Suryaa.co.in

Entertainment

రాజమౌళి ఆడిన కేళి..ఆర్ ఆర్ ఆర్..!

అసాధ్యాలను మూటకట్టి.. అభూతకల్పనలను పొట్లంగా చుట్టి..వాటికి గ్రాఫిక్ హంగులద్ది..ఎమోషన్లు కూరి..స్టార్ ఇమేజ్ అనే అద్దంలో పెట్టి..స్వరాజ్య కాంక్ష అనే భూతద్దంలో చూపెట్టి..దానికి పానిండియాఅనే హైప్ ను క్రియేట్ చేసి.. తానే ఇంతకుముందు తీసిన బాహుబలిని మించిన చిత్రారాజం అనే పబ్లిసిటీ దంచేసి..మొత్తంగా పెద్దగా కధేలేని సినిమాని మూడు గంటల పాటులాగిస్తూ రాజమౌళి ఆడిన కేళి..ఆర్ ఆర్ ఆర్..!
స్వరాజ్యసంగ్రామం నేపద్యంలో ఇద్దరు హీరోలతో తీసిన కథే..కాని అందులో ఒక హీరోకి స్వతంత్రం అనే కాన్సెప్టే తెలియదు.. అతగాడికి లక్ష్యమల్లా తమ తండా నుంచి దొరలు ఎత్తుకెళ్లిన అమ్మాయిని వెనక్కి తీసుకురావడం..
అయితే తండా మొత్తాన్ని కాపాడవలసిన బాధ్యతను గాలికి వదిలి బాలిక కోసం బ్రిటిష్ ఏలికల కోటను చేదించాలని బయలుదేరిన భీమ్ కు మధ్యలో ఓ బాయ్ ఫ్రెండ్..ఓ గర్ల్ ఫ్రెండ్.. ఎక్కడపెడితే అక్కడ ఆశ్రయం కల్పించే కుటుంబాలు..ఇన్ని మంచి పరిణామాలు సినిమాల్లోనే సాధ్యం..ఇంతా చేసి అమ్మాయిని రక్షించే ప్రక్రియలో స్నేహం సెంటిమెంట్ ను గాలికి వదిలేసి స్నేహితుడిని భయంకరంగా కొట్టేసిన ఉదంతం కూడా ఉందండోయ్..
సరే..అండర్ కవర్ ఫ్రీడం ఫైటర్ రామ్ చరణ్..ఇతగాడికి స్వరాజ్య కాంక్ష ఉంది సుమా.. ఎన్టీఆర్..చరణ్..ఇద్దరి స్నేహం..తండా నాయకుడు..దొరసానమ్మ
మధ్య ఎఫైర్..వీటితో ప్రథమార్థం కొంత సాఫీగా సాగినా సెకండాఫ్ లో పోరాటాలు బెంబేలెత్తించేసాయి.అవి ఉత్కంఠ భరితంగా అనిపించినా రాజమౌళి సినిమాలో ఏదీ గ్రాఫిక్కో..ఇంకేది రియలిస్టిక్కో తెలియని అయోమయం ఉంటుంది..
హీరోల కండలు కూడా ప్రతి సృష్టేనేమో అనిపించే రీతిలో సాగింది సినిమా..
ఇక భీమ్..రాజు.. (ఇతగాడు చివరాఖర్లో అల్లూరి సీతారామరాజులా సడెన్ గా మారిపోయాడు..)
ఇలాంటి ఇద్దరు వీరులు నిజంగా ఉండి ఉంటే స్వతంత్రం చాలా ముందే వచ్చి ఉండేదేమో..
ఇది మన మహానేతలు చేసిన అపూర్వమైన పోరాటాన్ని కించపరచడం కాదు గాని
మన సినిమా కథానాయకులు ఒక్కో ట్రిప్పులో వెయ్యి మంది సైనికులను అలవోకగా చంపేస్తున్న వైనం చూస్తే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది..ఏ దేశంలోనైనా కూడా సైనికులు ఇంత గొప్పగా పోరాడే నైపుణ్యం కలిగి ఉండరేమో..అసలు భారతంలో భీముడికి..
అర్జునుడికి సైతం ఇంత పోరాట పటిమ ఉందో లేదో..డౌటే..!
గవర్నర్ ప్యాలస్ లో ఉన్న తండా పిల్లని తీసుకురావడానికి రోజుల పాటు స్కెచ్ వేసి ప్రయత్నించిన ఎన్టీఆర్ మిత్రుడు చరణ్
