Suryaa.co.in

Entertainment

చిరంజీవీ..చిరంజీవ..!

సినిమా డాన్సుకి
ఒక కొత్త భంగిమ..
నటనకు సరికొత్త రూపు..
అది కొంచెం రఫ్ఫు..
మేనరిజానికి_
కొంగొత్త నిర్వచనం..
హీరోయిజానికి ఏకవచనం..
మానవత్వానికి బహువచనం..
తెలుగు సినిమా ముఠామేస్త్రి..
స్వయంకృషి మాత్రమే
తెలిసిన నటరుషి..
అభిమానుల ఆపద్భాందవుడు
నటకుటుంబ గాంగ్ లీడర్..
మొత్తం చిత్రపరిశ్రమకే
నవయుగ గాడ్ ఫాదర్..!

ఇంత చెప్పాక ఇంకా ఆయన పరిచయం అవసరమా..
తెలుసుకోడానికి
అంత ఆత్రమా..
ఓ మిత్రమా…
ఎంబీబీఎస్ చదవని
శంకర్ దాదా..
అతిలోకసుందరి ఉంగరం కొట్టేసి వరించిన జగదేకవీరుడు
మామా అంటూ
అసలైన మామ అల్లుని..
లింగం మాయా అంటూ
పరేష్ రావల్ ను ఆటపట్టించిన
ఘరానా మొగుడు..
అల్లు వారమ్మాయిని మనువాడి మొత్తం ఇండస్ట్రీలోని పెద్దలందరికీ
జామాతగా మారిన
మెకానిక్ అల్లుడు..
కోట్లాది మంది అభిమానాన్ని మూటకటూకున్న ధన్యజీవి
మెగాస్టార్ చిరంజీవి!

ఒక హీరోకి ఇంత క్రేజా..
అతడు ఒక్క
స్టెప్పేస్తే ఈలలా..
ధియేటర్లలో అంత గోలా..
అభిమానుల్లో అంత హర్షమా..
నిర్మాతలకు కనకవర్షమా..
టాలీవుడ్ లో నలుగురు అగ్రనటుల హవా నడుమ
వచ్చిన శిఖరాగ్రనటుడు..
నిలదొక్కుకోవడమే కష్టం..
కానీ అతడు కదం తొక్కాడు..
ఖైదీతో ఇక పరిశ్రమ
నాదేనన్న జిహాదీ…
జనాల హృదయాల్లో బందీ..
రికార్డులతో మార్చేశాడు
తెలుగు పరిశ్రమ జమాబందీ!

నటుల పరంగా అతడిది
మెగా ఫ్యామిలీ..
అభిమానుల్ని కలిపితే
వసుధైక కుటుంబం..
నటనలో ఆయన పీజీ..
చరిత్రలో ఆయనకో పేజీ..
అక్కినేని తనకు తానుగా
చెప్పుకున్నట్టు స్టెప్పులకు
ఆయన మూలం..
చిరంజీవిది “ఇంద్ర”జాలం..
సేవకు మేస్త్రీ..
మొత్తంగా ఆయనే
ఒక ఇండస్ట్రీ..
జనహృదయ విజేత..
పవర్ స్టార్ కి ప్రియభ్రాత..
అల్లు వారి జామాత..
ఒకనాటి మాస్టర్..
ఏం చేసినా ఔరా అనిపించుకునే ఆర్య..
నిన్నటి ఆచార్య..!

శ్రీదేవికి తీయని దెబ్బ ఇచ్చి..
విజయశాంతికి
వానా వానా వెల్లువ చేసి…
రాధతో శుభలేఖ రాసుకున్నా..
రాధికను నవ్వే మల్లె చెండుగా మార్చినా..
శోభనను చిలుకా క్షేమమా
అని కుశలం అడిగినా..
ఆ తీరే వేరు..చిరుకే చెల్లు..!

ఆయన గూండా..
హిట్టుకు పచ్చజెండా…
సేవే అజెండా..
అమ్మకి తొలికానుపు..
తెలుగు తెరవేలుపు..
పరిశ్రమకు కొత్త మలుపు..
శంకరప్రసాద్ అసలు పేరు..
చిరంజీవి సినిమా పేరు..
చిరు ముద్దు పేరు..
అదే హోరు..
హిట్టు సినిమాల సెలయేరు…
ఒక తరానికి ఎన్టీఆర్..
నవ తరానికి మెగాస్టార్..
నిజానికి ఆయన
కలియుగాస్టార్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
విజయనగరం

LEAVE A RESPONSE