ఆ పాత్రలు వంగరకే చెల్లు!

0
38

పంతులు..మాస్టారు..
మంత్రి..గుమాస్తా..
ఇలాంటి పాత్రలకు
పెట్టింది పేరు..
వంగర..
వంద సినిమాల్లో
ఆయన రీళ్లు
ఈ తరహా పాత్రలతోనే
తిరిగిపోయాయి గరగర..!

మాయాబజార్లో శాస్త్రి..
శర్మ అల్లుతో జత కట్టి
కత నడిపిన మేస్త్రి..
ఈ శాస్త్రి..శర్మ ద్వయం..
కురురాజు పెళ్లి బృందంలో
పుష్పం..తోయం..
ఆడపెళ్లి వారిని ఆటపట్టించబోయి
అభాసుపాలైన జంట..
కవచ విధి కవచ విధి..
పరమం పవిత్రం..
రక్షైక రక్షైక శుభశంఖు చక్రం..
ఈ ఇద్దరి బుద్దే వక్రం..!

తొలినాళ్ళ విప్రనారాయణతో
మొదలైన నటయాత్ర
ఎక్కువగా పిలకతోనే
సాగిన పాత్ర..
ఆ పంతులు గెటప్పులోనే
శ్రీకృష్ణపాండవీయంలో
నల్లనయ్య కడకు
ప్రేమసందేశంతో వెళ్లి
రుక్మిణిగా కనిపించి
పడేశాడు..
కృష్ణా యదుభూషణా అంటూ..!

జగదేకవీరునికథలో
పాత మంత్రి…
త్రిశోక మహారాజు
రాజనాలను నచ్చని
హితవచనాలతో
విసిగించిన వృద్ధుడు..
ఉప్పు తిన్న వాణ్ణి అని..
ఉప్పేం ఖర్మ
అంత జీతం ఇస్తుంటే..
పంచదారే తినండని విసుక్కున్నా సలహాలు మానని చక్కని నటన..
వంగరకే చెల్లిన
వంకర లేని
అభినయం..
ఏ పాత్ర దొరికినా
చేశాడు న్యాయం..!

సురేష్ కుమార్ ఇ
9948546286