ఎందుకు పట్టింది.. చంద్రగ్రహణం..!!??

ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కొన్ని సంవత్సరాల పాటు ఒంటి చేత్తో శాసించిన ఘనాపాటి..!
దేశరాజకీయాలను సైతం కొన్నాళ్ళ పాటు తన గుప్పిట్లో పెట్టకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాని..రాష్ట్రపతి పదవుల్లో ఎవరు ఉండాలనే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మేధావి..!
ఆంధ్రప్రదేశ్ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పి..దిగ్గజ ఐటి సంస్థల దృష్టి ఇటు పడేలా చేసి.. అంతర్జాతీయ ఖ్యాతిని సముపార్జించుకుని విశ్వనేతల అభినందనలు అందుకున్న ప్రగతి రథసారథి..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్ది..దేశంలో మహానగరాల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలబడిన స్ఫూర్తిదాత..!
ఇవి మాత్రమేనా.. అపార అనుభవశాలి.. రాజకీయ వ్యూహాలు రచించడంలో అపర చాణక్యుడు.. తప్పులను సైతం ఒప్పులుగా జనాల్ని నమ్మించి మెప్పించగల ఘటనాఘట సమర్థుడు..!
ఉమ్మడి ఆంధ్ర ప్రగతిరధ సారధుల్లో ఒకరు.. నవ్యాంధ్ర ప్రథమ ముఖ్యమంత్రి..!
ఇంత వర్ణన చేసిన తర్వాత ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
ఎస్..
తెలుగుదేశం పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..!

ఇప్పుడిక అసలు విషయానికి వస్తే..ఇన్ని ఘనతలు సాధించుకున్న..ఇంతటి ప్రతిష్ట సంపాదించుకున్న చంద్రబాబు నాయుడి ప్రస్తుత పరిస్థితి ఏంటి..!?
అంత ఘనమైన గతం కలిగి ఉండి మొన్న 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు వర్తమానం ఎలా ఉంది..? భవిష్యత్తు చిత్రం ఏమిటి..? అన్న అంశాలు అవలోకించే ముందు ప్రస్తుతంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి దారితీసిన అంశాలు ఏంటి..
వాటిలో చంద్రబాబు స్వయంకృతం ఏమిటి..?
ఒక సుదీర్ఘ లుక్కేద్దాం..!

దశాబ్దాల చరిత గల మహాసంస్థ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అడుగుతోనే అణగదొక్కేసిన నందమూరి తారకరామారావు అనే మహావ్యక్తిని సంకల్పమాత్రం చేతనే పదవీచ్యుతున్ని చేయడమే గాక ఆయన ఎంతో ఘనంగా స్థాపించి సొంత బిడ్డగా పెంచి పోషించుకున్న తెలుగుదేశం పార్టీని ఆయన సొంత బిడ్డల మద్దతుతోనే తన అధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు..
అది తప్పో..ఒప్పో.. ప్రస్తుతానికి అప్రస్తుతం.. మొత్తానికి ఆ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా.. చాకచక్యంగా అమలు చేసి ప్రజల ఆమోదాన్ని పొందిన ఘటనాఘట సమర్థుడు చంద్రబాబు నాయుడు..
ఇక్కడ ‘ప్రజల ఆమోదం పొందిన’ అని ఎందుకు పేర్కొనాల్సి వచ్చిందంటే.. అంతటి ఉదంతం జరిగిన తర్వాత చంద్రబాబుని జనం ముఖ్యమంత్రిగా అంగీకరించడమే గాక ఆయన అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి 1999 ఎన్నికల్లో అధికారం అప్పగించారు గనక..
మొత్తానికి అంతటి కీలకమైన వ్యవహారాన్ని సమర్థంగా పూర్తి చేసి అటు తర్వాత తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటూ మామ ఎన్టీఆర్ ఎలాగైతే జాతీయ రాజకీయాల్లో ప్రముఖమైన నిర్ణాయక శక్తిగా ఉన్నారో అలాగే తాను కూడా కీలక వ్యక్తిగా ఎదిగిన చరిత్ర చంద్రబాబు సొంతం..!

