జీవితానుభవసారం- సామెతలు

ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు. ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా (ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది) విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన, చేయకూడని పనులను సామెతలుగా చెప్పారు. ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా చెప్పగలిగేవారు. తొలకరి వానలు ఆషాఢంలో మృగశిరకార్తె (సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి. ‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి.

మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి, మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది, మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి, మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది, మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’ తదితర సామెతలు సేద్యంలో మృగశిర ప్రాధాన్యాన్ని చెబుతాయి.

ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే ‘ఆరుద్ర వాన అదను వాన, ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు, ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇంటికి చెరుపు లేదు, ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి’ లాంటి సామెతలు.

తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02). ‘పునర్వసు, పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’ సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. ఆపై వచ్చే ఆశ్లేష కార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి. అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే ‘ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట, ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి.

ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’ మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు. మఖ (ఆగష్టు 17- 30) శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ. ‘మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి, మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’ లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి.

ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు. ‘మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం, మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’ (పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు) సామెతలు దీన్ని సూచిస్తాయి. ‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే’ అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది.

ఉత్తర చూసి ఎత్తరగంప
ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు జానపదులు. ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే ‘ఉత్తర పదును ఉలవకే అదును’ అనే సామెత పుట్టింది. ‘ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, విశాఖ చూసి విడవర కొంప, ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం’లాంటి సామెతలూ ఇలాంటివే.

ఉత్తర తరువాత వచ్చేది హస్త (సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11). ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది. చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం. ‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే, హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట, హస్త చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి, చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి…’ లాంటి సామెతలు చాలా ఉన్నాయి.

యథా చిత్త తథా స్వాతి
చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి. ‘స్వాతివాన చేనుకు హర్షం (మెట్ట ప్రాంతం), చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’ లాంటి సామెతలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. విశాఖ కార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు. ఈ అనుభవంతో వచ్చిన సామెత ‘విశాఖ కురిస్తే పంటకు విషమే’. అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే ‘విశాఖ వర్షం ఆముదాలకు హర్షం’! ఇక భరణి (ఏప్రిల్‌ 27- మే 10), కృత్తిక (మే 11- 24), రోహిణి (మే 25- జూన్‌ 7)లపై ‘భరణి కురిస్తే ధరణి పండును, కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు, రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’ లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు.

ఊరిముందరి చేను… ఊళ్లో వియ్యం అందిరావు
ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద… ఇంత కష్టం ఉంటుంది. ఇక ఊళ్లో వియ్యం సంగతి… భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది. ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే. ‘కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’ ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి.

వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది.

Leave a Reply