రాజ్య‌స‌భ ప్యానెల్ వైస్ ఛైర్మ‌న్ గా విజయసాయిరెడ్డి

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ అధినేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌యసాయి రెడ్డికి అరుదైన అవ‌కాశం ల‌భించింది. రాజ్య‌స‌భ వైస్ ఛైర్మ‌న్ల ప్యానెల్ కు ఆయ‌న ఎంపిక‌య్యారు. త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌బోతోన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు ఆయ‌న‌కు ఈ అవ‌కాశాన్ని క‌ల్పించారు.

ప్యానెల్ వైస్ ఛైర్మ‌న్ల జాబితాను ఆయ‌న పునఃస‌మీక్షించారు.ప‌లువురు కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. ఇందులో- రాజ్య‌స‌భ‌లో వైఎస్ఆర్సీపీ స‌భా ప‌క్ష నాయ‌కుడు విజ‌య‌సాయి రెడ్డి పేరును చేర్చారు. ఆయ‌న‌తో పాటు ఈ అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న వారిలో మ‌రి కొంత‌మంది ఉన్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భకు ఎన్నికైన భార‌తీయ జ‌న‌తా పార్టీ సభ్యురాలు ఇందుబాల గోస్వామి, అస్సాంకు చెందిన భువ‌నేశ్వ‌ర్ క‌లిఠా, క‌ర్ణాట‌క నుంచి ఎన్నికైన కాంగ్రెస్ స‌భ్యుడు హ‌నుమంత‌య్య ఉన్నారు.

త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న డీఎంకే స‌భ్యుడు తిరుచ్చి శివ‌, ఒడిశా నుంచి బిజూ జ‌న‌తాద‌ళ్ స‌భ్యుడు సుస్మిత్ పాత్రోను కొన‌సాగించారు. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యురాలు వంద‌నా చ‌వాన్, టీఎంసీకి చెందిన సుఖేందు శేఖ‌ర్ రాయ్ ల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌లేదు. వారిని ఈ ప్యానెల్ జాబితా నుంచి త‌ప్పించారు. వారిద్ద‌రి స్థానంలో కొత్త‌గా వీ విజ‌య‌సాయి రెడ్డి ఇందుబాల గోస్వామికి ఛాన్స్ ఇచ్చారు వెంక‌య్య నాయుడు. రాజ్య‌స‌భ ఛైర్మ‌న్, డిప్యూటీ ఛైర్మ‌న్ అందుబాటులో లేన‌ప్పుడు ఈ ప్యానెల్ స‌భ్యులు స‌భ‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఛైర్మ‌న్ స్థానంలో కూర్చుని స‌భను నిర్వ‌హించాల్సిన బాధ్య‌త ప్యానెల్ వైస్ ఛైర్మ‌న్ల‌కు ఉంటుంది. విజయ‌సాయి రెడ్డి తొలిసారిగా ప్యానెల‌ వైస్ ఛైర్మ‌న్ గా ఎన్నిక‌య్యారు. లోక్ స‌భ‌లో వైఎస్సార్సీపీకే చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీక‌ర్ గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply