ఏ ఉద్యమానికైనా తాము సిద్ధమని ఉద్యోగస్థులు అంటున్నారు

-రెవెన్యూ ,పోలీస్, మున్సిపల్, హెల్త్ తోపాటు పలు శాఖల ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తే వారికి అన్యాయం చేశారు
-టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

రెవెన్యూ ,పోలీస్, మున్సిపల్, హెల్త్ తోపాటు పలు శాఖల ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తే వారికి అన్యాయం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు మీ కోసం… నేడు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించి శంఖారావం పూరించాయి. అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఏ ఉద్యమానికైనా తాము సిద్ధమని ఉద్యోగస్థులు చెప్పారు. అవసరమైతే సమ్మెకైనా వెళ్తామనే సంకేతాన్ని ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం కూడా తగ్గకుండా జనవరి జీతాలు కొత్త పీఆర్సీ ప్రకారం వస్తాయని సీఎఫ్ఎంఎస్ లో కూడా ప్రోగ్రామ్ లోడ్ చేశాం అంటున్నారు. ఇరు పక్కల తగ్గే పరిస్థితి లేదు. నేడు ఉద్యోగస్థులు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఫిబ్రవరి 7 న సమ్మె చేసే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

21న ప్రభుత్వానికి నోటీసులివ్వడానికి సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలవారు తెలిసి చేసినా, తెలియక చేసినా వాటిని ఉదారంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రెండు చేతులతో ఓట్లేసినా ప్రభుత్వానికి విశ్వాసం లేదు. లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డెక్కారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి. ప్రజాస్వామ్య లక్షణం కాదు. ఓట్లేసిన వ్యవస్థపై సీఎం చూపించే ఆటిట్యూడ్ ఈ రకంగా ఉండడం దురదృష్టకరం. ప్రభుత్వమేమో మీ జీతాలు పెరుగుతాయి, తగ్గవంటోంది. ఒక జూనియర్ అసిస్టెంట్ కు 1970లో 50 రూపాయలు లేదా వంద రూపాయలు జీతం ఉండేది. ఆ వంద రూపాయలతో ముగ్గురు నలుగురు సంతానం ఉన్నా హాయిగా గడపగలిగేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఉపాధ్యాయులందరూ రోడ్డుపైకి వస్తే సేవలందించేవారెవరు? వెళ్తే జీతాలు మిగలుతాయనే ధోరణిలో ప్రభుత్వముంది. ఉద్యోగ నాయకులు 50 మంది దాక ఉంటారు. వారే రాష్ట్రంలోని 14 లక్షల మంది ఉద్యోగస్థుల దశ దిశ మార్చగలరు. ఉద్యోగ సంఘ నాయకుల్లో నిజాయితీ ఉండాలి. ప్రతి ఉద్యోగి పాకెట్ ను టచ్ చేసేది పీఆర్సీ. పాకెట్ కు చిల్లు పడకుండా చూసుకోవాలి. అందరూ ఐకమత్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుంది.

అమరావతి రైతులు 700 రోజులు ఉద్యమం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానాలి. ఉద్యోగులను ఉద్దరిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకపోగా హక్కులకోసం పోరాడుతున్న వారిపై లాఠీలు ఝులిపించడం దుర్మార్గం. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసనలు, ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. గతంలో 43% పిఆర్సి ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకు ఎసరు పెట్టాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ పాలన తప్ప పురోభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను జగన్ రెడ్డి దిగజార్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీతాలు తగ్గించేలా, ఉద్యోగుల నుండి బకాయిలు వసూలు చేసేలా జీవోలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉపాధ్యాయులు, ప్రజలకు అవసరమైన సేవలు చేస్తూ ఉద్యోగులు బిజీగా ఉండాల్సింది పోయి మా పొట్ట కొట్టొద్దు అంటూ రోడ్డెక్కి పరిస్థితిని జగన్ రెడ్డి తీసుకు వచ్చారు.

ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు. రెవెన్యూ ,పోలీస్, మున్సిపల్, హెల్త్ తోపాటు పలు శాఖల ఉద్యోగులు ప్రాణాలు తెగించి సేవలందించారు వారి ఆకాంక్షలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు.నాలుగు గోడల మధ్య ఉండి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ప్రభుత్వం రోడ్డుపైకి తెచ్చింది. ఆదాయం కోసం ఉపాధ్యాయులతో మద్యం అమ్మించారు.ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేశారు. నాడు నేడు పెరుతో కోవిడ్ సమయంలో పాఠశాలలు నిర్వహించి వందలాది మంది ఉపాధ్యాయుల మరణాలకు కారకులయ్యారు. కల్లబొల్లి కబుర్లు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపింది. కాంట్రాక్టు ఉద్యోగులని క్రమబద్దీ కరణ చేస్తానని జగన్ అనేక సార్లు ప్రకటించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. వారు ఆశలకు జగన్ సమాధి కట్టారు.

ఉద్యోగులను ఆకర్శించి ఓట్లేయించుకోవడానికి చంద్రబాబునాయుడు చేసిన ప్రతి పనిని నిరసించారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇస్తామని ప్రకటించారు. 27 శాతం ఐఆర్ ఇస్తే బాగుంటుందని ఉద్యోగస్థులు సంతోషించారు. సంఘాలు విడివిడిగా ఉద్యమిస్తున్నాయి. పీఆర్సీ అనేది అన్ని సంఘాలకు వర్తిస్తుంది. ఆర్థిక ఇబ్బందులనే నెపంతో ఉద్యోగస్థుల్ని ఈ స్థితికి తీసుకరావడం అంత మంచిదికాదు. ప్రభుత్వం దొంగ లెక్కలు చూపుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నామనేది శుద్ధ అపద్ధం ముఖ్యమంత్రికి సమయంలేకపోతే ఆర్థిక మంత్రితో ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాలి. ఫిట్ మెంట్ తగ్గించడం మంచిపద్ధతి కాదు. ఒకే తాటిపైకి ఉద్యమం చేస్తే తప్ప పేరుకోసమో, టీవీల్లో కనపడడానికో ఉద్యమాలు చేస్తే ఫలితం ఉండదు. . ఉద్యోగుల విషయంలో మొండి వైఖరి విడనాడి ఉదారంగా వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్సీగా కోరుతున్నానని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వానికి హితవు పలికారు.

Leave a Reply