దుర్భేద్యమైన ఇంగ్లీషోళ్ల చెరసాలలో..
మానవ మాత్రుడు చేరలేని సోలిటరీ సెల్లో ఉంటే క్షణాల్లో
చేరిపోయి విడిపించి తెచ్చేస్తాడు..సినిమా అంటే కేవలం వినోదమే..
తీసింది చూడు..వివరాలు అడగొద్దు..
అనే పాఠాన్ని మనకి చాలాకాలం నుంచి డైరెక్టర్లు చెబుతూ వస్తున్నా మరీ సూపర్ మాన్…బ్యాట్ మన్ స్ధాయిలో హీరోల విన్యాసాలను చూపిస్తుంటే
జీర్ణం కావడం కొంచెం కష్టమే!
రాజమౌళి సినిమాలో ఫోటోగ్రఫీ కీలకం..
కీరవాణి సంగీతం ప్రత్యేకం..
గ్రాఫిక్స్ ప్రాణాంతకం…
సినిమాలో ఇంగ్లీషు నేపథ్యం ఉంది కదా అనుకున్నా నిజంగానే ఇంగ్లీషు డబ్బింగ్ సినిమానే చూస్తున్నట్టు అనిపించింది.కథా నేపథ్యం..
సాంకేతికత..ఇత్యాదుల వల్ల
అలా అనిపించిందేమో మరి!
ఈ సినిమాకి ప్రధాన ఎస్సెట్ ఎన్టీఆర్..చరణ్…ఆ ఇద్దరి ఎనర్జీ..
ఒకనాటి సినిమాల్లో ఎన్టీఆర్..
కాంతారావు..
నిన్న మొన్నటి షోలేలో అమితాబ్..ధర్మేంద్ర.. కాంబినేషన్లా..ఆ ఇద్దరి జంట
సినిమా భారాన్ని మోసి హిట్టు అనిపించేలా ముందుకు తీసుకు వెళ్ళింది..
ఓ చిన్న స్టోరీ లైన్..దానికి స్వరాజ్య పోరాటం వంటి నేపథ్యాన్ని జోడించి..
యధావిధిగా కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ సినిమాగా మలచి..అలవాటు ప్రకారం సంవత్సరాల పాటు నిర్మాణం సాగించి..ఈలోగా జనాల్లో ఉత్కంఠ రేకెత్తించి…
హైప్ సృష్టించి..ఆనక జనాల మీదకి సంధించి జక్కన్న ఇచ్చే ఆర్టిఫిషియల్ కిక్కన్నమాట..ఇదంతా..
మామూలుగా గతంలో విఠలాచార్య అలవోకగా..
కోడి రామకృష్ణ అనాయాసంగా తీసేసిన సినిమాలను ఓ భారీ ప్రాజెక్టుగా చిత్రించి..పంచవర్ష ప్రణాళికగా చిత్రీకరించడం రాజమౌళి కేళి..
మూడు గంటల పాటు జనాల్ని సినిమాలో కూర్చోబెట్టడం గతంలో కెవిరెడ్డి..ఆదుర్తి సుబ్బారావు.. మధుసూధన రావు..పుల్లయ్య ద్వయం..దాసరి నారాయణ రావు..విశ్వనాథ్ వంటి ఎంతో మంది డైరెక్టర్లకు చెల్లింది..
కథలో బలం లేకుండా
అదనపు హంగులు..
ఆర్భాటాలు అవసరం ఉన్నా లేకపోయినా సమకూర్చి,జనాల్లో సినిమా పట్ల ఆసక్తి పెంచి..పనిలో పనిగా హీరోలు సంవత్సరాల పాటు ఇంకో సినిమాలో నటించకుండా అట్టిపెట్టి
కోట్లాది రూపాయలు క్యాష్ ఖర్చు చేసి ఫలానా తేదీన విడుదల అనే ఫ్లాష్ ను చాలా కాలం ముందే ఒదలడం రాజమౌళి అమలుచేసే గ్రాఫిక్ ను
మించిన టెక్నిక్..!
ఇంతకీ RRR అంటే..
RAJAMOULIs RARE & ROUTINE.. అన్నమాట..
సమజైందా…!స్వస్తి..!!

పనిలో పనిగా రామ్ చరణ్ తేజకి జన్మదిన శుభాకాంక్షలు…

సురేష్ కుమార్ E
9948546286

LEAVE A RESPONSE