Suryaa.co.in

Entertainment

ఆ స్వర సహస్రం..విష్ణు సహస్రం..!

ఆమె..
నారద తుంబురులకు చెల్లెలు..
సిగలో విరిసే
సరాగాల మల్లెలు..
పదం పలికితే విష్ణుపథం..
రాగమాలపిస్తే దేవరాగం..
గమకమైతే ముక్కంటికే నచ్చే
నమకం చమకం..
జతులు..
ఆమె ఇంటి సంగతులు..
ఆ సంగతులు..
ఆమె..అమ్మ అడ్డాలనాడే సాధించిన పరిణితులు..!

ఆమె గళం..సుమంగళం..
ముక్కోటి దేవతలు
కొలువుండిన పవిత్ర ప్రాంగణం
కృతులు..కీర్తనలే బంధుగణం..
అవే ఆమె ప్రాణం..
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి..
స్త్రీ రూపు దాల్చిన అన్నమయ్య..
త్యాగయ్యే ఆమె పాట విని
సేద తీరునయ్యా..!
ముత్తుస్వామి సైతం
పరవశమొందడా ఏమి..?
పండితులు..పామరులే గాక
సాక్షాత్తు పండిట్టే పులకించి
ఆమెకు అరుదైన బిరుదులు
కట్టబెట్టినాడు..
ఆమె ఇందిరమ్మకే
నచ్చిన ఇందీవర!

స్వరమే కాదు స్వరూపమూ
అపురూపమే..
ఆ కట్టు బొట్టు..
కచేరీలో కూర్చునే పట్టు..
తంబురా మీదొట్టు
కట్టిపడేసే కనికట్టు..
పోతపోసిన భారతీయత..
అమ్మతనపు ఆప్యాయత..
సంగీతానికే పరిపూర్ణత!

ఆమె స్వరాలు
స్వర్గానికి దారులు..
తాదాత్మ్యతకు ద్వారాలు..
సాక్షాత్తు విష్ణుమూర్తికే అలంకారాలు..
ఎన్ని పాడినా..
ఇంకెన్ని ఆలపించినా
ఏడుకొండలపై మారుమోగే
వైకుంఠవాసునే మురిపించే..
భక్తకోటిని మైమరపించే విష్ణుసహస్రం..
కట్టిపడేసే సమ్మోహనాస్త్రం..
మహా విధ్వాంసులకే కష్టమనిపించే..
గంధర్వులకే క్లిష్టమనిపించే..
వినడానికి ఇష్టమనిపించే
ఓ అసాధ్యాన్ని
సుసాధ్యం చేసిన..
సుబ్బులక్ష్మి స్వరం
ఇప్పుడు అలంకరించి
ఉంటుంది స్వర్గధామం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE