Suryaa.co.in

Political News

షోమాన్..షా..మాన్..!

అపురూప శక్తులు లేని
సామాన్య జీవుడైనా
కొందరికి దేవుడు..
ఒక పెద్ద దేశాన్ని ఏకచక్రాధిపత్యంగా
నడిపిస్తున్న ప్రతిభాశాలి..
వివాదాల మకిలి
అంటని విలక్షణం
ఆయన శైలి..
తొమ్మిదేళ్లలో ఇండియాకి
సరికొత్త రూపు చెక్కిన ఉలి..
ఎవ్వరు ఎన్నన్నా..
ఎంతగా విమర్శలు గుప్పించినా లెక్క చేయక
తాననుకున్నది అనుకున్నట్టుగా
చేయగల బాహుబలి!

నరేంద్ర మోడీ..
భారత రాజకీయాల్లో
ప్రత్యేక ముద్ర..
మనసు లోతు పొరల్లో
ఏముందో ఎవరికీ తెలియని
గంభీర సముద్ర..
ప్రధాని పీఠంపై
చెదరని సంతకం..
రోజుకు మూడు డ్రస్సులతో
సోకులు ఒలకబోసే వాలకం..
ప్రకటనలు..పర్యటనలు
ఆయన స్టైల్..
ఎవరన్నా ఉండదు ఢర్..
హంగు ఆర్భాటాలకు
బ్రాండ్ అంబాసిడర్..!

ఇలా వచ్చాడు..
అలా రద్దు చేశాడు
పెద్ద నోట్లు..గప్చిప్ గా..
ఆర్థిక మంత్రికే
తెలియని గుట్టు…
మోడీ కనికట్టు..!

ఆ మస్తిష్కంలో
పుట్టిన ఆలోచన..
జీఎస్టీ..
మొండిగా
అమలు చెయ్యడమే
మోడీ డైనస్టీ..
లాభమో..నష్టమో..కష్టమో..
ఆయనకు ఇష్టం..
అదెప్పటికీ రావణకాష్టం!

స్కాముల్లేవు..
స్కీములున్నాయి..
ఆరోపణలు లేవు..
అలాగని నిరూపణలూ
కానరావు..
విజయాలు అద్వానీ కీర్తి..
అభివృద్ధి వాజపేయి స్ఫూర్తి..
ఆ ఇద్దరు వేసిన పునాదులపై
మోడీ సింహాసనం..
పని చేశాడేమో సిపాయిలా
పాతుకుపోయాడు రాయిలా!

సారొస్తాడన్నారు..
వస్తాడొస్తాడొస్తాడన్నారు..
వచ్చాడు..
సర్దార్ పటేల్ ను
కొండలా నిలబెట్టి..
అయోధ్య రామాలయాన్ని
మొదలుపెట్టి..
వారణాసిని సుందర కాశీగా
తీర్చి దిద్ది..
అల్లూరి విల్లును సగర్వంగా
తానెక్కుపెట్టి..
ఇచ్చాడు మహనీయులకు
మహా విగ్రహాల రూపం..
ఆ విషయంలో
చెయ్యలేదు లోపం..
వేసేశాడు భారతీయతకు
సాంబ్రాణి ధూపం..!

విమానం ఎక్కేముందు
ఓ డ్రస్సు..
దిగేపాటికి మరో’టీ’..
దిగాక వెనక్కి వెళ్లి ఇంకో’టీ’..
ఏంటో ఈ దుస్తుల పిచ్చి..
వ్యవహారంలో
మాత్రం నిక్కచ్చి..
హస్తమంటే కచ్చి..
విపక్షాలతో ఆడుతూ
కోతి కొమ్మచ్చి..
ప్రధాని పదవి మాత్రం
ఆయనకే అచ్చి..
మొత్తానికి గమ్మత్తయిన
‘క్యా’రెక్టర్ ఈ భూతకాల
చాయ్ వాలా..
వర్తమాన విశ్వగురు..
ఆధునిక భారత
నయా షో మాన్..
కొండకచో
అమిత్ ‘షా’ మాన్..
ఇప్పటికైతే ఎదురేలేని
శక్తిమాన్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE