Suryaa.co.in

Entertainment

ఆయన జీవితం చిత్రం..భళారే విచిత్రం..!

ఎంత రాస్తే సరిపోతుంది..
ఎన్ని చెప్తే సరితూగుతుంది..
కొంత వర్ణిస్తే ఓ కావ్యం
ఇంకొంత వివరిస్తే పురాణం
ఖండం అనుకుంటే కాండం
సర్వం అని తలపోస్తే
అతి పెద్ద పర్వం..
ఓ యుగపురుషుడి కథ..
మహానాయకుడి వీర గాధ..
చెప్పుకుంటూ పోతే
అంతులేని కధ..
ఎన్టీఆర్ అనే
కథానాయకుని కథ..!

నిమ్మకూరులో పుట్టిన
ఆ వ్యక్తి నిమ్మళంగా ఉంటాడా..
కృష్ణా జిల్లాలో
పుట్టాడనో ఏమో
సగం నటజీవితం కృష్ణార్పణమే..
మిగిలిన సగం రామబాణమే…
పాలమ్మిన రోజుల్లోనే సమాజంలో లోపాలు
తెలుసుకున్నాడేమో
సినిమాల్లోనూ విప్లవ భావాలే
చెడుపై కోపంతో
నిండిన హావభావాలే
ఆయన సొంత సినిమాల్లోనైతే
పూర్తిగా స్వీయ మనోభావాలే..
వరకట్నంపై చురకలు
ఉమ్మడికుటుంబం విలువలు
తల్లా పెళ్ళామా
అంటూ వివరణలు..
ఎన్ని సంస్కరణలు..
ఎన్నెన్ని తిరస్కరణలు..!?
పౌరాణికంలోనూ తిరుగుబాటు..
పాండవుల చరితకూ నగుబాటు..
మంచైనా..చెడైనా
అది రామారావుకే చెల్లుబాటు..

రాముడైనా..కృష్ణుడైనా..
రాముని మించిన రాముడైనా
అడవిరాముడైనా..
ఈ తారకరాముడే
సార్థక నాముడే..
ఖాకీ అయితే
కొండవీటి సింహం రంజిత్
వీరజవానుగా
మేజర్ చంద్రకాంత్..
న్యాయానికి కట్టుబడే
జస్టిస్ చౌదరి..
ఏ వేషం కట్టినా ఎన్టీఆర్ అంటేనే విజయభేరి..
కత్తి పడితే రాకుమారుడు
తిలకం దిద్దితే జగదేకవీరుడు
నిక్కరేస్తే అంజిగాడు…
మీసం మెలేస్తే దేవరాయలు
రోసం చూపెట్టే భీమసేనుడు..
ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే కారణజన్ముడు..
దుర్యోధనుడు ఫేవరెట్టు
అతడికీ ఓ డ్యూయెట్టు
ఆ పాటతో
దానవీరశూరకర్ణ
మరీ హిట్టు..
తక్కువ ఖర్చుతో
తీసేసిన లోగుట్టు
అంతా ఎన్టీవోడి
మూడు పాత్రల కనికట్టు..!

మనదేశంతో మొదలై
నా దేశంతో ముగిసిన ఓ యాత్ర
తెలుగునాట
తెలుగుదేశం జైత్రయాత్ర..
కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యానికి వైకుంఠ యాత్ర
ఎన్టీఆర్…ఈ పేరంటేనే
కొందరు దిగ్గజాలకు
చేదు మాత్ర..

1983..ఓ చరిత్ర..
ఓ ప్రభంజనం..
నందమూరి రూపంలో ఉవ్వెత్తున ఎగసిన
తెలుగు వాడి ఆత్మగౌరవం…
హస్తం పార్టీకి ప్రత్యక్ష రౌరవం..
అంతవరకు నియంతృత్వ వికటాట్టహాసం..
తారకరాముడి రాకతోనే
పేదోడి మొహంలో
విజయ దరహాసం..
ప్రతి అడుగు పిడుగే
అటు ఢిల్లీలో కన్నీటి మడుగే..

అంతటి ఎదురులేని మనిషి
మంచిమనిషి..
నిప్పులాంటి మనిషిలో
ఎప్పుడు నిద్రలేచాడో
ఓ మామూలు మనిషి
ఒకే ఒక్క మలుపు
పతనానికి పిలుపు..
లలాటలిఖితం
ఆపై స్వయంకృతం..
యుగపురుషుడి జీవితంలో
చీకటి రోజులు ఆవిష్క్రుతం
మొదలైంది అంతం
ఓ ఘన చరితకు చరమగీతం..
అధికారాంతంబున అవమానాలు..జుర్మానాలు..
వీగిపోయిన ఫర్మానాలు..
ఆయన నాయకత్వంపైనే
అవిశ్వాస తీర్మానాలు..

ఎన్ని జరిగినా పులి లొంగలేదు
పదవే పోయినా..
పరువే హరించుకుపోయినా
కృంగలేదు..
ఒక్కడై వచ్చాడు..
కోట్ల హృదయాలను గెలిచాడు
ఒక్కడై పోయాడు..
తనకు చెరిగిపోని యశస్సును
తెలుగు జాతికి
తరిగిపోని ఉషస్సును..
సముపార్జించి..
ఎప్పటిలా గర్జిస్తూ
ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు
పయనమయ్యాడు..

సాధిస్తే మనిషి
శాసిస్తే దేవుడు..
ఎన్టీఆర్ సాధించి మనిషై
శాసించి దేవుడై
మనుషుల్లో దేవుడయ్యాడు..
చేసిన ఒక్క తప్పు నుంచి తప్పుకోలేక..తప్పించుకోలేక.తప్పెంచుకోలేక..
తెప్పరిల్ల లేక..
దేవుడు చేసిన మనుషులు
సాగించిన కలాపాలకు
జీవితమే కల్లోలమై
కొడుకులు కూతుర్లతో సహా
మనుషులంతా ఒక్కటే..
అనుకుని అస్తమించింది
బొబ్బిలిపులి..
నేలకొరిగాడు
సర్దార్ పాపారాయుడు..
ఓ జాతిని నడిపించిన
డ్రైవర్ రాముడు ఆగిపోయాడు..
అవినీతి వేటగాడు అలసిపోయాడు…
ఆ సింహబలుడికి
తెలుగోడు చేయెత్తి జైకొట్టాడు
తెలుగుతల్లి
మల్లెపూదండ వేసింది..
తెలుగుదేశం..
పుణ్యభూమి నా దేశం..
ఎలుగెత్తింది
నమో నమామి అని..
మరణానికి వెరవని
సింహం నవ్వింది..,!

తెలుగుజాతి
ఆత్మగౌరవ ప్రతీక
కోట్లాది అభిమాన
హృదయాల ఏలిక..
నందమూరి తారక రామారావు
జయంతి సందర్భంగా ప్రణామాలు..

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE