Home » ‍‍‍‍‍‍వందేళ్ల చరిత్ర కల్గిన నాటకానికి సంకెళ్లు వేయడం ప్రభుత్వానికి భావ్యమా

‍‍‍‍‍‍వందేళ్ల చరిత్ర కల్గిన నాటకానికి సంకెళ్లు వేయడం ప్రభుత్వానికి భావ్యమా

కావ్యేషు నాటకం రమ్యం అన్నారు.కదిలేది కదిలించేది పెనునిద్దుర వదిలించేదీ ముందుకు నడిపించేది కావాలోయ్ నవ కవనానికి అన్నాడు మహాకవి శ్రీశ్రీ.

నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తుంది …జీవితం నాటకాన్ని అనుసరిస్తుంది అన్నారు పెద్దలు.చింతామణి నాటకం చారిత్రాత్మకమైన నాటకం. నాటకం లోని పాత్రలు సన్నివేశాలు కథా కథనం నాటికీ నేటికీ సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూనే ఉంది.

చింతామణి, భవాని శంకర్, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి ఇలా అందులోని ఎన్నో పాత్రలు సమాజంలో ఉన్న అనేక వ్యక్తుల జీవితాలను తాడుముతాయి  వేశ్య దగ్గరికి వెళ్లిన వారి లోగుట్టులను  కళ్లముందు ఆవిష్కరిస్తాయి.

గతంలో కన్యాశుల్కం నాటకంలో మధురవాణి దగ్గరికి వెళ్లిన కుల పురుషులెవరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే  ఆ నాటకాన్ని ఏం చేయాలి .ఆ నవలను ఏం చేయాలి.సీత చెరకు చాకలోడు కారణమని నేటికీ తిడుతున్న రామాయణం కథ లోని అంశాల్ని  ఎలా తీసేయాలి వాటిని ఏం చేయాలి.కుల ప్రాతిపదికన కళలను  నాటకాలు, కళారూపాలన్ని   విడదీసి చూస్తే సమాజం ముక్కలు ముక్కలుగా కనపడుతుంది.

ఆనాడైనా ఈనాడైనా వేశ్యల దగ్గరకు ఫలానా కులం వారే వెళుతున్నారు అని మనం చెప్పగలమా… ఫలానా కులానికి మాత్రమే బలహీనతలు ఉన్నాయని స్పష్టంగా చెప్పగలామా సాధ్యం కాదు
ఆనాడైనా ఈనాడైనా వేశ్యల వద్దకు వెళ్లిన వారి జీవితాలు ఎలా దుర్భరం అవుతాయో ఎలా పతనమవుతారో చెప్పింది ఆ నాటకం.

నాటకం నర్మగర్భంగా ఇస్తున్న సందేశాన్ని చూడాలి తప్ప లేనిపోని కుల వర్గీకరణ నాటకాలకు ఆపాదించడం సరి కాదు. నాటకంలోని పాత్రలు చెప్పే సందేశాన్ని సారాంశాన్ని చూడాలేగాని కుల  సమస్యలు తీసుకువచ్చి నాటకాన్నే నిషేధించడం అనేది సరైన చర్య కాదు…

ఇప్పుడొస్తున్న సినిమాలు ముఖ్యంగా జబర్దస్త్ లాంటి షోలు  హాస్యం పేరుతో జనజీవన స్రవంతిలో ఉన్న అనేక పాత్రలను అపహాస్యం చేయటం లేదా…
ముఖ్యంగా స్త్రీల విలువలను దిగజార్చడం లేదా… అనేక సినిమాల్లో  అల్లర్లకు డ్రగ్స్ లాంటి మాఫియా లకు అడ్డాలు  మురికివాడలు పేదల నివాసాలు ఉండే ప్రాంతాలు అన్నట్టు చూపిస్తున్న సినిమాలు ఏం చేయాలి.. వినోదం మాటున వికృత క్రీడలకు అడ్డాగా మారిన సినిమా టీవీ మాధ్యమాల పైన ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం ఏమనాలి.

పబ్బుల్లో క్లబ్బుల్లో అశ్లీల నృత్యాలకు విచ్చలవిడిగా  అనుమతులుఇవ్వడాన్ని ఏమనాలి ప్రకృతి వినాశనానికి చూపెడుతూ, శాస్త్ర సాంకేతిక రంగాల ఉపయోగించుకుని అంధ విశ్వాసాలను పెంచి పోషిస్తున్నా సాంకేతిక మాధ్యమాల పై నియంత్రణ లేని తనాన్ని ఏమనాలి. మానసిక శారీరక వికలాంగుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో సినిమా టీవీ షోలో వికృతచేష్టలు చేస్తుంటే వాటినెలా అరికట్టాలి.. వాటన్నిటినీ మీద శ్రద్దలేని మనం మన పాలన విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

సామాజిక విలువలను పెంపొందించే చింతామణి నాటకం వందేళ్లుగా ప్రజల మధ్య చిరంజీవిగా వెలుగొందుతోంది. ఆ నాటకం ఇచ్చిన చైతన్యం ఎన్నో జీవితాలను మార్చినటువంటి సందర్భం.
ఆనాటకం ద్వారా కళా రీతులను నేర్చుకుని టీవీ సినిమా రంగాలకు వందలాది మంది కళాకారులు ఎదిగిన వైనం మర్చిపోదామా….

కాళ్ళకూరి నారాయణ రావు గారు సమాజం చైతన్య  కావాలని ఆశించి అందులోని పాత్రలు సన్నివేశాలు మానవ సంబంధాలను, భావోద్వేగాలను బలహీనతలను, కళ్లకు కట్టినట్లు అందరికీ అర్థమయ్యే రీతిలో మలచిన కళాఖండాన్ని నిషేధం విధించటం ఎంతవరకు భావ్యము.ఇలా నిషేధం విధించు కుంటూ పోతే ఎన్నో ఎన్నో కళారూపాలను సినిమాలను టీవీ షోలను  పుస్తకాలను,నవలల్ని, నిషేధం విధించాలి. అది మనకు సాధ్యం అవుతుందా. ఎందుకు ఇంత తొందర పడి వందేళ్ల నాటకాన్ని నిషేధం విధించారు.ఇది కళాకారుల జీవితాలను ఇబ్బంది పెట్టే విషయం.  భావప్రకటన స్వేచ్ఛ కు సంకెళ్ళు వేసే అంశం గా చూడాల్సి ఉంటుంది.

గతంలో హబీబ్ తన్వీర్ నాటకాన్ని ఆపిన సంఘటన గుర్తొస్తుంది.వీధి నాటకం మీద దాడి చేసి సఫ్దర్ హష్మీ నరికి  చంపిన పాలకవర్గాల దమన నీతి గుర్తుకొస్తుంది.ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రపటాలను తగలబెట్టిన దుర్మార్గుల చర్య గుర్తుకొస్తుంది.బాంచన్ దొరా నీ కాళ్ళు మొక్కుతానన్నా బక్కోడి ని బంధువులు పట్టించిన
వీర తెలంగాణ సాయుధ పోరాటం.ఆ పోరాటానికి ఊపిరిలూదిన  మాభూమి నాటకాన్ని నిషేధం విధించిన
రోజులు గుర్తుకొస్తున్నాయి.ఇప్పుడు చింతామణి నాటకం నిషేధించడం కూడా సరైంది విధానం కాదు.

ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలి
చింతామణి నాటకం తెలుగు వాళ్ళ సాంస్కృతిక సంపదకు చిహ్నం.. ప్రపంచంలో మరే భాషలో లేని తెలుగువాడికి ఒక్కడికే సొంతమైన పద్య నాటకానికే ప్రాణం..మారిన కాలంలో ప్రేక్షకుల అభిరుచి మారిన తరుణంలో  చింతామణి లాంటి పౌరాణిక నాటకాల్లో  బుర్రకథల్లో  శ్రుతిమించిన ముతక హాస్యం చేరిన మాట వాస్తవమే.వీలైతే ప్రభుత్వం వాటిని సరిదిద్దుకో మని చెప్పాలి మినహా నాటకాన్ని నిషేధించడం సరైన చర్య కాదు.

ఇప్పటికే కళాప్రదర్శన లేక పద్య నాటకాలకు ఆదరణ లేక పౌరాణిక సమాజాలు ఎన్నో మూలనపడ్డాయి. హార్మోనియం వాయించే కళాకారుల, పద్యాలు పాడే కళాకారులకు ఆదరణ కరువైంది.ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం ఏమాత్రం లేక వృద్ధ కళాకారులకు రావాల్సిన పెన్షన్లు అందక, మరోవైపు కరోనా రెండేళ్లుగా పీడిస్తుంటే పేద కళాకారుల బ్రతుకులు దయనీయంగా మారాయి.ఈ సమయంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కళాకారులు మరింత ఆందోళన చెందే పరిస్థితులు ఏర్పడతాయి.

మూలుగుతున్న నాటకంపై ఇప్పటికే సినిమా, టీవీ, మల్టీప్లెక్స్, ఓటీటీ పెద్ద పెద్ద బండలెన్నో వేసి చావులేని బతకలేని స్థితిలో ఉంచాయి.వీలైతే ప్రభుత్వం నాటకోత్సవాలు నిర్వహించి పౌరాణిక నాటకాలకు ప్రాణం పోయాలని కోరుతున్నాం.డీజేలకు పబ్బు  క్లబ్బులుకు ఇచ్చే పర్మిషన్ ల్లో 20 శాతం నాటకాలకు,నాటక సమాజాలకు జానపద కళా ప్రదర్శనకు అవకాశం ఇస్తే ఈ కళాకారులు బతికి బట్ట కడతారని  కోరుతున్నాము.జానపద పౌరాణిక రంగస్థల కళాకారులు నేడు ఎదుర్కొంటున్న ఆకలి సమస్యలను ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం.

కళనే వృత్తిగా ఎంచుకుని బ్రతుకీడుస్తున్న కళాకారుల జీవితాల గురించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని తగు చర్యలు తీసుకుని వారిని ఆదుకోవాలని కోరుతున్నాము…

చివరిగా చింతామణి నాటకం నిషేధం పై ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, తెలుగు ప్రజలందరి తరపున, పౌరాణిక నాటక ప్రియుల లందరి తరపున, కళాభిమానులందరి తరపున కళాపోషకులు అందరి తరపున రంగం ప్రజా సాంస్కృతిక వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది.

ఇట్లు
కళాభివందనాలు తో
ఆర్ రాజేష్ రంగం 
(ప్రజా గాయకుడు)
రాష్ట్ర కార్యదర్శి
9949507622.

Leave a Reply