Suryaa.co.in

Entertainment

మన సినిమాల స్థాయి ఇంతే..

సీతారాముడు, కొమరం భీముడు.. వేర్వేరు కాలాల్లో, వేర్వేరు అడవుల్లో బతికారు..
rrrవాళ్ళిదరినీ బ్రిడ్జి కింద నుంచి తాడేసి కలిపేసాడు.. రాజమౌళి.
తప్పులేదు.. ఊహాశక్తికి అడ్డేముంది?
rajamouliకానీ, రోహిత్ వేముల, దిశ నిందితులు… ఒకే కాలంలో ఒకే నగరంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
వీరిద్దరినీ కలిపి రాజమౌళి సినిమా తీయగలడా?
పత్రికల్లో వచ్చిన ప్రతి సంచలనాన్నీ తెరమీద అమ్ముకుంటాడు.. రామ్ గోపాల్ వర్మ..
ఏ రోజైనా సంచలనం వెనుక సమాజాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడా?
అసురన్ లాంటి సినిమా కొనుక్కుని రీమేక్ చేసుకున్నాడు.. దగ్గుబాటి సురేష్..
అందులో అయినా దళితుడనే మాట పలకగలిగాడా?.
మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్.. అని తేల్చేయలేం కానీ,మన సినిమాల స్థాయి ఇంతే..
ఒక రకంగా మన దర్శకుల ఐ క్యూ అంతేనేమో…
ఏ దర్శకుడిని అడిగినా ఏం చెప్తాడు.
“చదువు పెద్దగా అబ్బలేదు.
చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి.
కాలేజి ఎగ్గొట్టి, బట్టలు చింపుకుని చిరంజీవి , బాలకృష్ణ సినిమాలు చూసేవాడిని.”
ఇది తప్ప..”బాగా చదవుకున్నా..
సమాజాన్ని అర్థం చేసుకున్నా..
చెడిపోతున్న వ్యవస్థల్ని సినిమా మాధ్యమం ద్వారా నిలదీయాలని వచ్చా”..
అని ఒక్కడైనా చెప్పగలడా?
అదేమంటే, ఆ పని సినిమాది కాదని తేల్చేస్తారు.
గ్రాఫిక్స్ ఫైట్లు, ఐటెమ్ డాన్సులు చూపించడానికే సినిమా అని మన వాళ్ళు తీర్మానించేసారు.
కానీ, తమిళ మలయాళం సినిమాలు ఈ బోర్డర్ ని దాటేసాయి.
అక్కడి దర్శకులు సినిమాలు చూసి సినిమాలు తీయడంలేదు.
సమాజం చూసి సినిమాలు తీస్తున్నారు.
సమాజం చూడాల్సిన సినిమాలు తీస్తున్నారు.
సమాజం చూడని కోణాల గురించి సినిమాలు తీస్తున్నారు.
జనగణమన మలయాళం సినిమా అలాంటిదే.

janaganamanaతన రెండో సినిమాతోనే సమాజంలో నాలుగుస్తంభాలనూ కుదిపేసాడు.. దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ…
జనగణమన..
ఈ మలయాళ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఓటిటి.
దేశమంతా దీని మీద చర్చజరుగుతోంది.
కాకపోతే, మన తెలంగాణకి ఇది మరీ రిలవెంట్.
ఇది మన కథ.
మన చుట్టు జరిగిన కథ.
సారం ఒకటే అయిన రెండు వేర్వేరు ఘటనల కథ.
ఆ కథనే దర్శకుడు డిజో ఎంచుకున్నాడు.
దిశ అత్యాచారం తర్వాత జరిగిన ఎన్ కౌంటర్..rohitరోహిత్ వేముల ఆత్మహత్య..
ఈ రెండు వేర్వేరు ఘటనలే..
ఒకటి ఎన్ కౌంటర్ అంటాం..
ఇంకొకటి ఆత్మహత్య అంటాం.
కానీ, నిజానికి రెండూ వ్యవస్థ చేసిన హత్యలే.
రెండు నేరాలకు బోనులో నిలబడాల్సింది సమాజమే..
తక్కువ కులంలో పుట్టడమే ఒక నేరం అని రాసిపెట్టి రోహిత్ ఉరేసుకున్నాడంటే..
ఆ హత్య సమాజం చేసింది కాదా?
ముక్కు ముఖం తెలియని నలుగురిమీద రేపిస్టులని ముద్రేసి, పోలీసులు చంపేస్తే,అదే పోలీసుల మీద పూలుజల్లి, మిఠాయిలు పంచుకున్న మనందరికీ నేరంలో భాగం లేదా?
అందుకే రెండు ఘటనల సారాన్నీ ఒకే కథగా అల్లి జనగణమన తీసాడు..
సినిమా కథంతా చెప్పి మీ ఆసక్తిని, సినిమా చూసే అనుభూతిని చెడగొట్టను.
కానీ, కళ్ళున్న కబోదుల్లా బతికే తెలుగు వాళ్ళంతా కళ్లు తెరిచి చూడాల్సిన సినిమా.
గ్రాఫిక్ ఊహల్లో సిక్స్ ట్రాక్ స్వప్నాలన మాత్రమే అమ్మే తెలుగు దర్శకులంతా మనసు పెట్టి చూడాల్సిన సినిమా.
కోర్టు సీనుల్లో కొంత డ్రామా వుండొచ్చు.
చివర్లో కొంచెం ఎక్కువ సేపే సాగినట్టు వుండొచ్చు.
కానీ, అప్పటికే సినిమా ఇచ్చిన షాక్ లో వుంటాం కాబట్టీ,ఇవన్నీ పెద్ద విషయాలు కాదు.
కులంతో గుణాన్నీ,
ముఖం చూసి నేరాన్నీ
పుట్టుకతో సామర్థ్యాన్నీ
అంచనా వేసే ఈ సమాజం చెంప ఛెళ్లు మనిపించి మేల్కొలిపే
ఒక అర్థమవంతమైన జాగృత గీతం…
జనగణమన..

– శివప్రసాద్

LEAVE A RESPONSE