అలాంటి చంద్రబాబు నాయుడి ప్రతిష్ట ఇప్పుడు ఇలా మసకబారిపోవడానికి కారణాలేంటి..ఈ పరిస్థితి రావడానికి వ్యక్తిగా ఆయన ఎంతవరకు కారకుడు? విజయాలు…ప్రాభవాలు ఆయన ఖాతాలో పడినప్పుడు పరాభవాలు.. పరాజయాలకు కూడా ఆయనే బాధ్యత వహించాలి..తప్పదు.. అందునా పార్టీ..ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు ప్రధాన బాధ్యత అధినేతదే.. అది అనివార్యం..!
ఒకనాడు కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన.. బిజెపిని సైతం వెనక తిప్పుకున్న..
జాతీయంగా కాంగ్రెసేతర పార్టీలన్నిటినీ నేషనల్ ఫ్రంట్ అనే ఒక గొడుగు నీడకు తెచ్చి ఆ వేదికకుBabu-Rahul-Gandhi నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున అదే బిజెపికి దూరం కావడానికి.. జన్మ విరోధి కాంగ్రెస్ పార్టీతో సైతం చేతులు కలపడానికి..
ఇప్పటివరకు ఉనికి సైతం ఇంకా ఘనంగా చాటుకోలేక పోయిన జనసేన వంటి ఒక పార్టీ పొత్తు కోసం వెంపర్లాడే పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? పెద్దగా రాజకీయ అనుభవం లేని జగన్మోహనరెడ్డి అనే వ్యక్తి స్థాపించిన పార్టీ చేతుల్లో, మొన్న 2019 ఎన్నికల్లో చావుదెబ్బ తినడానికి దారితీసిన తప్పిదాలు ఎటువంటివి..మొహమాటం లేకుండా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలక నిర్ణయాలు కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకుని అమలు చేసినవి..వాటిలో ఆయనకు..పార్టీకి ఆత్మహత్యా సదృశంగా పరిణమించినవి ఏంటో పరికిద్దాం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడేసారు.రాష్ట్ర విభజనపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పకుండా ఆయన గోడమీద పిల్లి వైఖరి అవలంబించారు.ఆయన పోరాటంలో చిత్తశుద్ధి లేదు. సరే..రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారం ఎలాగైతేనేం ఆయన చేతికి వచ్చింది..అది ఆయనపై అభిమానం వల్ల గాక కాంగ్రెస్ పార్టీపై కోపం వల్లనేనన్న సంగతి జగద్విదితం. ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపితో జంట కలిసింది.వాస్తవానికి ఆ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో తెలుగుదేశం అనుకూల పరిస్థితులే ఉన్నాయి.అయినా గాని చంద్రబాబు కమలం పార్టీతో చెయ్యి కలిపారు.

babu-modiనిజానికి 2004 వరకు దేశంలో అత్యంత ప్రముఖ నాయకుల్లో చంద్రబాబు ముందు వరసలో ఉండేవారు.ఆ సరికి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ సైతం బాబు అంత పాపులర్ కారు. చంద్రబాబు ఎప్పటికైనా ప్రధాని అవుతారని అనుకునే వారు.ఆ అవకాశం ఒకసారి ఆయన తలుపులు తట్టింది కూడా.అలాంటి ప్రముఖ స్థానంలో ఉన్న చంద్రబాబు 2014 లో బిజెపి గుడారంలో దూరడం ఆయన చేసిన చారిత్రక తప్పిదం..!
పోనీ..ఆ తప్పు చేసినా బిజెపితో మైత్రిని ఆయన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం వినియోగించింది తక్కువ.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో అంటకాగిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు..ప్యాకేజీ వంటి విభజన హామీలు అమలు జరిగేలా అవసరమైన స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేదు. ఇది మరో తప్పు..!

ఇక 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయనగానే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నట్టు బిజెపితో తెగదెంపులు చేసుకున్నారు. ఈ సందర్భంలో మాత్రం ఆంధ్ర ప్రజలు చంద్రబాబును అస్సలు నమ్మలేదు.అయితే ప్రజల్ని నమ్మించేందుకు చంద్రబాబు ఆయన స్థాయికి తగని కొన్ని అవాంఛనీయ పోకడలు అవలంబించారు.. మోడీ పట్ల తీవ్ర పదజాలాలు వాడడం అందులో ప్రధానమైనది. అలాంటి చర్యల వల్లనే ఆయన రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు.
చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే బిజెపితో ముందు స్నేహం చేశారని..బిజెపితో తెగదెంపులు చేసుకుంటే ఆ ప్రయోజనాలు మరోసారి..ఈసారి మరింత విస్తృతంగా పొందవచ్చని ఆయన తప్పుడు వ్యూహాలు పన్నుతున్నారనే సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. బీజేపీతో కలిసి ఉన్నంత కాలం ప్రయత్నం చేయలేదు కానీ, విడిపోయాక ప్రత్యేక హోదా..విభజన హామీల గురించి పెద్ద గొంతుతో అడగడం జనాలకి నచ్చలేదు..ఆ పోకడలను జనం మెచ్చలేదు..!
ఫలితం..తెలుగుదేశం పార్టీకి మునుపెన్నడూ చవిచూడనంత భంగపాటు 2019 లో ఎదురైంది.
2014..2019 ఎన్నికల ముందు తీసుకున్న రెండు నిర్ణయాల ప్రభావం 2019లో కొట్టేసింది.
ఇది అసలు తప్పు.. పట్టింది తుప్పు..!

ఇకపోతే..1995..2004 మధ్య చంద్రబాబు నాయుడు వేసిన మరికొన్ని తప్పటడుగులు..
*తన మొదటి దశ పాలనలో బాబు పూర్తిగా హైదరాబాద్ నగరంపై దృష్టి సారించి మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై శీతకన్ను వేశారు..
*హైటెక్ పోకడలు అవసరమే కాని మన ప్రాంతాల ప్రధాన జీవాధారమైన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారనే అపప్రదను మూట కట్టుకున్నారు.
*పింఛన్లు బకాయి పెట్టడమే గాక చెల్లింపులు సక్రమంగా చెయ్యలేదు..!
*వీటన్నిటినీ మించి కొడుక్కి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి తదుపరి ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టు సినిమా ఇచ్చేశారు..
*ఎన్టీఆర్ ను పదవీచ్యుతున్ని చేసినప్పుడు తన వెంట నిలిచిన నందమూరి కుటుంబసభ్యులను నెమ్మదిగా పక్కకి తప్పించేసారు..ఈ ధోరణి కారణంగా ఆయన మనుషుల్ని అవసరానికి వాడుకుని వదిలేస్తారనే ప్రచారం పెరిగిపోయింది..
ఇకపోతే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చెలిమి చేశారు.అది మరీ వికటించింది.మామ ఎన్టీఆర్ ను పక్కకి నెట్టి పార్టీ పగ్గాలు చేపట్టి పెద్దాయన ఆశయాలకు అనుగుణంగానే పార్టీ నడుస్తుందని పదేపదే చెబుతూ వస్తున్న బాబు రామారావు వైఖరికి పూర్తి భిన్నంగా కాంగ్రెస్ తో చెయ్యి కలపడం తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమానుల్లోనే గాక మామూలు జనాలలో కూడా చాలా మందికి రుచించలేదు.
చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తారనే ప్రచారానికి ఈ చర్య పూర్తిగా ఊతమిచ్చింది.ఇంత చేసినా తెలంగాణలో భంగపాటు తప్పలేదు.అది వేరే కథ..!

ఇక వర్తమానంలోకి వస్తే…
ఇప్పటికీ చంద్రబాబు వైఖరిలో స్పష్టత లేదు. ఆయన ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు.. బిజెపి..జనసేన..ఆ రెండు పార్టీల మైత్రి విషయంలోనే స్పష్టత లేదు గనక చంద్రబాబు ఏమీ చెయ్యలేని..చెప్పలేని నిస్సహాయ స్థితి..తెలుగుదేశంతో చెయ్యి కలపాలా వద్దా..కలిపితే తమకు లాభమా..నష్టమా..
వారే బేరీజు వేసుకుని అప్పుడు సైకిల్ పార్టీతో చెలిమి విషయంలో ఆ పార్టీలే నిర్ణయం తీసుకోవాలి తప్ప చంద్రబాబు తానుగా పరిస్థితులను శాసించే
సీన్ లేదు..!
ఈ పరిణామాలన్నీ చంద్రబాబు స్వయంకృతం..
ఇప్పుడిక చంద్రబాబు తన ఆలోచనలకు మరింతగా పదును పెట్టాల్సిన సమయం..అవసరమైతే కొన్ని అడుగులు వెనక్కి వేసైనా నిర్ణయాలు తీసుకోవలసిన తరుణం.
రాష్ట్రంలో మరోసారి జగన్ పార్టీ అధికారంలోకి రాకూడదు అనే ప్రధాన లక్ష్యంతో పాటు ఆ లక్ష్యంతో ముడిపడి ఉన్న ఇంకో కీలక అంశం..తన పార్టీని బ్రతికించుకోవడం..ఈసారి కూడా అధికారానికి దూరమైతే అప్పుడిక తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది..కనుక ఈ ఎన్నికలు సైకిల్ పార్టీకి
చావో..రేవో..!
అది బాబుకి బాగా తెలుసు..
అందుకు అనుగుణంగా ఆయన వ్యూహాలు రచించుకుని పెద్ద పోరాటానికి సిద్ధపడాలి..!
ఆ వ్యూహాలు ఎలా ఉండాలి..
ఉండబోతాయన్నది మరో కథనంలో చర్చిద్దాం..!
ఇప్పటికి సెలవు..!!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286

Leave a Reply