రమైన పంచికట్టు..
రెండుగా విడిపోయిన తలకట్టు..
సరికొత్త విలనీతో
చేశావు కదా కనికట్టు..!

దుర్మార్గంలో పాలిష్..
మల్లెపూవులో తేల్ మాలిష్..
ఇక వేటగాడులో ప్రాస..
మార్చేసింది నీ దశ..
తెలుగు విలన్ల దిశ..
ఎన్టీఆర్ పై రివెంజ్..
చిరంజీవితో ఛాలెంజ్..
కృష్ణపై వజ్రాయుధం..
మనఊరిపాండవులతో
అభినయ కురుక్షేత్రం..
నీ కామెడీకీ ఇవ్వొచ్చు కదయ్యా
వేయిపేజీల సన్మానపత్రం..!
ఎంత అందమైన
బొమ్మలను దింపినా బాపు
నువ్వుంటేనే
ఆయన బొమ్మలు
టాపు లేపు..!

నీ నటనను మెచ్చె ఎస్వీఆర్..
నీ నిజాయితీని నచ్చె ఎన్టీఆర్..
నీకు జత కలిస్తే అల్లు
తెలుగు ప్రేక్షకులకు భలే త్రిల్లు
థియేటర్లు గొల్లు గొల్లు..
నిర్మాతలకు కాసుల జల్లు..!

నీకు ముందు నాగభూషణం
అచ్చం నీలాంటిదే ఆయన
పాత్ర పోషణం…
నీ తర్వాత కోట
పట్టినాడు నీ బాట..
అయినా నీ స్థానం ప్రత్యేకం..!

రౌద్రానికి..హాస్యానికి…
మంచి బాబాయ్ పాత్రలకి నువ్వే అసలైన వాచకం..
కళాప్రపూర్ణా..
నీది నటవిరాట్ రూపే
కొన్ని పాత్రల పోషణలో
ఎంతటి వారైనా నీ ముందు దిగదుడుపే..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
విజయనగరం

Leave a Reply