Suryaa.co.in

Entertainment

హీరోగా ఓడాడు..మనిషిగా గెలిచాడు..కవిగా నిలిచాడు..

అతగాడిలో..
టాలెంటు లేదా..
అది ఒంట్లో కరెంటులా
ప్రవహించేది..
రూపంలో లోపమా..
పంతులమ్మనే పడేసిన
అందం..
స్వరం..అబ్బో అది
మండే భాస్వరం..
మరి ఒడ్డూ పొడుగు..
మనిషే ఆరడుగులు..
మరి ఒత్తలేదేమో
కొందరి అడుగులకు మడుగులు..!

ఔను..రంగనాథ్..
నిండైన విగ్రహం..
నటనలో నిగ్రహం..
లేనే లేదే అహం..
శ్రమించాడు అహరహం..!
అయినా అక్కడే ఆగిపోయాడెందుకో..!?

సాంఘికాలు..జానపదాలు..
చారిత్రకాలు..పౌరాణికాలు..
ఎన్ని చేసినా అక్కడే..
అమెరికా అమ్మాయిలో
దీపతో డ్యాన్సులు కట్టాడు..
పంతులమ్మ లక్ష్మిని పట్టాడు
జమీందారు గారి అమ్మాయి
శారద కళ్ళూ
ఇతగాడిపై పడ్డాయి..
మదనమంజరిలో
జయమాలినీని ట్రై చేశాడు..
అయినా అక్కడే ఆగిపోయాడు..అదెందుకో!?

తొలుత టికెట్ కలెక్టరై..
పిదప యాక్టరై..
నాయకుడై..ప్రతినాయకుడై..
క్యారెక్టర్ ఆర్టిస్టై..డైరక్టరై..
రాజమౌళి కొండయ్యగా
టివిలోనూ ఠీవిగా ఒక చెయ్యి
అక్కడా లేక పైచెయ్యి..
రిటైర్ కాకమునుపే
టైరైపోయాడు రంగనాథుడు
ఆరడుగుల అందగాడు!

నిజజీవితంలో నాయకుడు..
ఈ ఆదర్శపతిదేవుడు..
రామయ్య చేస్తే
పద్నాలుగేళ్ల వనవాసం..
రంగయ్య చేశాడు
పద్నాలుగేళ్ల సతి’సేవా’సం..
మంచాన పడిన ఇల్లాలికి
తానే తండ్రి అయ్యాడీ
రామయ్య తండ్రి..
దాంపత్యానికి అర్థం చెప్పి
తన ఇంటినే
ఇంటింటి రామాయణం చేసిన మానవతామూర్తి..!

అన్నట్టు రంగనాథ్
‘అంతరంగ మధనం’
విరజిమ్మింది అతడిలోని
కవి ‘పదపరిమళం’..
ఆ నటుడిలోని
ఆవేదనకు ఎన్నో కవితారూపాలు..
అతడి ప్రతిభకు
‘అక్షర సాక్ష్యం’…
అచ్చయిన ఆయన రచనలు!
‘చీకటి తొలగాలి’ అన్న కవి
జీవితంలో ముసిరిన
చీకట్లు తట్టుకోలేక
బ్రతుకు విషాద గీతమై
ఆత్మహత్యతో చరమగీతం
పాడుకున్నాడు..
పోరాడి అలసిన నటుడు
మృత్యుదేవత ఒడిలో
హాయిగా నిదురించాడు..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE